లష్కరే ఉగ్రవాదులే దాడి చేసింది
న్యూఢిల్లీ: దేశాన్ని ఉలిక్కి పడేలా చేసిన అమర్‌నాథ్ యాత్రికులపై దాడిని ఎవరు చేశారనే విషయాన్ని జమ్మూకశ్మీర్ భద్రతా బలగాలు వెల్లడించారు. లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులే ఈ దాడులకు పాల్పడినట్లు స్పష్టం చేశారు. ఈ దాడి వ్యూహం పన్నిని కీలక సూత్రదారుడు అబూ ఇస్మాయిల్ అనే పాకిస్థాన్ ఉగ్రవాది అని కశ్మీర్ ప్రధాన పోలీసు అధికారి మునీర్‌ఖాన్ వార్తా సంస్థకు వెల్లడించారు. ఇస్మాయిల్‌తో సహా మరో ముగ్గురు ఈ దాడులకు పాల్పడినట్లు వివరించారు. ఈ సందర్భంగా అతడి ఫొటోను మీడియాకు విడుదల చేశారు.
సోమవారం జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు అమర్‌నాథ్ యాత్రికుల బస్సుపై జరిపిన కాల్పుల్లో ఆరుగురు మహిళలు సహా ఏడుగురు మృతిచెందారు. మరో 32 మంది గాయపడ్డారు. మృతులంతా గుజరాత్ వాసులే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉగ్రవాదుల కోసం స్థానిక పోలీసులు. సైనికులు సంయుక్తంగా గాలింపులు జరుపుతున్నారు. ఇదిలా ఉండగా, ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో నేడు జమ్మూకశ్మీర్ అంతటా విశ్వహిందూ పరిషత్‌కు చెందిన కార్యకర్తలు, జమ్ముకశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీ బంద్‌కు పిలుపునిచ్చాయి. మరోపక్క, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ మంగళవారం ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితులను వివరిస్తూ లేఖలో పేర్కొన్నారు.