‘మోదీకి పాఠం చెప్పిన సుప్రీంకు థ్యాంక్స్’
న్యూఢిల్లీ: భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ థ్యాంక్స్ చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీకి ప్రజాస్వామ్యం అంటే ఎలా ఉంటుందో చెప్పినందుకు ధన్యవాదాలు అంటూ ఆయన ఉన్నత న్యాయస్థానాన్ని ప్రశంసించారు. ఉత్తరాఖండ్ సంక్షోభం తర్వాత అరుణాచల్ ప్రదేశ్ విషయంలో కూడా కేంద్రం నిర్ణయాన్ని తప్పుబడుతూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన విషయం తెలిసిందే.
ఈ తీర్పు తర్వాత ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్ లో సంక్షోభం వీడి తిరిగి కాంగ్రెస్ చేతికే పాలన పగ్గాలు వచ్చాయి. ఈ తీర్పు నేపథ్యంలో రాహుల్ గాంధీ ట్విట్టర్ లో స్పందించారు.‘ప్రజాస్వామ్యం అంటే ఏమిటో ప్రధాని నరేంద్రమోదీకి వివరించినందుకు సుప్రీంకోర్టుకు ధన్యవాదములు’ అని ఆయన ట్వీట్ చేశారు. అంతకుముందు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ తీర్పునుంచి మోదీ పాఠం నేర్చుకోవాలని హితవు పలికిన విషయం తెలిసిందే.