విభజనపై వీడనిపీటముడి
- వివాదాస్పదంగా డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ విభజన
- తొమ్మిదో షెడ్యూల్ సంస్థలపై రెండు రాష్ట్రాల పేచీ
- రాష్ట్ర ప్రభుత్వ నోడల్ అధికారిగా తిరుపతయ్య నియామకం
- ఢిల్లీలో రాష్ట్ర విభజన వివాదాల పరిష్కార కమిటీ భేటీ
సాక్షి, హైదరాబాద్ : ఏపీ పునర్విభజన చట్టంలోని తొమ్మిదో షెడ్యూల్ సంస్థల విభజనకు రాష్ట్ర ప్రభుత్వం నోడల్ అధికారిని నియమించింది. నోడల్ అధికారిగా డాక్టర్ కె.తిరుపతయ్యను నియమిస్తూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్‌శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతయ్య ప్రస్తుతం ఎంసీహెచ్‌ఆర్‌డీ అడిషనల్ డీజీ (శిక్షణ)గా పనిచేస్తున్నారు. మరోవైపు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని రాష్ట్ర విభజన వివాదాల పరిష్కార కమిటీ బుధవారం ఢిల్లీలో భేటీ అయింది. ఈ సమావేశానికి తెలంగాణ, ఏపీల విభజన శాఖల అధికారులు హాజరయ్యారు. కొద్దిరోజులుగా డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వ్యవహారంపై రెండు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొంది.
ఈ సంస్థ ఆధ్వర్యంలోని విజయ డెయిరీ ఉత్పత్తులను తెలంగాణలో అమ్ముకునే హక్కులను ఏపీ ప్రభుత్వం మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ ప్రైవేట్ సంస్థ(సాంబశివ డెయిరీ)కి అప్పగించటంతో ఈ వివాదం మొదలైంది. గతేడాది మేలో రెండు రాష్ట్రాల మేనేజింగ్ బోర్డులు సమావేశమై రాష్ట్ర పునర్విభజన చట్టం 2014 సెక్షన్ 101, 103 ప్రకారం సంస్థ తాత్కాలిక విభజనను పూర్తి చేసుకున్నాయి. విభజన తర్వా త జాయింట్ అకౌంట్ మూసేసి విడివిడిగా బ్యాంకు ఖాతాలు తెరిచాయి. కానీ.. సంస్థ ఆర్థిక లావాదేవీలను జాయింట్ అకౌంట్ ద్వారానే నిర్వహించాలని ఏపీ వాదిస్తోంది. హైదరాబాద్ లాలాగూడలోని విజయ భవన్ నుంచి తెలంగాణ డెయిరీ డెవెలప్‌మెం ట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ డెయిరీ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్ తరఫున ఈ వ్యాపారం నిర్వహిస్తోంది.
కానీ సంస్థ విభజన జరగకుండానే తెలంగాణ ఈ వ్యాపారం చేస్తోందని, ఉద్యోగుల విభజన కూడా ఏకపక్షంగానే జరిగిందనే రెండు అభ్యంతరాలతో ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. మరోవైపు తొమ్మిదో షెడ్యూల్ సంస్థల ప్రధాన కార్యాలయం నిర్వచనంపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తొమ్మిదో షెడ్యూల్ సంస్థల విభజనకు కేంద్రం గతంలోనే షీలాబేడీ నేతృత్వంలో కమిటీ వేసింది. ఆ కమిటీ గడువు ముగిసినా మళ్లీ పెంచలేదు. కనీసం ఆ కమిటీ నివేదికలు, మార్గదర్శకాలను సైతం వెల్లడించలేదు. కొత్తగా నోడల్ అధికారి నియామకంతోపాటు ఢిల్లీలో జరిగే భేటీతో విభజన ప్రక్రియ వేగవంతమవుతుందని అధికారవర్గాలు భావిస్తున్నాయి. భేటీలో తెలంగాణ నుంచి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, డెయిరీ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ నిర్మల ఈ సమావేశంలో పాల్గొన్నారు.