Union Home
-
భద్రతా వైఫల్యంపై దర్యాప్తునకు ఉన్నతస్థాయి కమిటీ
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో జరిగిన భద్రతాలోపంపై విచారణకు కేంద్ర హోంశాఖ ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని గురువారం ఏర్పాటు చేసింది. కమిటీకి కేబినెట్ సెక్రటరీ (సెక్యూరిటీ) సుధీర్ కుమార్ సక్సేనా నాయకత్వం వహిస్తారు. ఇందులో ఐబీ జాయింట్ డైరెక్టర్ బల్బీర్ సింగ్, ఎస్పీజీ ఐజీ సురేశ్ సభ్యులు.∙వేగంగా నివేదిక అందించాలని కమిటీని హోంశాఖ కోరింది. అలాగే ఘటనపై తక్షణ నివేదిక ఇవ్వాలని పంజాబ్ ప్రభుత్వాన్ని హోంశాఖ ఆదేశించింది. మరోవైపు ఇదే ఘటనపై విచారణకు పంజాబ్ ప్రభుత్వం ఇద్దరు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. రిటైర్డ్ జడ్జి మెహతాబ్ సింగ్ గిల్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి అనురాగ్ వర్మతో కూడిన ఈ కమిటీ మూడు రోజుల్లో నివేదికనందిస్తుందని అధికారిక వర్గాలు తెలిపాయి. పలు కార్యక్రమాల్లో పాల్గొనడానికి పంజాబ్‌కు వచ్చిన ప్రధాని తీవ్రమైన భద్రతాలోపం కారణంగా బుధవారం అర్ధాంతరంగా ఢిల్లీకి వెనుదిరిగిన సంగతి తెలిసిందే! గురువారం రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన ప్రధాని మోదీ ఫిరోజ్‌పూర్ ఘటనను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు వివరించారు. భద్రతాలోపంపై రాష్ట్రపతి ఆందోళన వ్యక్తం చేశారని కోవింద్ కార్యదర్శి తెలిపారు. ఈ విషయంపై దృష్టి పెట్టినందుకు రాష్ట్రపతికి మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంఘటనపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సైతం తన ఆందోళనను వెలిబుచ్చారు. గురువారం ఆయన మోదీతో మాట్లాడారు. నేడు సీజేఐ ముందుకు భవిష్యత్‌లో ఇలాంటి భద్రతా లోపాలు జరగకుండా ఫిరోజ్‌పూర్ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది మణీందర్ సింగ్ పిటిషన్ దాఖలు చేశారు. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఆధ్వర్యంలోని బెంచ్ ముందు ఈ పిటిషన్ దాఖలైంది. అత్యవసర అంశం కింద దీన్ని చేపట్టి గురువారమే దీనిపై విచారణ జరపాలని సింగ్ కోరారు. అయితే పిటిషన్ కాపీని పంజాబ్ ప్రభుత్వానికి పంపాలని, దీన్ని శుక్రవారం విచారణకు చేపడతామని బెంచ్ పేర్కొంది. పీఎం పర్యటన సందర్భంగా పంజాబ్ ప్రభుత్వం తీసుకున్న అన్ని భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన సాక్ష్యాలను భటిండా జిల్లా న్యాయమూర్తికి స్వాధీ నం చేయాలని ఆదేశించాలని లాయర్స్ వాయిస్ కింద దాఖలు చేసిన పిటిషన్లో సింగ్ కోరారు. ఉద్దేశపూర్వక చర్యల వల్లే భద్రతా వైఫల్యం చోటుచేసుకుందని... ఆయన అనుమానం వ్యక్తం చేశారు. భద్రతా లోపమా.. రైతు ఆగ్రహమా? తేల్చండి: తికాయత్ నోయిడా: భద్రతా వైఫల్యమా, రైతుల ఆగ్రహామా? ప్రధాని మోదీ పంజాబ్ పర్యటన అర్ధంతరంగా ముగియడానికి ఈ రెండింటిలో ఏది కారణమో తేల్చడానికి విచారణ జరపాలని బీకేయూ నేత రాకేశ్ తికాయత్ గురువారం డిమాండ్ చేశారు. ‘భద్రతా కారణాల వల్లే ఫిరోజ్‌పూర్ ర్యాలీ రద్దయిందని బీజేపీ అంటోంది. సభాస్థలిలో కుర్చీలన్నీ ఖాళీగా ఉండటంతోనే ప్రధాని అర్ధంతరంగా వెనుదిరిగారని సీఎం చన్నీ అంటున్నారు. దీంట్లో ఏది నిజమో నిగ్గుతేలాలి’ అని తికాయత్ ట్వీట్ చేశారు. -
