అరుణాచల్‌ప్రదేశ్ మలోగామ్ పోలింగ్ కేంద్రంలో ఏప్రిల్ 11న జరిగే పోలింగుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపు పది మంది ఎన్నికల సిబ్బందిని నియమిం చారు. అయితే, ఆ పోలింగు కేంద్రంలో ఉన్నది ఒక్క ఓటరే. హయులియాంగ్ శాసనసభ నియోజకవర్గం పరిధిలోని ఈ పోలింగ్ కేంద్రంలో సొకెలా తయాంగ్ (39) అనే మహిళ ఒక్కరే ఓటు వేయనున్నారు. గ్రామంలో ఇంకా చాలామంది ఉన్నా.. వారి ఓట్లన్నీ వేరే పోలింగు కేంద్రంలో ఉన్నాయి. 2014 ఎన్నికల్లో ఇక్కడ సొకెలా ఆమె భర్త జెనెలాం తయాంగ్ ఓట్లు మాత్రమే ఉండేవి.
ఇటీవల జెనెలాం తన ఓటుకు మరో బూత్‌కి మార్చుకున్నాడు. మలోగామ్ పోలింగు కేంద్రానికి వెళ్లడానికి నడక తప్ప మరో దారి లేదని, హయులియాంగ్ నుంచి అక్కడికి వెళ్లడానికి ఒక రోజు పడుతుందని ఎన్నిక ల అధికారులు తెలిపారు.‘‘ఓటరు ఒక్కరే ఉన్నా ప్రిసైడింగ్ అధికారి, ఇతర అధికారు లు, భద్రతా సిబ్బంది తదితర పది మందికి పైగా అక్కడ ఉండాలి. సొకెలా ఎప్పుడొచ్చి ఓటు వేస్తుందో తెలియదు కాబట్టి పొద్దుట 7 నుంచి సాయంత్రం 5 వరకు ఆమె కోసం ఎదురు చూడాల్సిందే. ‘ఒక్కరే కదా అని ఫలానా టైముకి వచ్చి ఓటెయ్యమని చెప్పే అధికారం మాకు లేదు’ అని ఎన్నికల అధికారి లికెన్ కొయు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8.94 లక్షల ఓటర్ల కోసం 2,022 పోలింగు కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటిలో ఏడింటిలో పది మంది కంటే తక్కువ ఓటర్లు ఉన్నారు. లంటా పోలింగు కేంద్రంలో ఆరుగురే ఓటర్లు ఉన్నారు. 281 కేంద్రాల్లో వందలోపు ఓటర్లు ఉన్నారు. శివారుల్లో ఉన్న 518 పోలింగ్ కేంద్రాలకు నడిచే వెళ్లాలని, మూడు రోజులు పడుతుందని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment