
పాంపోర్ ఉగ్రదాడిలో రూ.220 కోట్లు గల్లంతు!?
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ లోని పాంపోర్ లో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య కాల్పులు ముగిశాయి. శనివారం నుంచి కొనసాగిన ఈ ఆపరేషన్ లో ఐదుగురు సైనికులు, ఒక పౌరుడు, ముగ్గురు ఉగ్రవాదులు కలిపి మొత్తం 9 మంది మరణించారు. ఇప్పటివరకు ఇద్దరు ముష్కరుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలు మరొకడి శవం కోసం గాలిస్తున్నాయి. కాగా ఉగ్రదాడితో జేకేఈడీఐ సంస్థకు భారీగా ఆస్తినష్టం సంభవించడమేకాక కంప్యూటర్ డేటా ధ్వంసం కావడంతో రూ.220 కోట్లు గల్లంతయినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సంస్థనే ఉగ్రవాదులు టార్గెట్ చేసుకోవడం వెనుక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఔత్సాహిక వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు జమ్ముకశ్మీర్ ప్రభుత్వం 2004లో జమ్ముకశ్మీర్ ఎంటర్ ప్రెన్యూర్స్ డెవలప్ మెంట్ ఇన్ స్టిట్యూట్(జేకేఈడీఐ)ను నెలకొల్పింది. జమ్ము- శ్రీనగర్ జాతీయ రహదారికి అతి సమీపంగా పాంపోర్ లో మూడున్నర ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్మించిన ఈ సంస్థ.. ఇప్పటివరకు 13వేల మందికిపైగా యువ పారిశ్రామికవేత్తలకు శిక్షణ ఇచ్చింది. మరో 5వేల మంది ఔత్సాహికులకు లోన్ల రూపంలో కోట్లాది రూపాయల ఆర్థిక సహాయం చేసింది.
అయితే నిత్యం వందలమంది వచ్చిపోయే ఈ సంస్థపై దాడి జరగవచ్చనే అనుమానం గతంలోనే వ్యక్తమైంది. ఆ క్రమంలోనే జేకేఈడీఐకు భద్రత కల్పించేందుకు రాష్ట్ర పోలీసు శాఖ ముందుకొచ్చింది. కానీ సంస్థ నిర్వాహకులు, ప్రభుత్వం మాత్రం పోలీసుల హెచ్చరికలను తేలికగా తీసుకుంన్నారు. శనివారం నాటి ఘటనలో మొదట జాతీయ రహదారి మీద సీఆర్పీఎఫ్ జవాన్లపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు అక్కడి నుంచి జేకేఈడీఐ ప్రాంగణంలోపలికి సులువుగా చొచ్చుకుపోయారు. అడ్మినిస్ట్రేటివ్ భవంతి నాలుగో అంతస్తులో దాక్కున్నారు. సరిగ్గా అదే అంతస్తులో జేకేఈడీఐ డేటాబేస్ సెంటర్ ఉంది.
దాదాపు మూడు రోజులపాటు ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో కంప్యూటర్లతోపాటు డేటా మొత్తం ధ్వంసమైందని, బ్యాకప్ సౌకర్యం కూడా లేకపోవడంతో పారిశ్రామికవేత్తలకు రుణంగా ఇచ్చిన రూ.220 కోట్లకు సంబంధించిన వివరాలు గల్లంతయ్యాయని జేకేఈడీఐ ఉద్యోగి ఒకరు తెలిపారు. భద్రతా బలగాలు, పోలీసులు కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు.
'భద్రత విషయంలో జేకేఈడీఐ తీరు గర్హనీయం. పొరపాటున ఎప్పుడైనా మా పోలీస్ జీపులు ఆ ప్రాంగణంలోకో లేక ప్రహారీ బయటో ఆపితే అధికారులు ఊరుకునేవారు కాదు. 'అరే.. మేం పోలీసులం' అని చెప్పినా వినిపించుకునేవారుకాదు. మమ్మల్ని కాదని ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థకు రక్షణ బాధ్యతలు అప్పగించారు. ఉగ్రవాదులు ఈ సంస్థను టార్గెట్ చేసుకోవడానికి ఇది కూడా ఒక కారణమే' అని పోలీస్ అధికారి ఒకరు కుండబద్దలు కొట్టారు.