
ముగ్గురు లష్కరే ఉగ్రవాదుల హతం
పుల్వామా: కశ్మీర్‌లో ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పుల్వామా జిల్లాలో గురువారం వేకువ జామున ముగిసిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు ఆ సంస్థకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను మట్టుపెట్టాయి. అనంతరం చెలరేగిన అల్లర్లలో ఓ పౌరుడు చనిపోయాడు. భద్రతా బలగాలపై రాళ్లు రువ్వుతున్న గుంపును అతడు ముందుండి నడిపిస్తున్నాడని పోలీసులు తెలిపారు.
కాకాపురా ప్రాంతంలోని ఓ ఇంట్లో ఎల్‌ఈటీ కీలక కమాండర్ మజీద్ మీర్ సహా ముగ్గురు ఉగ్రవాదులు దాక్కుని ఉన్నారన్న సమాచారం అందడంతో పోలీసులు బుధవారం సాయంత్రమే అక్కడ కార్డన్ సెర్చ్ ప్రారంభించారు. రాత్రి 10 గంటల నుంచి గురువారం ఉదయం 4 గంటల దాకా ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు దాక్కున్న ఇంటికి మంటలు అంటుకున్న తరువాత, తప్పించుకోవడానికి వారు బయటికి పరుగులు పెట్టారు. లొంగిపొమ్మని పోలీసులు సూచించినా మాట వినకపోవడంతో వారిని కాల్చి చంపారు.