డీజిల్‌పై ఒకే పన్ను విధానం!
రాష్ట్రాలతో సంప్రదింపులకు సిద్ధమైన కేంద్రం
న్యూఢిల్లీ: అన్ని రాష్ట్రాల్లోనూ డీజిల్ ధర ఒకే స్థాయిలో ఉండేలా చూసేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. డీజిల్‌పై ఒకే పన్ను విధానం అమలు చేసే యత్నాల్లో భాగంగా రాష్ర్ట ప్రభుత్వాలతో సంప్రదింపులకు సిద్ధమైంది. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో స్థానిక పన్నులను అధికంగా విధిస్తుండటం వల్ల ఆయా ప్రాంతాల్లో డీజిల్ రేటు అధికంగా ఉంటోంది. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ. 57.84గా ఉంటే.. మహారాష్ర్టలోని ముంబైలో మాత్రం ఇది రూ. 66.01గా ఉంది. స్థానికంగా విధిస్తున్న పన్నుల(సేల్స్‌ట్యాక్స్ లేదా వ్యాట్‌తో పాటు ఆక్ట్రాయ్, ఎంట్రీ టాక్స్ వంటి ఇతర పన్నులు)తో కలిపి ఒక్కో రాష్ర్టంలో ఒక్కో రేటు ఉంటోంది.
ఇలాంటి విధానానికి స్వస్తి పలికి దేశవ్యాప్తంగా ఒకే రకమైన పన్ను విధానాన్ని అమలు చేయాలని ప్రధాని మోడీ భావిస్తున్నారు. ఇందులో భాగంగా డీజిల్‌పై స్థానికంగా అధిక పన్నులు వసూలు చేస్తున్న 12 రాష్ట్రాలను ప్రత్యేక భేటీకి ఆహ్వానిస్తూ కేంద్రం లేఖ రాసింది. ఈ నెలాఖరున 6 రాష్ట్రాలతో(అస్సాం, బీహార్, హర్యానా, కర్ణాటక, ఉత్తరాఖండ్, కేరళ), వచ్చే నెల 5, 6 తేదీల్లో మరో 6 రాష్ట్రాలతో(మహారాష్ర్ట, ఎంపీ, రాజస్థాన్, తమిళనాడు, పశ్చిమబెంగాల్, యూపీ) చర్చలు జరపాలని నిర్ణయిం చింది. వినియోగదారులకు అనుకూల విధానాలను పాటించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలిపింది.