సాక్షి, ముంబై: బాంద్రా-వర్లీ సీలింక్‌పై వీధి దీపాలు వెలగకపోవడంతో ఇక్కడ రాత్రి వేళల్లో చీకటి అలుముకుటోంది. దీంతో వాహన చోదకులు కూడా తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. కొన్ని రోజులుగా ఈ వీధి లైట్లు పని చేయనప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క ఈ పరిసర ప్రాంతాల్లో ఉంటున్న జోపడ్‌పట్టీ వాసులు రాగి వైర్లను చోరీ చేస్తుండడంతో వీధి దీపాలు పని చేయడం లేదని ట్రాఫిక్ సిబ్బంది ఆరోపిస్తున్నారు.
ఈ మార్గంపై నిరంతరం రాత్రి పగలు లేకుండా కార్లు గంటకు 80 నుంచి 100 కి.మీ వేగంతో వెళ్తుంటాయని ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. ఈ సీలింక్ చుట్టు పక్కల చాలా మురికి వాడలు ఉన్నాయనీ అదేవిధంగా సాయంత్రం వేళల్లో జంటలు కూడా ఇక్కడ కూర్చుంటారని పేర్కొన్నారు. వీరి వాహనాలను కూడా అక్కడే పార్క్ చేస్తారని ట్రాఫిక్ పోలీస్ ఒకరు తెలిపారు. దీంతో ఇక్కడ వీధి లైట్లు లేకపోవడంతో ఇక్కడ పార్క్ చేసిన వాహనాలను, వేగంగా వస్తున్న వాహన డ్రైవర్లకు కనిపించక పోవడంతో ఢీకొట్టే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా రాత్రి వేళల్లో రోడ్డు దాటాలనుకున్న పాదచారులు కూడా ప్రమాదంలో పడుతున్నారని వారు చెబుతున్నారు.
దాదాపు కిలో మీటర్ వరకు ఇక్కడ వీధి దీపాలు పని చేయని కారణం వల్ల చీకటి అలుముకొంటోంది. అయితే తరచూ రాగి వైర్లు చోరీకి గురవుతుండడంతో తిరిగి వీటిని అమర్చడం లేదు. దీంతో లైట్లు కూడా వెలగడం లేదు. డివైడర్లపై ఉన్న లైట్లు వెలుగుతున్నప్పటికీ రోడ్డు ఎంత వెడల్పు ఉందో గుర్తించేందుకు కావాల్సినంత వెలుతురును అవి ఇవ్వలేకపోతుండటంతో ఇబ్బందులెదురవుతున్నాయి. ఇక్కడ రోడ్డు వెంబడి జాగర్స్ పార్క్ కూడా ఉండడంతో సాయంత్రం వేళలో చాలా మంది ఇక్కడికి వాకింగ్ చేయడానికి వస్తుంటారు.
రాత్రి వేళ్లలో ఇక్కడ వెలుతురు లేకపోవడంతో చీకట్లో వాకింగ్ చేయాలంటే భయాందోళనలకు గురవుతున్నామని వారు చెబుతున్నారు. సంఘ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడే వారు ఇక్కడి లైట్లను తరచూ రాళ్లు రువ్వుతూ ధ్వంసం చేస్తుంటారని బాంద్రా పోలీసులు తెలిపారు. కాగా, తమ సిబ్బంది రోజూ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారని బాంద్రా విడిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శివాజీ కోలేకర్ తెలిపారు. ఇక్కడ భద్రతను కట్టుదిట్టం చేసేందుకు మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎంఎస్‌ఆర్డీసీ)కు, అదేవిధంగా రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌కు కూడా లేఖ రాశామన్నారు.
చీకటి పడితే ఇక్కట్లే..!
Published Sat, Sep 20 2014 11:45 PM | Last Updated on Sat, Sep 2 2017 1:41 PM
Advertisement