న్యూఢిల్లీ: ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో జరిగిన భద్రతాలోపంపై విచారణకు కేంద్ర హోంశాఖ ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని గురువారం ఏర్పాటు చేసింది. కమిటీకి కేబినెట్ సెక్రటరీ (సెక్యూరిటీ) సుధీర్ కుమార్ సక్సేనా నాయకత్వం వహిస్తారు. ఇందులో ఐబీ జాయింట్ డైరెక్టర్ బల్బీర్ సింగ్, ఎస్‌పీజీ ఐజీ సురేశ్ సభ్యులు.∙వేగంగా నివేదిక అందించాలని కమిటీని హోంశాఖ కోరింది. అలాగే ఘటనపై తక్షణ నివేదిక ఇవ్వాలని పంజాబ్ ప్రభుత్వాన్ని హోంశాఖ ఆదేశించింది. మరోవైపు ఇదే ఘటనపై విచారణకు పంజాబ్ ప్రభుత్వం ఇద్దరు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది.
రిటైర్డ్ జడ్జి మెహతాబ్ సింగ్ గిల్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి అనురాగ్ వర్మతో కూడిన ఈ కమిటీ మూడు రోజుల్లో నివేదికనందిస్తుందని అధికారిక వర్గాలు తెలిపాయి. పలు కార్యక్రమాల్లో పాల్గొనడానికి పంజాబ్‌కు వచ్చిన ప్రధాని తీవ్రమైన భద్రతాలోపం కారణంగా బుధవారం అర్ధాంతరంగా ఢిల్లీకి వెనుదిరిగిన సంగతి తెలిసిందే! గురువారం రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన ప్రధాని మోదీ ఫిరోజ్‌పూర్ ఘటనను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు వివరించారు. భద్రతాలోపంపై రాష్ట్రపతి ఆందోళన వ్యక్తం చేశారని కోవింద్ కార్యదర్శి తెలిపారు. ఈ విషయంపై దృష్టి పెట్టినందుకు రాష్ట్రపతికి మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంఘటనపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సైతం తన ఆందోళనను వెలిబుచ్చారు. గురువారం ఆయన మోదీతో మాట్లాడారు.
నేడు సీజేఐ ముందుకు
భవిష్యత్‌లో ఇలాంటి భద్రతా లోపాలు జరగకుండా ఫిరోజ్‌పూర్ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది మణీందర్ సింగ్ పిటిషన్ దాఖలు చేశారు. చీఫ్ జస్టిస్ ఎన్‌వీ రమణ ఆధ్వర్యంలోని బెంచ్ ముందు ఈ పిటిషన్ దాఖలైంది. అత్యవసర అంశం కింద దీన్ని చేపట్టి గురువారమే దీనిపై విచారణ జరపాలని సింగ్ కోరారు. అయితే పిటిషన్ కాపీని పంజాబ్ ప్రభుత్వానికి పంపాలని, దీన్ని శుక్రవారం విచారణకు చేపడతామని బెంచ్ పేర్కొంది. పీఎం పర్యటన సందర్భంగా పంజాబ్ ప్రభుత్వం తీసుకున్న అన్ని భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన సాక్ష్యాలను భటిండా జిల్లా న్యాయమూర్తికి స్వాధీ నం చేయాలని ఆదేశించాలని లాయర్స్ వాయిస్ కింద దాఖలు చేసిన పిటిషన్‌లో సింగ్ కోరారు. ఉద్దేశపూర్వక చర్యల వల్లే భద్రతా వైఫల్యం చోటుచేసుకుందని... ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
భద్రతా లోపమా.. రైతు ఆగ్రహమా? తేల్చండి: తికాయత్
నోయిడా: భద్రతా వైఫల్యమా, రైతుల ఆగ్రహామా? ప్రధాని మోదీ పంజాబ్ పర్యటన అర్ధంతరంగా ముగియడానికి ఈ రెండింటిలో ఏది కారణమో తేల్చడానికి విచారణ జరపాలని బీకేయూ నేత రాకేశ్ తికాయత్ గురువారం డిమాండ్ చేశారు. ‘భద్రతా కారణాల వల్లే ఫిరోజ్‌పూర్ ర్యాలీ రద్దయిందని బీజేపీ అంటోంది. సభాస్థలిలో కుర్చీలన్నీ ఖాళీగా ఉండటంతోనే ప్రధాని అర్ధంతరంగా వెనుదిరిగారని సీఎం చన్నీ అంటున్నారు. దీంట్లో ఏది నిజమో నిగ్గుతేలాలి’ అని తికాయత్ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment