‘గూఢచర్యం’పై అధికారి అరెస్ట్ | The officer arrested on spying | Sakshi
Sakshi News home page

‘గూఢచర్యం’పై అధికారి అరెస్ట్

Published Wed, Dec 30 2015 2:03 AM | Last Updated on Sun, Sep 3 2017 2:46 PM

‘గూఢచర్యం’పై అధికారి అరెస్ట్

‘గూఢచర్యం’పై అధికారి అరెస్ట్

ఎయిర్‌ఫోర్స్ అధికారికి పాక్ ఐఎస్‌ఐతో సంబంధాలు
♦ హనీట్రాప్‌లో పడి కీలక సమాచారం అప్పగించిన రంజిత్
♦ పంజాబ్‌లో అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు
 
 న్యూఢిల్లీ: హనీట్రాప్‌లో పడి నిఘా వర్గాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్ గూఢచార సంస్థ(ఐఎస్‌ఐ)కు చేరవేస్తున్నాడనే ఆరోపణలతో ఎయిర్‌ఫోర్స్ నుంచి తొలగించిన ఓ అధికారిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని పంజాబ్‌లోని భటిండాలో ఎయిర్‌ఫోర్స్ తరఫున పనిచేస్తున్న రంజిత్ కేకేగా గుర్తించారు. రంజిత్‌ను సోమవారం పంజాబ్‌లో అరెస్ట్ చేసి రిమాండ్‌పై ఢిల్లీకి తీసుకొచ్చారు. మంగళవారం  కోర్టులో హాజరుపరిచారు. ఇటీవలే ఎయిర్‌ఫోర్స్ రంజిత్‌ను విధుల నుంచి తొలగించింది. అనంతరం ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు, మిలటరీ ఇంటెలిజెన్స్, ఎయిర్‌ఫోర్స్ ఎల్‌యూ సంయుక్త ఆపరేషన్‌లో రంజిత్‌ను అరెస్ట్ చేశారు.

రంజిత్ స్వస్థలం కేరళలోని మలప్పురం. 2010లో అతను భారత వైమానిక దళంలో చేరాడు. పాకిస్తాన్‌కు చెందిన నిఘా విభాగాలు హనీట్రాప్ పన్నినట్టు గుర్తించారు. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో మహిళల పేరిట నకిలీ ఖాతాలను సృష్టించి రక్షణ శాఖ అధికారులు, భద్రతా దళాలకు చెందిన  సిబ్బందికి వల వేస్తున్నారు. ఆ తర్వాత వారిని గూఢచర్యంలోకి దించి తమకు కావాల్సిన సమాచారాన్ని సేకరిస్తున్నారు. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లో దామినీ మెక్‌నాటీ పేరుతో ఒక మహిళ రంజిత్‌కు తారసపడింది.

తాను యూకేకు చెందిన మీడియా సంస్థ ప్రతినిధిగా చెప్పుకున్న ఆమె.. తమ న్యూస్ మేగజైన్‌లో ప్రచురించే కథనం కోసం ఎయిర్‌ఫోర్స్‌కు సంబంధించిన సమాచారం కావాలని రంజిత్‌ను కోరింది. దీనికి ప్రతిగా తనకు డబ్బు కావాలని రంజిత్ కోరినట్టు అధికారులు తెలిపారు. ఆ తర్వాత అతను ఎయిర్‌ఫోర్స్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని ఆమెకు అప్పగించాడు. ఇటీవల వైమానిక దళం నిర్వహించిన కార్యక్రమాలు, విమానాల కదలికలు, బేస్ క్యాంపుల వివరాలు అందజేశాడు. దీనికి ప్రతిగా అతని బ్యాంకు అకౌంట్‌లో డబ్బు జమ అయ్యిందని అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్(క్రైం) అలోక్‌కుమార్ వెల్లడించారు.

రంజిత్ మొబైల్‌కు ఇంటర్నెట్ ప్రొటోకాల్ బేస్డ్ వాయిస్ ఓవర్ కాల్స్ వచ్చిందని, అందులో బ్రిటిష్ యాసలో మాట్లాడిన ఒక మహిళ తనను తాను దామిని మెక్‌నాటీగా పరిచయం చేసుకుని, అతడిని ఇంటర్వ్యూ కూడా చేసిందని, ఆ తర్వాత మరింత సమాచారం కావాలని కోరిందని చెప్పారు. రంజిత్ అప్పగించిన సమచారం వల్ల కలిగే నష్టం.. దేశ భద్రతకు ఎదురయ్యే ముప్పు గురించి ఇప్పుడు అధికారులు పరిశీలన జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement