చెట్టినాడు గ్రూప్ సంస్థలపై దాడులు
చెన్నై : చెట్టినాడు గ్రూపు మధ్య నెలకొన్న వివాదంతో ఆదాయ పన్ను శాఖ అప్రమత్తమైంది. బుధవారం చెట్టినాడు గ్రూప్ సంస్థలపై ఆదాయపన్ను శాఖ అధికారులు భారీగా దాడులు చేస్తున్నారు. సుమారు 450 మంది సభ్యులతో కూడిన బృందం ఆధ్వర్యంలో ఈ దాడులు జరుగుతున్నాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ , మహారాష్ట్ర లోని 40 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ దాడులు జరిగాయి. చెట్టినాడు సంస్థ 252 కోట్ల రూపాయల పన్ను బకాయిలను ప్రభుత్వానికి ఎగవేశారనే అనుమానంతో ఈ దాడులు చేస్తున్నట్లు ఆదాయ పన్ను శాఖ అధికారులు తెలిపారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ ఎంపీ, చెట్టినాడు గ్రూప్ ఎండీ ఎంఎఎం రామస్వామి తన దత్తకుమారుడు ఎంఎఎంఆర్ ముత్తయ్య (అయ్యప్పన్) తో సంబంధాలు తెంచుకుంటున్నట్లు మంగళవారం చెట్టినాడు భవన్‌లో మీడియాకు తెలిపారు. తన ఆస్తి మొత్తం తన తదనంతరం సేవా కార్యక్రమాలకు వెళుతుందన్నారు. ఇందుకోసం డాక్టర్ ఎంఎఎం రామస్వామి చెట్టియార్ ఆఫ్ చెట్టినాడు చారిటబుల్ ట్రస్ట్, డాక్టర్ ఎంఎఎం రామస్వామి చెట్టియార్ ట్రస్ట్ అని రెండు సేవా సంస్థలను ప్రారంభించామన్నారు. తన మరణానంతరం మిగిలి ఉండే ఆస్తులన్నీ ఈ ట్రస్టులకు చెందాలని విల్లును కూడా రిజిస్టర్ చేసినట్లు రామస్వామి తెలిపారు. తన అంత్యక్రియలు, కర్మకాండలు ముత్తయ్య నిర్వహించడానికి వీల్లేదని ఆయన ప్రకటించారు.
అయితే కంపెనీ ఎండీ ముత్తయ్య మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. రామస్వామికి చెట్టినాడు కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని ముత్తయ్య తేల్చి చెప్పారు. కంపెనీకి సంబంధంలేని బయటి వ్యక్తి ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. తమ సంస్థ ప్రతి నెలా విధిగా ఆదాయ పన్నులు చెల్లిస్తోందన్నారు.