భూకంపాలను తట్టుకొని నిలబడే ఇల్లు, కేవలం 26 గంటల్లోనే..
ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అంటారు. అంటే జీవితంలో ఈ రెండు పనులు చేయడం అంత ఆషామాషీ వ్యవహారం కాదనేది దాని అర్థం. సొంతంగా ఇల్లు కట్టుకోవాలన్నది చాలామందికి కలగా ఉంటుంది. అయితే ఇదంత చిన్న విషయం కాదు. ఎన్నో వ్యయప్రయాసలతో కూడుకున్నది. పునాది మొదలు పైకప్పు దాకా కొన్ని నెలల నుంచి సంవత్సరాల సమయం పడుతుంది.
అయితే ఇప్పుడు ఎలాంటి శ్రమ లేకుండా భారత నిర్మాణ రంగంలో త్రీ డైమెన్షనల్ ప్రింటింగ్ అనే కొత్త టెక్నాలజీ వచ్చి చేరిన విషయం తెలిసిందే. దీంతో ఇటుకలు, సిమెంట్ ఏమీ అక్కర్లేదు,తాపీ మేస్త్రీలు అవసరం లేదు.జస్ట్.. ఇంటి స్థలం ఒక్కటి చాలు. అందమైన కలల సౌధాన్ని.. కష్టం లేకుండానే నిర్మించేయొచ్చు. అంతేకాకుండా ఇప్పుడు భూకంపాలను తట్టుకొని నిలబడి ఇంటి నిర్మాణాలు కూడా అందుబాటులోకి వచ్చేశాయి.
ప్రముఖ సిమెంట్ కంపెనీ ప్రోగ్రెసో తన మొట్టమొదటి 3డీ ప్రింటింగ్ ఇంటిని నిర్మించింది. ప్రోటోటైప్ డిజైన్‌తో భూకంపం లాంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా ఈ ఇంటిని డిజైన్ చేశారు. దీని స్పెషాలిటీ ఏంటంటే.. కేవలం 26 గంటల్లోనే ఈ ఇంటిని నిర్మించారు. ఈ ఇల్లు భూకంపాలను తట్టుకొని నిలబడగలదు. 49 స్క్వైర్ఫీట్లోనే ఈ ఇంటిని నిర్మించారు.
ఇందులో COBOD ప్రింటర్‌ను ఉపయోగించారు. రీసెంట్గా బెంగళూరులో తొలి 3డి ప్రింటింగ్‌తో ఏర్పాటైన పోస్టాఫీస్ నిర్మాణంలోనూ ఇదే తరహా ప్రింటర్‌ను ఉపయోగించారు. ఇంటి పైకప్పులను రాంచో రకం తాటాకులతో నిర్మించారు. ఈ తరహా నిర్మాణం సాధారణంగా కొన్నేళ్లుగా లాటిన్ అమెరికాలో ఉపయోగిస్తున్నారు. ధర తక్కువగా ఉండటంతో పాటు ఇంటిని కాస్త వేడిగా ఉంచుతుంది. 3డీ ప్రింటింగ్ నిర్మాణం ముఖ్యంగా భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలాకు బాగా సరిపోతుంది.
ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాల్లో 3డీ నిర్మాణం అందుబాటులోకి వచ్చేసింది. దీంతో ఇటుకలు, సిమెంట్ ఏమీ అక్కర్లేదు,తాపీ మేస్త్రీలు అవసరం లేకుండా కేవలం ఇంటి స్థలం ఉంటే చాలు అందమైన ఇంటిని కష్టం లేకుండానే నిర్మించేయొచ్చు. రోబోల మాదిరిగా రోజుల్లోనే ఇంటిని కట్టిపడేస్తోందీ ఈ 3డీ టెక్నాలజీ. జస్ట్ ఒక్క బటన్ ప్రెస్ చేస్తే చాలు ఇల్లు రెడీ అవుతుంది మరి.
3డి ప్రింటింగ్ టెక్నాలజీ అంటే ఏమిటి?
సాధారణ ఇంటి నిర్మాణం మాదిరిగానే 3డీ ప్రింటింగ్ నిర్మాణం కూడా సాగుతుంది. అయితే, ఇందులో కార్మికులకు బదులుగా యంత్రం నిర్మాణ పని చేస్తుంది. ఇంటిని ఎక్కడ కట్టాలో నిర్ణయించాక, అవసరమైన ప్లాన్ (బ్లూప్రింట్) రూపొందిస్తారు. గోడలు, గదులు ఎలా ఉండాలో ప్లాన్ చేసి ఇంటి బ్లూప్రింట్ మోడలింగ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ద్వారా సిద్ధం చేస్తారు.
అనంతరం ప్లాన్‌ను కంప్యూటర్ సాయంతో భారీస్థాయిలో ఉండే 3డీ ప్రింటర్‌కు పంపిస్తారు. ఇంటి ప్రింటింగ్ ప్రారంభించే ముందు.. పేస్ట్ లాంటి బిల్డ్ మిశ్రమాన్ని (కాంక్రీట్) వేసేందుకు అనువుగా నిర్మాణ ప్రాంతం చుట్టూ యంత్రం రోబోటిక్ హ్యాండ్ కదిలేందుకు వీలుగా బిల్డింగ్ సైట్ చుట్టూ పట్టాలు అమరుస్తారు.అన్నీ సరిచూసుకున్నాక యంత్రానికున్న ‘ప్రింట్’ బటన్ ఆన్ చేయగానే ప్రింటర్ దానికదే ప్లాన్ ప్రకారం నిర్మాణాలన్నీ ప్రారంభించి గోడలు, కిటికీలు, వెంటిలేటర్లు వంటివి పూర్తిచేస్తుంది.
ఇందులో ప్రింటర్‌లోని నాజిల్ ద్వారా కాంక్రీట్ మెటీరియల్ బయటకు వస్తే.. దాన్ని మరో కాంక్రీట్ డ్రయర్ నిర్మాణ సామగ్రిని త్వరగా పటిష్టం చేస్తుంది. ఆ వెంటనే దానిపై మరో పొర కాంక్రీట్ వేస్తుంది. ఇలా పొరలు పొరలుగా ప్లాన్‌లో ఉన్నట్టుగా నిర్మాణం పూర్తవుతుంది. ఆపై కిటికీలు, తలుపులు, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్ వంటి పనులను కార్మికులతో పూర్తిచేస్తారు.