లక్నో: భూకంప విపత్తుకు అవకాశమున్న జిల్లాలుగా ఉత్తరప్రదేశ్‌లోని 50 జిల్లాలను జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్‌ఐడీఎం) నిర్ధారించింది. వాటిలో 29 జిల్లాలను భూకంపాలు వచ్చేందుకు అత్యధిక అవకాశం ఉన్నవాటిగా (జోన్ 4) పేర్కొంది. మొత్తం యూపీని నాలుగు జోన్లుగా విభజించిన ఎన్‌ఐడీఎం.. నేపాల్, ఉత్తరాఖండ్ సరిహద్దుల్లోని సహరణ్‌పూర్, ముజఫర్‌నగర్, బాగ్పట్, బిజ్నోర్, మీరట్, గజియాబాద్, గౌతమబుద్ధ నగర్, జేపీ నగర్, రాంపూర్, మొరాదాబాద్ తదితర 29 జిల్లాలను జోన్ 4లో చేర్చింది. పెరుగుతున్న పట్టణీకరణ కారణంగా భవిష్యత్తులో భూకంపాల కారణంగా యూపీలో మరింత ప్రాణ, ఆస్తి నష్టం జరిగే అవకాశముందని భూకంప శాస్త్ర నిపుణుడు, జీఎస్‌ఐ మాజీ డెరైక్టర్ వీకే జోషి తెలిపారు.