Bandra-Worli Sealink
-
వారధిపై వీరబాదుడు
బాంద్రా–వర్లీ వారధి ఎక్కడ ఉంది? అంటే ముంబైలో అని చెబుతారు. కానీ ఇప్పుడీ వారధి హైదరాబాద్‌లో ఉందంటే ఆశ్చర్యపోవడం ఖాయం. అవును.. బాంద్రా–వర్లీ పీ లింక్ బ్రిడ్జ్‌ని ‘సాహో’ టీమ్ హైదరాబాద్‌లో రీ–క్రియేట్ చేశారని సమాచారం. ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్న సినిమా ‘సాహో’. ఇందులో శ్రద్ధాకపూర్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ముంబైలోని బాంద్రా–వర్లీ సీ లింక్ బ్రిడ్జ్ దగ్గర కీలక సన్నివేశాలను చిత్రీకరించాలట. రద్దీగా ఉండే ఆ ఏరియాలో షూటింగ్ అంటే కష్టమే. అందుకే హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో సెట్ వేయిస్తున్నారని తెలిసింది. ఈ సెట్ కోసం దాదాపు 20 కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నారట. ఈ సినిమా మొత్తం బడ్జెట్ 300 కోట్లు అయితే.. అందులో దాదాపు 120 కోట్ల రూపాయలను యాక్షన్ సీక్వెన్స్, గ్రాఫిక్స్ వర్క్ కోసమే ఖర్చు చేస్తున్నారని టాక్. ఇప్పుడు బాంద్రా–వర్లీ సీ లింక్ వారధిపై ఓ భారీ చేజింగ్ సీన్‌ను ప్లాన్ చేశారట. ఈ చేజ్లో హీరో ప్రభాస్‌తో పాటు విలన్ నీల్ నితిన్ ముఖేష్ కీలకంగా ఉంటారని తెలిసింది. ‘ట్రాన్స్ఫార్మర్స్’ సిరీస్, ‘పెరల్ హార్బర్’ వంటి హాలీవుడ్ సినిమాలకు యాక్షన్ కొరియోగ్రఫీ చేసిన కెన్నీ బేట్ ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్ అబ్బురపరిచేలా ఉంటాయట. మార్చి నెలాఖరుకల్లా మొత్తం షూటింగ్‌ను కంప్లీట్ చేయాలనే ఆలోచనలో ‘సాహో’ టీమ్ ఉన్నట్లు తెలిసింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. -
చీకటి పడితే ఇక్కట్లే..!
సాక్షి, ముంబై: బాంద్రా-వర్లీ సీలింక్‌పై వీధి దీపాలు వెలగకపోవడంతో ఇక్కడ రాత్రి వేళల్లో చీకటి అలుముకుటోంది. దీంతో వాహన చోదకులు కూడా తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. కొన్ని రోజులుగా ఈ వీధి లైట్లు పని చేయనప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క ఈ పరిసర ప్రాంతాల్లో ఉంటున్న జోపడ్పట్టీ వాసులు రాగి వైర్లను చోరీ చేస్తుండడంతో వీధి దీపాలు పని చేయడం లేదని ట్రాఫిక్ సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఈ మార్గంపై నిరంతరం రాత్రి పగలు లేకుండా కార్లు గంటకు 80 నుంచి 100 కి.మీ వేగంతో వెళ్తుంటాయని ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. ఈ సీలింక్ చుట్టు పక్కల చాలా మురికి వాడలు ఉన్నాయనీ అదేవిధంగా సాయంత్రం వేళల్లో జంటలు కూడా ఇక్కడ కూర్చుంటారని పేర్కొన్నారు. వీరి వాహనాలను కూడా అక్కడే పార్క్ చేస్తారని ట్రాఫిక్ పోలీస్ ఒకరు తెలిపారు. దీంతో ఇక్కడ వీధి లైట్లు లేకపోవడంతో ఇక్కడ పార్క్ చేసిన వాహనాలను, వేగంగా వస్తున్న వాహన డ్రైవర్లకు కనిపించక పోవడంతో ఢీకొట్టే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా రాత్రి వేళల్లో రోడ్డు దాటాలనుకున్న పాదచారులు కూడా ప్రమాదంలో పడుతున్నారని వారు చెబుతున్నారు. దాదాపు కిలో మీటర్ వరకు ఇక్కడ వీధి దీపాలు పని చేయని కారణం వల్ల చీకటి అలుముకొంటోంది. అయితే తరచూ రాగి వైర్లు చోరీకి గురవుతుండడంతో తిరిగి వీటిని అమర్చడం లేదు. దీంతో లైట్లు కూడా వెలగడం లేదు. డివైడర్లపై ఉన్న లైట్లు వెలుగుతున్నప్పటికీ రోడ్డు ఎంత వెడల్పు ఉందో గుర్తించేందుకు కావాల్సినంత వెలుతురును అవి ఇవ్వలేకపోతుండటంతో ఇబ్బందులెదురవుతున్నాయి. ఇక్కడ రోడ్డు వెంబడి జాగర్స్ పార్క్ కూడా ఉండడంతో సాయంత్రం వేళలో చాలా మంది ఇక్కడికి వాకింగ్ చేయడానికి వస్తుంటారు. రాత్రి వేళ్లలో ఇక్కడ వెలుతురు లేకపోవడంతో చీకట్లో వాకింగ్ చేయాలంటే భయాందోళనలకు గురవుతున్నామని వారు చెబుతున్నారు. సంఘ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడే వారు ఇక్కడి లైట్లను తరచూ రాళ్లు రువ్వుతూ ధ్వంసం చేస్తుంటారని బాంద్రా పోలీసులు తెలిపారు. కాగా, తమ సిబ్బంది రోజూ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారని బాంద్రా విడిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శివాజీ కోలేకర్ తెలిపారు. ఇక్కడ భద్రతను కట్టుదిట్టం చేసేందుకు మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఎస్ఆర్డీసీ)కు, అదేవిధంగా రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు కూడా లేఖ రాశామన్నారు.