టార్గెట్ గుజరాత్.. అక్కడే విధ్వంసానికి కుట్ర!
పాక్ ఉగ్రవాదులు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్నే ఎందుకు లక్ష్యంగా ఎంచుకున్నారు? అక్కడే దాడులు చేయాలని ఎందుకు ప్రయత్నించారు? ఇటీవల అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్ కుట్రలను ప్రధాని సమర్థంగా తిప్పికొట్టడం, అంతర్జాతీయ స్థాయిలో దౌత్య విజయాలు సాధించడంతో ఆయనను నైతికంగా దెబ్బకొట్టాలన్న ఉద్దేశంతోనే లష్కరే తాయిబా ఉగ్రవాదులు తీరమార్గం గుండా గుజరాత్లోకి ప్రవేశించి.. విధ్వంసం సృష్టించాలని భావించారు. ఈ విషయం ఇంటెలిజెన్స్ నివేదికలతో నిర్ధారణ అయ్యింది.
గతంలో కూడా లష్కరే తాయిబా ఉగ్రవాదులు ముంబై సముద్ర జలాల ద్వారానే దేశంలోకి ప్రవేశించి, దేశ ఆర్థిక రాజధాని నగరమైన ముంబై మీద దాడికి పాల్పడ్డారు. ఇప్పుడు కూడా ఇలాగే వచ్చి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో ఉగ్రవాద దాడి చేయడానికి భారీ కుట్ర పన్నినట్లు ఇంటెలిజెన్స్ నివేదిక ద్వారా తెలుస్తోంది. దీనిపై కేంద్ర హోంశాఖ అత్యంత అప్రమత్తంగా ఉండటంతో భారీ కుట్రను కోస్ట్ గార్డ్ సిబ్బంది భగ్నం చేయగలిగారు.