లక్నో : హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రాంతమైన యూపీలోని చందౌలీ జిల్లా మహ్మద్‌పూర్ గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మైనారిటీల ప్రాబల్యం కలిగిన ప్రాంతంలో గురువారం ఉదయం లేగదూడ మాంసం కనిపించడంతో స్ధానికులు ఆందోళనకు దిగారు. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ రాష్ట్ర చీఫ్ మహేంద్ర నాథ్ పాండేల సొంత జిల్లా చందౌలీలో లేగదూడల వధపై పార్టీ శ్రేణులు, హిందూ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కాగా లేగదూడ మాంసాన్ని గుర్తించిన స్ధానికులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగడంతో సకాలంలో అక్కడికి చేరుకున్న పోలీసులు పరిస్థితి అదుపులోకి తీసుకువచ్చారు.
దొంగిలించిన లేగదూడ మాంసాన్ని మహ్మద్‌పూర్ గ్రామంలోని ముస్లిం కుటుంబం నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లేగదూడను దొంగిలించిన కుటుంబం మాంసం కోసం దాన్ని వధించిందని స్ధానికులు చెబుతుండగా, గాలింపు చర్యల్లో భాగంగా గురువారం ఉదయం విగతజీవిగా మారిన లేగదూడను గుర్తించామని పోలీసులు వెల్లడించారు.
కాగా కొందరు ఉద్దేశపూర్వకంగానే మత ఘర్షణలను ప్రేరేపించేందుకు తమ గ్రామంలో లేగదూడను విడిచిపెట్టి ఆందోళనలు చేస్తున్నారని గ్రామస్తులు పేర్కొన్నారు. గ్రామంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశామని, అల్లర్లు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టామని ఏఎస్పీ దేవేంద్ర నాథ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment