శ్రీనగర్ : జమ్ము కశ్మీర్‌లోని పుల్వామాలో భద్రతా దళాల పెట్రోలింగ్ పార్టీపై మంగళవారం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. భద్రతా దళాలపై దాడికి పాల్పడిన అనంతరం ఉగ్రవాదులు పరారయ్యారు. పెట్రోలింగ్ పార్టీపై దాడులకు తెగబడిన ఉగ్రవాదులను అదుపులోకి తీసుకునేందుకు ఆ ప్రాంతాన్ని సైన్యం జల్లెడపడుతోంది. ఈ దాడికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది. కాగా, జమ్ము కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో ట్రక్ డ్రైవర్‌ను కాల్చిచంపిన ఉగ్రవాదిని భద్రతా దళాలు మట్టుబెట్టిన కొద్దిసేపటికే పుల్వామా ఉగ్ర దాడి చోటుచేసుకోవడం గమనార్హం. అనంత్‌నాగ్ జిల్లాలోని బిజ్‌బెహరా పట్టణంలో ఉగ్రవాదులు ట్రక్ డ్రైవర్‌ను దారుణంగా హతమార్చారు. జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ను ఆగస్ట్ 5న రద్దు చేసిన అనంతరం కశ్మీర్‌లో కశ్మీరీయేతర వ్యక్తిపై ఉగ్రవాదులు ఈ తరహా దాడి జరపడం ఇది నాలుగోసారి. బాధిత ట్రక్ డ్రైవర్‌ను జమ్ముకు చెందిన నారాయణ్ దత్‌గా గుర్తించారు. ఇక జమ్ము కశ్మీర్‌లో క్షేత్రస్ధాయి పరిస్ధితులను పర్యవేక్షించేందుకు యూరప్ ఎంపీల బృందం కశ్మీర్‌లో పర్యటిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment