జయ అనొద్దన్నందుకు అలిగి వెళ్లారు
చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి జయలలితను పేరు పెట్టి పిలవొద్దని స్పీకర్ సూచించినందుకు ప్రతిపక్షం డీఎంకే వాకౌట్ చేసింది. తమకు ఒక న్యాయం వారికి ఒక న్యాయమా అని నిలదీస్తూ సభ నుంచి బయటకు వెళ్లిపోయింది. ఒకసారి బడ్జెట్ సమావేశాల సమయంలో ఏఐఏడీఎంకే ఎమ్మెల్యే పీఎం నరసిమన్ డీఎంకే చీఫ్ కరుణానిధి అంటూ సంబోధించాడు. దీంతో సభలో ఉన్న డీఎంకే ఎమ్మెల్యేలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. పేరు పెట్టి పిలవడంపై స్పీకర్ ను నిలదీశారు. దీనికి స్పీకర్ పీ ధన్ పాల్ స్పందిస్తూ మాజీ ముఖ్యమంత్రిని పేరు పెట్టి పిలవొచ్చు అని బదులిచ్చారు.
ఈ సమాధానాన్ని ఆసరాగా తీసుకున్న డీఎంకే జయలలిత విషయంలో కూడా అలాగే చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే, అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిని అలా పిలవొచ్చా అని ప్రశ్నించారు. అయితే, అలా చేయకూడదు అని స్పీకర్ బదులిచ్చారు. ఇది నా ఆర్డర్ కూడా అని ఆదేశించాడు. దీంతో ఒక్కసారిగా డీఎంకే ఎమ్మెల్యేలంతా సభలో ఆందోళన వ్యక్తం చేసి వాకౌట్ చేశారు. స్పీకర్ ఆదేశాలు చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఎమ్మెల్యేను పేరు పెట్టి పిలవకూడదని ఏ అసెంబ్లీలో కూడా లేదని, అలాంటిది కొత్త నిబంధనను స్పీకర్ తీసుకొస్తున్నారని ప్రతిపక్ష నేత స్టాలిన్ విమర్శించారు.