పోలీస్‌శాఖలో పదోన్నతుల కోలాహలం
105 పోస్టుల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం సాక్షి, హైదరాబాద్: ఏళ్లకేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోలీస్ శాఖలోని అధికారుల పదోన్నతుల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. నూతన జిల్లాల ఏర్పాటు, సీనియారిటీ జాబితాలో లోటుపాట్లు రెండింటిని పోస్టుల ఏర్పాటుతో చెక్ పెట్టాలని భావించిన పోలీస్ ఉన్నతాధికారుల వ్యూహం ఫలించినట్టే కనిపిస్తోంది. రెండు రోజుల క్రితం రాష్ట్ర మంత్రి మండలి హోంశాఖలోని 105 అదనపు ఎస్పీ, నాన్‌క్యాడర్ ఎస్పీ పోస్టులకు ఆమోదం ఇవ్వడంతో కోలాహలం మొదలైంది. 105తోపాటు మరిన్ని...: రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన 105 కొత్త పోస్టులతో రాష్ట్ర విభజనలో భాగంగా వచ్చిన మరిన్ని పోస్టులకు కలిపి పదోన్నతులు ఇవ్వాలని పోలీస్ శాఖ భావిస్తోంది. మొత్తంగా డీఎస్పీ, ఏఎస్పీ, నాన్‌క్యాడర్ ఎస్పీ పదోన్నతులకు సంబంధించి 210 వరకు భర్తీ అయ్యే అవకాశం ఉందని విశ్వసనీయంగా తెలిసింది. 1985, 1989 ప్రమోటీ అధికారులు, 2007, 2010 డైరెక్ట్ రిక్రూటీ డీఎస్పీలు అదనపు ఎస్పీ, నాన్‌క్యాడర్ ఎస్పీ పదోన్నతులు పొందగా, 1991, 1995 బ్యాచ్‌లకు చెందిన ఇన్స్పెక్టర్లు డీఎస్పీలుగా పదోన్నతి పొందేందుకు మార్గం సుగమం అయ్యింది. కొత్త , పాత పోస్టుల్లో పదోన్నతులకు కనీసం నెల పడుతుందని భావిస్తున్నారు. సీనియారిటీకి సముచిత స్థానం... మూడేళ్లుగా ఒక బ్యాచ్‌పై మరో బ్యాచ్ సీనియారిటీ, పదోన్నతులపై సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. అయితే ఈ పోస్టుల ఏర్పాటు తో అందరికి సముచిత న్యాయం చేసేందుకు తాము ప్రయత్నాలు చేస్తున్నామని ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. సీనియారిటీ జాబితాలో జరిగిన పొరపాట్లను కూడా సమీక్షించుకుంటూనే బాధిత అధికారులకు న్యాయం చేయడం, రివర్షన్ పొందకుండా కొంత మంది అధికారులను నూతన పోస్టుల ద్వారా అదే హోదాలో కొనసాగించేందుకు కృషి చేస్తున్నామని ఆయన స్పష్టంచేశారు. అదే విధంగా 10 నుంచి 12మంది అధికారుల జాబితాను కన్ఫర్డ్ ఐపీఎస్ పదోన్నతుల కోసం కేంద్ర హోంశాఖకు పంపించే ప్రయత్నంలో కూడా తామున్నామని ఆయన వెల్లడించారు. -
విభజనపై వీడనిపీటముడి
- వివాదాస్పదంగా డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ విభజన - తొమ్మిదో షెడ్యూల్ సంస్థలపై రెండు రాష్ట్రాల పేచీ - రాష్ట్ర ప్రభుత్వ నోడల్ అధికారిగా తిరుపతయ్య నియామకం - ఢిల్లీలో రాష్ట్ర విభజన వివాదాల పరిష్కార కమిటీ భేటీ సాక్షి, హైదరాబాద్ : ఏపీ పునర్విభజన చట్టంలోని తొమ్మిదో షెడ్యూల్ సంస్థల విభజనకు రాష్ట్ర ప్రభుత్వం నోడల్ అధికారిని నియమించింది. నోడల్ అధికారిగా డాక్టర్ కె.