అర్చకుల కుటుంబాల్లో ఆనంద దీపావళి ముందే వచ్చింది. దశాబ్దాలుగా పట్టించుకోని వారి కల ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీర్చారు. దేశంలో ఎన్నడూ లేనివిధంగా తొలిసారి ఆంధ్రప్రదేశ్‌లో 2007లో ధూపదీప నైవేధ్య పథకం తెచ్చి ఆలయాల ఉన్నతికి కృషి చేసిన ఘన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చరిత్రకెక్కితే, వేలాది అర్చకులకు తీరని కలగా ఉన్న వంశ పారంపర్య హక్కును భుక్తం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చి మరో ఘన చరిత్రకు ఆయన తనయుడు దారులు వేశారు. తద్వారా పలు అర్చకుల సంఘాల ఆనందం వ్యక్తం చేస్తూ తండ్రీ బిడ్డలకు కతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
సాక్షి, ఒంగోలు : దేవాలయాల్లో పూజలు, అర్చనలు చేస్తూ తరాలుగా పొట్ట పోసుకుంటున్న వేలాది అర్చకుల వంశ పారంపర్య హక్కును 1987లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రద్దు చేశారు. దరమిలా తర్వాత అధికారంలోకి వచ్చిన దివంగత ముఖ్యమంత్రి అర్చకుల కష్టాలను తెలుసుకుని రద్దు చేసిన చట్టానికి 2007లో 34/3 పేరుతో చట్టాన్ని సవరిస్తూ అర్చుకులకు వంశ పారంపర్య హక్కుల పూర్వోధ్ధరణ కోసం ఉత్తర్వులు తెచ్చారు. త్వరలో అర్చకుల సంక్షేమం కోసం ఉత్తర్వులు ఇవ్వాలనుకునే లోపు మత్యువు వారిని కబళించింది. తర్వాత అధికారంలోకి వచ్చిన వారు ఈ సవరణ ఉత్తర్వులను తొక్కిపెట్టారు. వంశ పారంపర్య హక్కులు కలిగివున్న అర్చకులకు కన్నీళ్లను వారు పట్టించుకోలేదు. 2017లో ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చి, నెల రోజుల్లో చర్యలు చేపడతామని బుకాయిస్తూ అర్చకుల సంక్షేమాన్ని గాలికి వదిలేశారు. మూడేళ్లు గడిచినా, ఎన్నిసార్లు అర్చకులు విన్నవించుకున్నా గత ప్రభుత్వం అర్చకుల విజ్ఞాపనలను కనీసంగా కూడా పట్టించుకోలేదు. అర్హులైన అర్చకులు, అర్చక సంఘాలు అప్పటి నుంచీ పోరాడుతూనే ఉన్నారు ఇందుకు సంబంధించి 2017లో పరిశీలిస్తామని జీవో నంబర్ 2 పేరుతో ఉత్తర్వులు ఇచ్చి, నెల్లాళ్లలో పరిశీలిస్తామని చెప్పిన గత ప్రభుత్వం అర్చకుల న్యాయమైన హక్కులకు జెల్ల కొట్టింది. ప్రిలిమినరీ నోటిఫికేషన్ మీద నెల రోజుల్లో స్పందిస్తానన్న గత ముఖ్యమంత్రి అర్చకులను మోసం చేశారు.
ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 2007లో తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో చేసిన చట్ట సవరణకు మరింతగా మెరుగులు దిద్ది, అర్చక సంక్షేమం, దేవాలయాల ఉన్నతిని కోరుతూ ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మన్మోహన్‌సింగ్ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులతో జిల్లాలో దాదాపు 90 శాతం ఆలయాల్లో పూజాదికాలు నిర్వహిస్తున్న వేలాది అర్చకులకు లబ్ది చేకూరనున్నది. ఈ ఉత్తర్వుల ప్రకారం దేవదాయ శాఖకు అనుబంధంగా ఉన్న ఆలయాలను మినహాయించి వంశపారంపర్యంగా హిందూ దేవాలయాల్లో పూజాదికాలు నిర్వహిస్తున్న వంశపారంపర్య అర్చకులు, మిరాశీదార్లకు లబ్ది చేకూరనున్నది. హింధూ ధర్మానికి చెందిన సంస్థల్లో 1987లో రద్దు చేసిన హక్కులను తిరిగి ఇప్పుడు సాకారం చేశారు. 1966 నుంచి వస్తున్న అర్చక వంశపారంపర్య హక్కును 1987లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కోల్పోయిన హక్కును తాత్కాలికంగా 2007లో పొందారు. దరిమిలా ఇప్పుడు సంపూర్ణ హక్కులను ఈ ఉత్తర్వు ద్వారా పొందనున్నారు.
బ్రాహ్మణ సేవా సమితి హర్షం
అర్చక, పురోహితుల హితం కోరుతూ అర్చకుల వారసత్వ హక్కును పునరుద్ధరిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయటం ఎంతో అభినందనీయమని బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్ష, కార్యదర్శులు సివిఎల్.సుబ్రహ్మణ్యం, గంజాం శ్రీరంగనాథ ప్రసాదులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వుల వల్ల అర్చకుల మనోభావాలు బలపడ్డాయని, చిన్నతరహా దేవాలయాల అర్చకులకు ఎంతో మేలు జరుగుతుందని ముఖ్యమంత్రికి కతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు సంక్షేమ సమితి కార్యవర్గ సభ్యులు మైనంపాటి సాయికుమార్, భీమశంకర శాస్త్రి, ఎంవి. శేషయ్య, శివకుమార్, వ్యామిజాల ప్రసన్నకుమార్, హరిప్రేమనా«థ్‌లు పేర్కొన్నారు.
అర్చక కుటుంబాలు రుణపడి ఉంటాయి..
రాష్ట్రవ్యాప్తంగా వేలాది అర్చక కుటుంబాలు సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి రుణపడి ఉంటాయి. వారి తండ్రి దివంగత రాజశేఖరరెడ్డి దేవాలయాల ఉన్నతి కోసం దేశంలోనే తొలిసారి ధూపదీప నైవేద్య పధకం ప్రవేశపెట్టి చరిత్ర సృష్టిస్తే, ఆ మహనీయుని కుమారుడిగా జగన్ అర్చకుల సంక్షేమం కోసం వంశ పారంపర్య చట్టానికి మోక్షం కలిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
– ఎం.ఏ శేషాచార్యులు, ప్రధాన కార్యదర్శి, అర్చక సంక్షేమ సంఘం
బ్రాహ్మణ జాతి రుణపడి ఉంటుంది..
సీఎం జగన్‌మోహనరెడ్డి ఎన్నికల ముందు పాదయాత్రలో బ్రాహ్మణులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. అర్చకుల కష్టాలను, జీతాలు లేక అల్లాడిపోతున్న తీరును పాదయాత్రలో జగన్ దృష్టికి తీసుకువెళ్లాం. దీనిని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి గత టీటీడీ ప్రభుత్వం చేయలేని పనిని ఈయన చేసి చూపించారు. బ్రాహ్మణుల సమస్యలపై డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి దృష్టికి తీసుకెళ్లాం. వంశపారంపర్య హక్కుల కొనసాగింపు, కనీస వేతనాల పెంపు, దూపదీప నైవేద్యం కింద రూ.5వేలు, ఆరుసి దేవస్థానంలో రూ.10 వేల నుంచి 16 వేలకు జీతాలు పెంపు, బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.100 కోట్ల విడుదల చేయడం అభినందనీయం. యావత్ బ్రాహ్మణ జాతి జగన్‌మోహనరెడ్డికి ఋణపడి ఉంటుంది.
– పలుకూరి సుబ్బారావు, అర్చక సంఘం రాష్ట్ర కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment