రాజధాని ఎంపిక పై తొలిభేటీ
పలు అంశాలపై చర్చించిన శివరామకృష్ణన్ కమిటీ
పర్యావరణం, నీరు, భూ లభ్యతపై {పాథమిక సమాచారం సేకరణ
మే 2న మరోమారు సమావేశం
మే 7 తర్వాత సీమాంధ్రలో పర్యటన
సాంకేతిక అంశాలపై దృష్టి పెట్టాం: శివరామకృష్ణన్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన రాజధానిని ఎంపిక చేసేందుకు ఏర్పాటైన కేసీ శివరామకృష్ణన్ కమిటీ గురువారం ఉదయం కేంద్ర హోంశాఖ కార్యాలయంలో తొలిభేటీ నిర్వహించింది. రాజధాని ఎంపికలో ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి, ఎవరెవరని సంప్రదించాలి, ఎలాంటి ప్రణాళిక అవసరం అన్న దానిపై ప్రాథమిక కసరత్తు చేసింది. రాజధాని ఎంపికకు సంబంధించి సాంకేతిక అంశాలను పరిగణనలో తీసుకుంటూనే ప్రజాభిప్రాయానికి పెద్దపీట వేయాలని హోంశాఖ ఉన్నతాధికారులు, కమిటీ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. దీనికోసం సీమాంధ్రలో పర్యటించి ప్రజాభిప్రాయం తెలుసుకోవాలని నిర్ణయించింది. శివరామకృష్ణన్‌తో పాటు హోంశాఖ అదనపు కార్యదర్శి రాజీవ్ శర్మ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి భేటీకి హాజరయ్యారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో మొదటగా సీమాంధ్రలోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన వివరాలను అందించారు.
ఆయా ప్రాంతాల్లో వాతావరణ, పర్యావరణ అనుకూలత, నీటి, భూ లభ్యతకు సంబంధించిన వివరాలు, ప్రస్తుత రాజధాని నుంచి ఆయా ప్రాంతాలకు అనుసంధానంగా ఉన్న రహదారుల వివరాలను మహంతి అందించినట్లు తెలిసింది. వాటన్నింటినీ స్వీకరించిన కమిటీ పూర్తిస్థాయి అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే సీమాంధ్ర రాష్ట్రానికి కొత్త రాజధాని ఎంపికపై ప్రజలు, సంస్థలు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరిన కమిటీ, సీమాంధ్రలో పర్యటించే అంశంపైనా చర్చించింది. అయితే సీమాంధ్రలో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా వచ్చే నెల 7వ తేదీ తర్వాతే పర్యటనలు జరపాలని కమిటీ అభిప్రాయపడింది. అప్పటివరకు సాంకేతిక అంశాలన్నింటినీ క్రోడీకరించుకొని రాజధానికి అనువైన ప్రాంతాలను గుర్తించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల 2న మరోమారు ఢిల్లీలో సమావేశమై తదుపరి కార్యాచరణను తయారు చేసుకోవాలని కమిటీ నిర్ణయించింది.
సాంకేతిక అంశాలపై దృష్టిపెట్టాం: శివరామకృష్ణన్
భేటీ అనంతరం కేసీ శివరామకృష్ణన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇది కేవలం ప్రాథమిక సమావేశం మాత్రమే. రాజధానిపై ఓ నిర్ణయానికి రావడానికి వివిధ అంశాలకు సంబంధించి అవసరమైన ప్రాథమిక సమాచారాన్ని తెప్పించుకున్నాం. మాది కేవలం సాంకేతిక కమిటీ మాత్రమే. సాంకేతిక అంశాలైన పర్యావరణం, నీటి లభ్యత, భూ లభ్యతలపై దృష్టిపెట్టాం. వాటికి సంబంధించి ఏయే సమాచారం కావాల్సి ఉందన్న దానిపై చర్చించాం. అధికారులు అందించిన సమాచారాన్ని పరిశీలించి అధ్యయనం చేస్తాం. అలాగే ఆంధ్రా ప్రాంతంలోనూ పర్యటిస్తాం’ అన్నారు. రాజధాని ఎంపికకు ఆప్షన్లు ఇస్తారా? లేక మీరే నిర్ణయిస్తారా? అని అడగ్గా.. ‘అది సమాచారం పూర్తిగా అందాక చూస్తాం’ అని బదులిచ్చారు.
రాజధాని ఎంపికపై ప్రజల అభిప్రాయాలు తీసుకుంటారా? అని ప్రశ్నించగా.. ‘రాష్ట్రం, ఎంపిక చేస్తున్న రాజధాని ప్రజలది. అలాంటప్పుడు ప్రజలతో చర్చించకుండా ఎలా ఉండగలం’ అని అన్నారు. రాజధాని ఎంపికలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వ పాత్ర ఎలా ఉంటుంది అని అడగ్గా ‘ఈ విషయం మాకు తెలియదు. నేను చాలా పాత ప్రభుత్వంలో మనిషిని’ అని బదులిచ్చారు.