ప్రజ్ఞాసింగ్‌పై ఆధారాలున్నాయి
మాలెగావ్ పేలుళ్ల కేసులో ఎన్‌ఐఏ కోర్టు స్పష్టీకరణ
బెయిల్ పిటిషన్ తిరస్కరణ
ముంబై: మాలెగావ్ బాంబు పేలుడు కేసులో నిందితురాలైన సాధ్వీ ప్రజ్ఞాసింగ్‌ఠాకూర్ బెయిల్ దరఖాస్తును ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు మంగళవారం తిరస్కరించింది. 2008 నాటి ఈ కేసులో ఆమెపై అభియోగాలు ప్రాథమికంగా వాస్తవమని విశ్వసించేందుకు తగిన ప్రాతిపదికలు ఉన్నాయని ప్రత్యేక కోర్టు ఎస్.డి.టెకాలే చెప్పారు. ఈ పేలుడులో ప్రజ్ఞ పాత్రపై సాక్ష్యాలు లేవంటూ ఆమెతో పాటు మరో నలుగురు పేర్లను నిందితుల జాబితా నుంచి తొలగిస్తూ ఎన్‌ఐఏ మే 13న కోర్టులో చార్జ్‌షీట్ వేయడం తెలిసిందే. అలాగే వారిపై ఎంకోకా సెక్షన్లను కూడా ఎత్తివేసింది. ఆమె బెయిల్ దరఖాస్తునూ ఎన్‌ఐఏ వ్యతిరేకించలేదు.
ఈ నేపథ్యంలో ఆమె బెయిల్ దరఖాస్తును వ్యతిరేకిస్తూ నాటి బాంబు పేలుడు బాధితుల కుటుంబాలు వినిపించిన వాదనలను ఆంతరంగిక విచారణలో ఆలకించిన కోర్టు ఆమె దరఖాస్తును తిరస్కరించింది. దీంతో ప్రజ్ఞకు ఎన్‌ఐఏ క్లీన్ చిట్ ఇవ్వటాన్ని కోర్టు ప్రశ్నించినట్లయింది.ఎన్‌ఐఏ అభ్యంతరం లేదని చెప్పినంత మాత్రాన ప్రజ్ఞ బెయిల్ వినతిని ఆమోదించజాలమని కోర్టు పేర్కొంది. ఈ పేలుళ్ల కుట్ర రచనలో భాగంగా భోపాల్‌లో జరిగిన భేటీకి ప్రజ్ఞ హాజరైనట్లు చెప్పిన ఇతర నిందితుల నేరాంగీకార వాంగ్మూలాన్ని ఉటంకిస్తూ.. ఇది ప్రాథమికంగా స్పష్టమైందని కోర్టు పేర్కొంది. పేలుళ్లకు వాడిన మోటార్‌సైకిల్ ప్రజ్ఞాసింగ్ పేరు మీదే రిజిస్టరై ఉన్న విషయాన్నీ విస్మరించజాలమని పేర్కొన్నారు. మహారాష్ట్రలో ముస్లిం ప్రజలు అధికంగా నివసించే మాలేగావ్ పట్టణంలో 2008 సెప్టెంబర్ 29న జరిగిన పేలుడులో ఏడుగురు మృతిచెందారు.