climate researchers
-
Climate Transparency Report 2022: భారత్‌ను దెబ్బతీసిన వాతావరణ మార్పులు
న్యూఢిల్లీ: వాతావరణ మార్పులు మన దేశాన్ని ఆర్థికంగా కూడా తీవ్ర నష్టాన్ని కలుగజేస్తున్నాయి. 2021లో వడగాడ్పులకి భారత్‌కి 15,900 కోట్ల డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లిందని క్లైమేట్ ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్–2022 వెల్లడించింది. పర్యావరణం, వాతావరణ మార్పులపై అధ్యయనం చేస్తున్న కొన్ని అంతర్జాతీయ సంస్థలు కలసికట్టుగా ఈ నివేదిక రూపొందించాయి. వ్యవసాయం, నిర్మాణం, తయారీ, సేవా రంగాల్లో ఈ నష్టం వాటిల్లింది. దేశ స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ)లో 5.4% నష్టం జరిగినట్టు ఆ నివేదిక వివరించింది. ఆ నివేదికలో ఏముందంటే..! ► మండే ఎండలతో గత ఏడాది దేశంలో 16,700 పని గంటలు వృథా అయ్యాయి. 1990–1999తో పోల్చి చూస్తే 39% పెరిగింది. ► 2016–2021 మధ్య కాలంలో తుపానులు, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడి 3.6 కోట్ల హెక్టార్లలో పంటలకి నష్టం వాటిల్లింది. దీంతో రైతన్నలు 375 కోట్ల డాలర్లు నష్టపోయారు. ► దేశంలో 30 ఏళ్లలో వర్షాలు పడే తీరులో ఎన్నో మార్పులు వచ్చాయి. వ్యవసాయం, అటవీ, మత్స్య ఆర్థిక ప్రభావాన్ని కనబరిచింది. ► 1850–1900 మధ్య కాలంతో పోల్చి చూస్తే భూ ఉష్ణోగ్రతలు 1.1 డిగ్రీల సెల్సియస్ పెరిగాయి ► వాతావరణ మార్పుల ప్రభావం అన్ని దేశాలతో పాటు భారత్‌పై రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. నిలువ నీడ లేని వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. ► వాతావరణ మార్పులతో జరుగుతున్న నష్టాన్ని అరికట్టాలంటే ప్రపంచ దేశాలు భూ ఉష్ణోగ్రతల్ని 2 డిగ్రీల సెల్సియస్ కంటే తగ్గించడానికి కృషి చేయాలి. 2015 పారిస్ ఒప్పందాన్ని అన్ని దేశాలు వినియోగించడమే దీనికి మార్గం. ► పర్యావరణ మార్పుల్ని కట్టడి చేయాలంటే మనం వాడుతున్న ఇంధనాలను మార్చేసి, పర్యావరణ పరిరక్షణ కోసం చర్యలు చేపట్టాల్సి అవసరం ఉందని ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్‌లో ఎర్త్ సైన్సెస్, క్లైమేట్ చేంజ్ డైరెక్టర్ సురుచి భద్వాల్ పేర్కొన్నారు. -
మరో 4 డిగ్రీలు పైపైకి..!
న్యూఢిల్లీ: భూగోళంలో వాతావరణ మార్పుల ప్రభావం భవిష్యత్తులో దేశంపై ప్రతికూలంగా ఉండనుందని కేంద్రం అంచనా వేసింది. ఈ శతాబ్దాంతానికల్లా దేశంలో ఉష్ణోగ్రతలు సరాసరిన 4.4 డిగ్రీలు పెరగనుండగా, వేసవి వడగాల్పుల తీవ్రత 3 నుంచి 4 రెట్లు పెరిగే అవకాశాలున్నాయని కేంద్ర భూ విజ్ఞాన శాఖ పేర్కొంది. సెంటర్ ఫర్ క్లైమేట్ రీసెర్చ్ వారి ఆ నివేదికలోని ముఖ్యాంశాలివీ.. ► కర్బన ఉద్గారాల కారణంగా 1901–2018 సంవత్సరాల మధ్య దేశంలో ఉష్ణోగ్రత సగటున 0.7 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగింది. ► 1986 –2015 మధ్య 30 ఏళ్ల కాలంలో అత్యంత వేడి, అత్యంత చల్లని రోజుల్లో ఉష్ణోగ్రతలు 0.63, 0.4 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగాయి. ఈ శతాబ్దాంతానికి అత్యంత వేడి, అత్యంత చల్లని దినాల్లో ఉష్ణోగ్రతలు వరుసగా 4.7, 5.5 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగే అవకాశముంది. భవిష్యత్తులో అత్యంత వేడి, అత్యంత చల్లని రోజులు నమోదులో 55, 70 శాతం మేర పెరుగుతాయి. ► ఏప్రిల్–జూన్‌ల మధ్య దేశంలో సాధారణంగా సంభవించే వడగాడ్పుల తీవ్రత రాబోయే కాలంలో 3 నుంచి 4 శాతం మేర పెరగనుంది. వడగాల్పులు వీచే సమయం కూడా రెట్టింపు కానుంది. ఇది ముఖ్యంగా గంగా, సింధు నదీ పరివాహక ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. దేశంలో రుతు పవనాలకు కారణమయ్యే హిందూ మహా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో 1951–2015 కాలంలో సగటున ఒక డిగ్రీ చొప్పున నమోదయింది. ఇది ప్రపంచ సగటు 0.7 కంటే ఎక్కువ. ► ఉత్తర హిందూ మహా సముద్రంలో సముద్ర మట్టాలు 1874– 2004 కాలంలో ఏడాదికి 1.06 నుంచి 1.75 మిల్లీమీటర్ల చొప్పున పెరిగాయి. 1986–2005 కాలంతో పోల్చి చూసుకుంటే శతాబ్దాంతానికి సుమారు 300 మిల్లీమీటర్లమేర పెరిగే అవకాశం. -
30వ తేదీకల్లా కేరళకు నైరుతి రుతుపవనాలు
న్యూఢిల్లీ: భారత ఉపఖండానికి వర్ష రుతువును తీసుకొచ్చే నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది రెండు రోజులు ముందుగానే రానున్నాయి. మామూలుగా జూన్ 2వ తేదీన కేరళ తీరాన్ని తాకాల్సిన ఈ రుతుపవనాలు ఈ నెల 30వ తేదీకల్లా అక్కడకు వచ్చేస్తాయని వాతావరణ పరిశోధకులు చెప్తున్నారు. రానున్న మూడు, నాలుగు రోజుల్లో రుతుపవనాలు అండమాన్ సముద్రంపై విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. అయితే.. గత ఏడాది లాగానే ఈ ఏడాది కూడా ఎల్ నినో ప్రభావంతో సాధారణం కన్నా తక్కువ వర్షాలే కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.