తిరుపతయ్యను నియమిస్తూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్‌శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతయ్య ప్రస్తుతం ఎంసీహెచ్ఆర్డీ అడిషనల్ డీజీ (శిక్షణ)గా పనిచేస్తున్నారు. మరోవైపు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని రాష్ట్ర విభజన వివాదాల పరిష్కార కమిటీ బుధవారం ఢిల్లీలో భేటీ అయింది. ఈ సమావేశానికి తెలంగాణ, ఏపీల విభజన శాఖల అధికారులు హాజరయ్యారు. కొద్దిరోజులుగా డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ వ్యవహారంపై రెండు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొంది. ఈ సంస్థ ఆధ్వర్యంలోని విజయ డెయిరీ ఉత్పత్తులను తెలంగాణలో అమ్ముకునే హక్కులను ఏపీ ప్రభుత్వం మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ ప్రైవేట్ సంస్థ(సాంబశివ డెయిరీ)కి అప్పగించటంతో ఈ వివాదం మొదలైంది. గతేడాది మేలో రెండు రాష్ట్రాల మేనేజింగ్ బోర్డులు సమావేశమై రాష్ట్ర పునర్విభజన చట్టం 2014 సెక్షన్ 101, 103 ప్రకారం సంస్థ తాత్కాలిక విభజనను పూర్తి చేసుకున్నాయి. విభజన తర్వా త జాయింట్ అకౌంట్ మూసేసి విడివిడిగా బ్యాంకు ఖాతాలు తెరిచాయి. కానీ.. సంస్థ ఆర్థిక లావాదేవీలను జాయింట్ అకౌంట్ ద్వారానే నిర్వహించాలని ఏపీ వాదిస్తోంది. హైదరాబాద్ లాలాగూడలోని విజయ భవన్ నుంచి తెలంగాణ డెయిరీ డెవెలప్‌మెం ట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ డెయిరీ డెవెలప్మెంట్ కార్పొరేషన్ తరఫున ఈ వ్యాపారం నిర్వహిస్తోంది. కానీ సంస్థ విభజన జరగకుండానే తెలంగాణ ఈ వ్యాపారం చేస్తోందని, ఉద్యోగుల విభజన కూడా ఏకపక్షంగానే జరిగిందనే రెండు అభ్యంతరాలతో ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. మరోవైపు తొమ్మిదో షెడ్యూల్ సంస్థల ప్రధాన కార్యాలయం నిర్వచనంపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తొమ్మిదో షెడ్యూల్ సంస్థల విభజనకు కేంద్రం గతంలోనే షీలాబేడీ నేతృత్వంలో కమిటీ వేసింది. ఆ కమిటీ గడువు ముగిసినా మళ్లీ పెంచలేదు. కనీసం ఆ కమిటీ నివేదికలు, మార్గదర్శకాలను సైతం వెల్లడించలేదు. కొత్తగా నోడల్ అధికారి నియామకంతోపాటు ఢిల్లీలో జరిగే భేటీతో విభజన ప్రక్రియ వేగవంతమవుతుందని అధికారవర్గాలు భావిస్తున్నాయి. భేటీలో తెలంగాణ నుంచి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, డెయిరీ డెవెలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ నిర్మల ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
రాజధాని ఎంపిక పై తొలిభేటీ
పలు అంశాలపై చర్చించిన శివరామకృష్ణన్ కమిటీ పర్యావరణం, నీరు, భూ లభ్యతపై {పాథమిక సమాచారం సేకరణ మే 2న మరోమారు సమావేశం మే 7 తర్వాత సీమాంధ్రలో పర్యటన సాంకేతిక అంశాలపై దృష్టి పెట్టాం: శివరామకృష్ణన్ న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన రాజధానిని ఎంపిక చేసేందుకు ఏర్పాటైన కేసీ శివరామకృష్ణన్ కమిటీ గురువారం ఉదయం కేంద్ర హోంశాఖ కార్యాలయంలో తొలిభేటీ నిర్వహించింది. రాజధాని ఎంపికలో ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి, ఎవరెవరని