జంతు విడిభాగాలతో వ్యాపారం.. పూజారి అరెస్ట్
కర్గోన్(మధ్యప్రదేశ్) :
వన్యప్రాణులను వధించి వాటి విడిభాగాలతో వ్యాపారం చేస్తున్న ఓ పూజారిని అధికారులు వల పన్ని పట్టుకున్నారు. మధ్య ప్రదేశ్లో కర్గోన్లోని ఓ దేవాలయంలో పూజారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న లోకేశ్ జాగిర్దార్ను ఢిల్లీ నుంచి వచ్చిన వైల్డ్ లైఫ్ క్రైం కంట్రోల్ బ్యూరో (డబ్య్లూసీసీబీ), ఎస్టీఎఫ్, ఫారెస్ట్ అధికారుల జాయింట్ ఆపరేషన్లో అరెస్ట్ చేశారు.
సంప్రదాయ పద్దతుల్లో వన్యప్రాణుల శరీరాల నుంచి ఔషదాలు, చేతబడి పద్దతులతో అదృష్ట ఆభరణాలను లోకేశ్ జాగిర్దార్ తయారు చేసి ఆన్లైన్లో అమ్మకానికి పెట్టేవాడు. అదృష్ట ఆభరణాలు ధరిస్తే.. మీ తలరాత మారిపోతుంది, అదృష్టం మీవెంటే ఉంటుంది అంటూ హామీలు గుప్పించి, వినియోగదారులకు తన ఉత్పత్తులను అమ్మి సొమ్ము చేసుకునే వాడని అధికారులు తెలిపారు.
ఆన్లైన్ ద్వారా తాను తయారు చేసిన ఉత్పత్తులను అమెరికా, మలేషియా, జర్మనీ, ఆస్ట్రేలియాలతో పాటూ మరిన్ని దేశాల్లో అమ్మేవాడని ఫారెస్ట్ అధికారి కే సోలంకి చెప్పారు. వన్యప్రాణుల భాగాలు, అతను తయారు చేసిన ఔషదాలు, అదృష్ట ఆభరాణాలను అధికారులు సీజ్ చేశారు.1972 వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని పలు సెక్షన్లకింద లోకేశ్ జాగిర్దార్పై కేసు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు.