
అత్యాచారం.. మత మార్పిడికి వేధింపులు
సాక్షి, లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో మరో దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గత 10 రోజులుగా 16 ఏళ్ల యువతిపై నలుగురు దుండగులు అత్యాచారం చేయడంతో పాటు.. మతం మార్చుకొమ్మని వేధించిన ఘటన తాజాగా బయటకు వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి ముజఫర్ నగర్ జిల్లా భోపా సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మహమ్మద్ రిజ్వాన్ మాట్లాడుతూ.. 16 ఏళ్ల అమ్మాయి తనపై అక్రమ్, అస్లామ్, ఆయూబ్, సలీమ్ అనే నలుగురు కుర్రాళ్లు గ్యాంగ్ రేప్ చేశారని ఫిర్యాదు చేసిందన్నారు. అత్యాచారంతో పాటు బలవంతంగా మాంసం తినమని ఒత్తిడి చేయడంతో పాటే మతం మార్చుకొమ్మని హింసలు పెట్టినట్టు ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు.
బాధిత యువతి ముజఫర్ నగర్‌కు దగ్గరలోని కుక్రా గ్రామంలో దగ్గరి బంధువులతో కలిసి జీవస్తోంది. ఆమె ఈ నెల 6 ముజఫర్ నగర్ నుంచి ఇంటికి వెళ్లేందుకు బస్టాండ్‌లో ఉండగా.. దుండగులు లిఫ్ట్ ఇస్తామని చెప్పారు. ముక్కుమొహం తెలియని వాళ్ల వాహనం ఎక్కని కరాఖండీగా చెప్పడంతో నలుగురు బలవంతంగా బాలికను కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. వరుసగా 10 రోజులపాటు బాధితురాలిని నిర్భంధించి.. అత్యాచారం చేయడంతో పాటు అమానవీయంగా ప్రవర్తించారని సీఐ పేర్కొన్నారు. నిందితులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంతో పాటు, పోస్కో(ప్రొటక్షన్ ఆఫ్ చిల్ట్రన్ ఫ్రమ్ సెక్సువల్ ఆఫెన్సెస్) చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు సీఐ మహమ్మద్ రిజ్వాన్ చెప్పారు.