సంప్రదించాలి, ఎలాంటి ప్రణాళిక అవసరం అన్న దానిపై ప్రాథమిక కసరత్తు చేసింది. రాజధాని ఎంపికకు సంబంధించి సాంకేతిక అంశాలను పరిగణనలో తీసుకుంటూనే ప్రజాభిప్రాయానికి పెద్దపీట వేయాలని హోంశాఖ ఉన్నతాధికారులు, కమిటీ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. దీనికోసం సీమాంధ్రలో పర్యటించి ప్రజాభిప్రాయం తెలుసుకోవాలని నిర్ణయించింది. శివరామకృష్ణన్‌తో పాటు హోంశాఖ అదనపు కార్యదర్శి రాజీవ్ శర్మ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి భేటీకి హాజరయ్యారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో మొదటగా సీమాంధ్రలోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన వివరాలను అందించారు. ఆయా ప్రాంతాల్లో వాతావరణ, పర్యావరణ అనుకూలత, నీటి, భూ లభ్యతకు సంబంధించిన వివరాలు, ప్రస్తుత రాజధాని నుంచి ఆయా ప్రాంతాలకు అనుసంధానంగా ఉన్న రహదారుల వివరాలను మహంతి అందించినట్లు తెలిసింది. వాటన్నింటినీ స్వీకరించిన కమిటీ పూర్తిస్థాయి అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే సీమాంధ్ర రాష్ట్రానికి కొత్త రాజధాని ఎంపికపై ప్రజలు, సంస్థలు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరిన కమిటీ, సీమాంధ్రలో పర్యటించే అంశంపైనా చర్చించింది. అయితే సీమాంధ్రలో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా వచ్చే నెల 7వ తేదీ తర్వాతే పర్యటనలు జరపాలని కమిటీ అభిప్రాయపడింది. అప్పటివరకు సాంకేతిక అంశాలన్నింటినీ క్రోడీకరించుకొని రాజధానికి అనువైన ప్రాంతాలను గుర్తించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల 2న మరోమారు ఢిల్లీలో సమావేశమై తదుపరి కార్యాచరణను తయారు చేసుకోవాలని కమిటీ నిర్ణయించింది. సాంకేతిక అంశాలపై దృష్టిపెట్టాం: శివరామకృష్ణన్ భేటీ అనంతరం కేసీ శివరామకృష్ణన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇది కేవలం ప్రాథమిక సమావేశం మాత్రమే. రాజధానిపై ఓ నిర్ణయానికి రావడానికి వివిధ అంశాలకు సంబంధించి అవసరమైన ప్రాథమిక సమాచారాన్ని తెప్పించుకున్నాం. మాది కేవలం సాంకేతిక కమిటీ మాత్రమే. సాంకేతిక అంశాలైన పర్యావరణం, నీటి లభ్యత, భూ లభ్యతలపై దృష్టిపెట్టాం. వాటికి సంబంధించి ఏయే సమాచారం కావాల్సి ఉందన్న దానిపై చర్చించాం. అధికారులు అందించిన సమాచారాన్ని పరిశీలించి అధ్యయనం చేస్తాం. అలాగే ఆంధ్రా ప్రాంతంలోనూ పర్యటిస్తాం’ అన్నారు. రాజధాని ఎంపికకు ఆప్షన్లు ఇస్తారా? లేక మీరే నిర్ణయిస్తారా? అని అడగ్గా.. ‘అది సమాచారం పూర్తిగా అందాక చూస్తాం’ అని బదులిచ్చారు. రాజధాని ఎంపికపై ప్రజల అభిప్రాయాలు తీసుకుంటారా? అని ప్రశ్నించగా.. ‘రాష్ట్రం, ఎంపిక చేస్తున్న రాజధాని ప్రజలది. అలాంటప్పుడు ప్రజలతో చర్చించకుండా ఎలా ఉండగలం’ అని అన్నారు. రాజధాని ఎంపికలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వ పాత్ర ఎలా ఉంటుంది అని అడగ్గా ‘ఈ విషయం మాకు తెలియదు. నేను చాలా పాత ప్రభుత్వంలో మనిషిని’ అని బదులిచ్చారు.