కావేరి బోర్డు ఏర్పాటును కోరుతూ తమిళనాడులో బంద్‌కు పిలుపు ఇచ్చిన డీఎంకే
సాక్షి, చెన్నై: కావేరీ జలాలపై బోర్డు ఏర్పాటులో కేంద్రం వైఫల్యాన్ని నిరసిస్తూ డీఎంకే పిలుపు మేరకు గురువారం తమిళనాడులో బంద్ కొనసాగుతోంది. రోడ్డు, రైల్ ట్రాఫిక్‌కు అవాంతరాలు ఏర్పడటంతో జనజీవనం స్థంభించింది. తమిళనాడు రాజధాని చెన్నైలో నిరసనలు మిన్నంటాయి. అన్నా సలై, కొడంబాక్కం, నంగంబాక్కం తదితర ప్రాంతాల్లో నిరసనకారులు ప్రదర్శనలతో హోర్తెతించారు.
ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో ఉద్యోగులు, విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బస్సు సర్వీసులపై బంద్ ప్రభావం కనిపించింది. హోసూర్, తిరుచ్చిలోనూ బస్సుల రాకపోకలను ఆందోళనకారులు అడ్డుకున్నారు. కేఎస్‌ఆర్‌టీసీ అంతరాష్ట్ర సర్వీసులను కూడా పలు చోట్ల ఆందోళనకారులు అడ్డుకున్నారు. నిరసనలతో తమిళనాడు నుంచి రాకపోకలు సాగించే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. బంద్ నేపథ్యంలో స్ధానిక వ్యాపారులు తమ దుకాణాలను మూసివేశారు. డీఎంకే బంద్ పిలుపునకు రైతులు, వ్యాపారులు, కార్మిక సంఘాలు, న్యాయవాదులు ఇతర ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి.
చెన్నైలోని మౌంట్ రోడ్డులో ప్రతినక్ష నేత స్టాలిన్ నేతృత్వంలో జరిగిన ఆందోళనలో వీసీకే, ఎండిఎంకె, వామపక్షాలు పాల్గొనటంతో నగరం స్తంభించింది. వేలాదిగా పాల్గొన్న కార్యకర్తలతో మౌంట్ రోడ్డు జనసంద్రమైంది. ర్యాలీగా ఆందోళనలతో ముందుకు సాగటంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో పోలీసులు స్టాలిన్, వైగో, తిరుమావళవన్, వామపక్ష నేతలను అరెస్టు చేసి స్థానిక పోలీస్టేషన్లకు తరలించారు. ఇక వేలూరు, పుదుచ్చేరిలో బంద్ హింసాత్మకంగా మారింది.
బస్సుల ధ్వంసం
ఆందోళనకారులు ప్రభుత్వ బస్సులను ధ్వంసం చేయగా పలు ప్రాంతాల్లో బస్సులకు నిప్పంటించటం ఉద్రిక్తతకు దారితీసింది. పుదుచ్చేరి, తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో ఆరు బస్సులను ఆందోళనకారులు ద్వంసం చేశారు.వేలూరులో ఆందోళనకారుల ఆగ్రహానికి 15 బస్సులు ద్వంసమయ్యాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థకు చెందిన రెండు బస్సులను ఆందోళన కారులు ద్వంసం చేయటం గమనార్హం. పలుజిల్లాల్లో బంద్ ప్రశాంతంగా సాగినా, వేలూరు, చెన్నై, పుదుచ్చేరి ప్రాంతాల్లో ఆందోళనలు ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది.
Comments
Please login to add a commentAdd a comment