105 పోస్టుల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
సాక్షి, హైదరాబాద్: ఏళ్లకేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోలీస్ శాఖలోని అధికారుల పదోన్నతుల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. నూతన జిల్లాల ఏర్పాటు, సీనియారిటీ జాబితాలో లోటుపాట్లు రెండింటిని పోస్టుల ఏర్పాటుతో చెక్ పెట్టాలని భావించిన పోలీస్ ఉన్నతాధికారుల వ్యూహం ఫలించినట్టే కనిపిస్తోంది. రెండు రోజుల క్రితం రాష్ట్ర మంత్రి మండలి హోంశాఖలోని 105 అదనపు ఎస్పీ, నాన్‌క్యాడర్ ఎస్పీ పోస్టులకు ఆమోదం ఇవ్వడంతో కోలాహలం మొదలైంది.
105తోపాటు మరిన్ని...: రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన 105 కొత్త పోస్టులతో రాష్ట్ర విభజనలో భాగంగా వచ్చిన మరిన్ని పోస్టులకు కలిపి పదోన్నతులు ఇవ్వాలని పోలీస్ శాఖ భావిస్తోంది. మొత్తంగా డీఎస్పీ, ఏఎస్పీ, నాన్‌క్యాడర్ ఎస్పీ పదోన్నతులకు సంబంధించి 210 వరకు భర్తీ అయ్యే అవకాశం ఉందని విశ్వసనీయంగా తెలిసింది. 1985, 1989 ప్రమోటీ అధికారులు, 2007, 2010 డైరెక్ట్ రిక్రూటీ డీఎస్పీలు అదనపు ఎస్పీ, నాన్‌క్యాడర్ ఎస్పీ పదోన్నతులు పొందగా, 1991, 1995 బ్యాచ్‌లకు చెందిన ఇన్‌స్పెక్టర్లు డీఎస్పీలుగా పదోన్నతి పొందేందుకు మార్గం సుగమం అయ్యింది. కొత్త , పాత పోస్టుల్లో పదోన్నతులకు కనీసం నెల పడుతుందని భావిస్తున్నారు.
సీనియారిటీకి సముచిత స్థానం...
మూడేళ్లుగా ఒక బ్యాచ్‌పై మరో బ్యాచ్ సీనియారిటీ, పదోన్నతులపై సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. అయితే ఈ పోస్టుల ఏర్పాటు తో అందరికి సముచిత న్యాయం చేసేందుకు తాము ప్రయత్నాలు చేస్తున్నామని ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. సీనియారిటీ జాబితాలో జరిగిన పొరపాట్లను కూడా సమీక్షించుకుంటూనే బాధిత అధికారులకు న్యాయం చేయడం, రివర్షన్ పొందకుండా కొంత మంది అధికారులను నూతన పోస్టుల ద్వారా అదే హోదాలో కొనసాగించేందుకు కృషి చేస్తున్నామని ఆయన స్పష్టంచేశారు. అదే విధంగా 10 నుంచి 12మంది అధికారుల జాబితాను కన్ఫర్డ్ ఐపీఎస్ పదోన్నతుల కోసం కేంద్ర హోంశాఖకు పంపించే ప్రయత్నంలో కూడా తామున్నామని ఆయన వెల్లడించారు.
పోలీస్‌శాఖలో పదోన్నతుల కోలాహలం
Published Mon, Apr 17 2017 1:58 AM | Last Updated on Tue, Sep 5 2017 8:56 AM
Advertisement
Advertisement