ఇంట్లో ఫిర్యాదు చేశారని టీచర్ని దారుణంగా..
న్యూఢిల్లీ: తమ జీవితాన్ని ఒక క్రమ పద్ధతిలోకి తీసుకొచ్చే ప్రత్యక్ష దైవం గురువు అంటే గౌరవం, మర్యాద లెక్కలేకుండా పోయి చాలా రోజులయింది. అయితే, అదే గురువుపై ప్రస్తుతం భయం కూడా పోవడమే కాకుండా విచక్షణ కూడా లేకుండా పోయిందని ఓ సంఘటన స్పష్టం చేసింది. ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. తమ దుష్ప్రవర్తన గురించి ఇంట్లో ఫిర్యాదు చేసినందుకు ఓ ఉపాధ్యాయుడిపై ఇంటర్మీడియట్ విద్యార్థులు కత్తితో దాడి చేశారు.
ఆరేడుగురు కలిసి ఆ ఉపాధ్యాయుడిని దారుణంగా పొడవడంతో ఆయన ప్రాణాలుకోల్పోయాడు. ఈ నేరానికి పాల్పడినవారిలో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమ ఢిల్లీలోని నాంగ్లోయి ప్రాంతంలోగల గవర్నమెంట్ సీనియర్ సెకండరీ స్కూల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. స్కూలు యాజమాన్యం చెప్పిన వివరాల ప్రకారం.. ముఖేశ్ కుమార్ అనే హిందీ టీచర్ సోమవారం పరీక్ష నిర్వహిస్తుండగా తరగతి గదిలోకి వచ్చిన విద్యార్థులు అక్కడే అతడిని కత్తితో పొడిచారు. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించగా తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయాడు.