న్యూఢిల్లీ: భూగోళంలో వాతావరణ మార్పుల ప్రభావం భవిష్యత్తులో దేశంపై ప్రతికూలంగా ఉండనుందని కేంద్రం అంచనా వేసింది. ఈ శతాబ్దాంతానికల్లా దేశంలో ఉష్ణోగ్రతలు సరాసరిన 4.4 డిగ్రీలు పెరగనుండగా, వేసవి వడగాల్పుల తీవ్రత 3 నుంచి 4 రెట్లు పెరిగే అవకాశాలున్నాయని కేంద్ర భూ విజ్ఞాన శాఖ పేర్కొంది. సెంటర్ ఫర్ క్లైమేట్ రీసెర్చ్ వారి ఆ నివేదికలోని ముఖ్యాంశాలివీ..
► కర్బన ఉద్గారాల కారణంగా 1901–2018 సంవత్సరాల మధ్య దేశంలో ఉష్ణోగ్రత సగటున 0.7 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగింది.
► 1986 –2015 మధ్య 30 ఏళ్ల కాలంలో అత్యంత వేడి, అత్యంత చల్లని రోజుల్లో ఉష్ణోగ్రతలు 0.63, 0.4 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగాయి. ఈ శతాబ్దాంతానికి అత్యంత వేడి, అత్యంత చల్లని దినాల్లో ఉష్ణోగ్రతలు వరుసగా 4.7, 5.5 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగే అవకాశముంది. భవిష్యత్తులో అత్యంత వేడి, అత్యంత చల్లని రోజులు నమోదులో 55, 70 శాతం మేర పెరుగుతాయి.
► ఏప్రిల్–జూన్‌ల మధ్య దేశంలో సాధారణంగా సంభవించే వడగాడ్పుల తీవ్రత రాబోయే కాలంలో 3 నుంచి 4 శాతం మేర పెరగనుంది. వడగాల్పులు వీచే సమయం కూడా రెట్టింపు కానుంది. ఇది ముఖ్యంగా గంగా, సింధు నదీ పరివాహక ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. దేశంలో రుతు పవనాలకు కారణమయ్యే హిందూ మహా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో 1951–2015 కాలంలో సగటున ఒక డిగ్రీ చొప్పున నమోదయింది. ఇది ప్రపంచ సగటు 0.7 కంటే ఎక్కువ.
► ఉత్తర హిందూ మహా సముద్రంలో సముద్ర మట్టాలు 1874– 2004 కాలంలో ఏడాదికి 1.06 నుంచి 1.75 మిల్లీమీటర్ల చొప్పున పెరిగాయి. 1986–2005 కాలంతో పోల్చి చూసుకుంటే శతాబ్దాంతానికి సుమారు 300 మిల్లీమీటర్లమేర పెరిగే అవకాశం.
మరో 4 డిగ్రీలు పైపైకి..!
Published Tue, Jun 16 2020 4:58 AM | Last Updated on Tue, Jun 16 2020 4:58 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment