వాళ్లిద్దరూ క్షేమంగానే ఉన్నారు...
న్యూఢిల్లీ : లిబియాలో బందీలుగా ఉన్న తెలుగువారు క్షేమంగా ఉన్నారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాశ్ స్వరూప్ తెలిపారు. అక్కడ అంతర్గత పరిస్థితే కల్లోలంగా ఉందని, తిరుగుబాటుదారుల మధ్య గొడవులు జరుగుతున్నాయని ఆయన సోమవారమిక్కడ పేర్కొన్నారు. బందీలుగా ఉన్న తెలుగువారిని విడిపించడానికి మార్గం సుగమం కాలేదని వికాశ్ స్వరూప్ తెలిపారు. లిబియాలో భారత రాయబార కార్యాలయం కూడా లేదని, మూడో వ్యక్తి ద్వారా విడిపించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు.
కాగా ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్.. లిబియాలో ఇద్దరు తెలుగు ప్రొఫెసర్లను అపహరించిన విషయం తెలిసిందే.. నెల రోజులు దాటినా ఇప్పటికీ వారు విడుదలకు నోచుకోవడం లేదు. దీంతో వారి కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. జూలై 29న... లిబియాలోని సిర్త్ యూనివర్సిటీలో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న తెలుగువారు బలరామ్ కిషన్, టి.గోపీకృష్ణ, కర్ణాటకకు చెందిన విజయ్‌కుమార్, లక్ష్మీకాంత్‌లు కిడ్నాప్ అయ్యారు. అయితే వారిలో కర్ణాటకకు చెందిన విజయ్ కుమార్, లక్ష్మీకాంత్లు విడుదల అయ్యారు. బలరామ్ కిషన్, గోపీకృష్ణ మాత్రం ఇంకా బందీలుగానే ఉన్నారు.