తేజ్‌పాల్ చేష్ట అత్యాచారమే!
న్యూఢిల్లీ: తెహెల్కా వ్యవస్థాపక ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ గోవాలో తనపై జరిపిన లైంగిక దాడి చట్ట ప్రకారం అత్యాచార నిర్వచనం పరిధిలోకే వస్తుందని బాధిత యువ జర్నలిస్టు పేర్కొంది. తేజ్‌పాల్‌పై తన ఫిర్యాదు ఎన్నికలకు ముందు తెరపైకి తెచ్చిన రాజకీయ కుట్రలో భాగమన్న ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండించింది. ఈ ఆరోపణలు తనను తీవ్ర కలతకు గురిచేశాయని తెలిపింది. ఈ మేరకు ఆమె శుక్రవారం రెండు పేజీల ప్రకటన విడుదల చేసింది. ‘తేజ్‌పాల్ తన ఆస్తిని, పలుకుబడిని, హోదాను కాపాడుకునేందుకు పోరాడుతుంటే నేను మాత్రం నా చిత్తశుద్ధిని చాటుకునేందుకు, నా శరీరం నా సొంతమనే హక్కును చాటిచెప్పేందుకు...అది యజమానులు ఆడుకునే ఆటవస్తువు కాదని నొక్కిచెప్పేందుకే పోరాడుతున్నా’ అని స్పష్టం చేసింది.
అదే సమయంలో గత పదిహేను రోజులుగా అన్ని వర్గాల నుంచి తనకు లభిస్తున్న మద్దతు తనను కదిలించిందని బాధితురాలు పేర్కొంది. ‘కానీ అన్నీ బాగా తెలియూల్సిన టీవీ వ్యాఖ్యాతలు కూడా నేను ఫిర్యాదు చేసేందుకు సమయం తీసుకోవడాన్ని ప్రశ్నించారు. మరికొందరు వ్యాఖ్యాతలు రేప్ వంటి పదాలకు బదులుగా లైంగిక దాడి (సెక్సువల్ మోలెస్టేషన్) పదం వాడటాన్ని ప్రశ్నించారు. లైంగిక దాడి బాధితురాలిగా నన్ను నేను పరిగణించుకోవడానికి, నా సహచరులు, స్నేహితులు, మద్దతుదారులు విమర్శకులు నన్ను ఆ విధంగా చూడటానికి.. నేను సిద్ధంగా ఉన్నానో లేదో తెలియదు. నేరాలను వర్గీకరించేది బాధితులు కాదు..చట్టం. ఈ కేసులో చట్టం స్పష్టంగా ఉంది.
నా విషయంలో తేజ్‌పాల్ చేసింది అత్యాచారానికి ఉన్న చట్టబద్ధమైన నిర్వచనం పరిధిలోకే వస్తుంది’ అని ఆ ప్రకటనలో బాధితురాలు వివరించింది. ‘అత్యాచారానికి ఉన్న నిర్వచనాన్ని విస్తృతం చేసే కొత్త చట్టం ఇప్పుడు మనకుంది. కొత్త చట్టం కేవలం అనామకులకే కాదు ధనికులకు, శక్తిమంతులకు, ప్రముఖులకు అందరికీ వర్తించాలి. తేజ్‌పాల్ మాదిరి నేను సంపద ఉన్న వ్యక్తిని కాదు. మా అమ్మ నన్ను ఒంటి చేత్తో ఒకే ఒక్క ఆదాయంతో పెంచింది. ఇప్పటికీ ఎన్నో ఏళ్లుగా మా నాన్న ఆరోగ్యం బాగాలేదు. నేను చేసిన ఫిర్యాదు వల్ల నేను ఎంతగానో ప్రేమించిన ఉద్యోగంతోపాటు ఆర్థిక భద్రతను, వేతన స్వాతంత్య్రాన్ని కోల్పోయూను. ఇది ఏమాత్రం సులభమైన యుద్ధం కాబోదు’ అని ఆమె పేర్కొంది. కాగా, తన కుమార్తెపై లైంగిక దాడి ఘటనలో వాస్తవాలు త్వరలోనే బయటకు వస్తాయని బాధితురాలి తల్లి పేర్కొంది. ఈ ఘటనపై తొలుత క్షమాపణ చెప్పిన తేజ్‌పాల్ ఆ తర్వాత తన కుమార్తె వ్యక్తిత్వాన్ని ప్రశ్నించాడని, ప్రస్తుతం పోలీసులకు చిక్కకుండా పారిపోతున్నాడని ఆమె మాటలను ఉటంకిస్తూ బెంగాలీ పత్రిక ఎయిబేలా ప్రచురించింది.