- సిట్‌ను ఏర్పాటు చేయాలని మాథుర్ కమిటీ సిఫారసు!
న్యూఢిల్లీ: ఢిల్లీలో 30 సంవత్సరాల కిందట సిక్కులకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లపై కేంద్రం తాజాగా విచారణ జరిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 1984 నాటి ఈ అల్లర్లపై పునర్ విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నియమించిన ఓ కమిటీ సిఫారసు చేసింది. అయితే ఈ చర్యలను ప్రతిపక్షాలు తీవ్రంగా దుయ్యబట్టాయి.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడానికే బీజేపీ ఇటువంటి కుట్రలకు పాల్పడుతోందని విమర్శించాయి. అప్పటి అల్లర్లపై పునర్‌విచారణ జరపడానికి గల అవకాశాలను పరిశీలించడంకోసం ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జీపీ మాథుర్ నాయకత్వంలో గత ఏడాది డిసెంబర్ 23న ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ గతవారం హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు తన నివేదికను సమర్పించింది.
అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన ఈ అల్లర్లపై విచారణకోసం సిట్‌ను ఏర్పాటు చేయాలని కమిటీ సిఫారసు చేసిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఈనెల 7న అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక సిట్ ఏర్పాటుపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని ఆ వర్గాలు వెల్లడించాయి. అప్పటి అల్లర్లలో మొత్తం 3,325 మంది మృతి చెందగా, ఒక్క ఢిల్లీలోనే 2,733 మంది ప్రాణాలు కోల్పోయారు.
కాగా, ఎన్నికల్లో లబ్ధిపొందడానికే ప్రధాని మోదీ ఇటువంటి జిమ్మిక్కులు చేస్తున్నారని, ఇది పూర్తిగా దిగజారుడు చర్య అని కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్‌సింగ్ సూర్జేవాలా విమర్శించారు. అప్పటి అల్లర్లలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తల పాత్ర గురించి ఎందుకు మాట్లాడడం లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ ప్రశ్నించారు. ఆమ్‌ఆద్మీ పార్టీ కూడా ఈ చర్యపై ధ్వజమెత్తింది. విచారణ గురించి కావాలనే లీకులు ఇస్తున్నారని ఆ పార్టీ నేత హెచ్‌ఎస్ పూల్కా అన్నారు.