Malegaon bomb blast case
-
ఆ కుర్చీలో కూర్చుంటే అంతే: సాధ్వి ప్రజ్ఞాసింగ్
ముంబై: భోపాల్ ఎంపీ సాధ్వి ప్రజ్ఞాసింగ్ శువ్రవారం మొదటిసారిగా 2008 నాటి మాలేగావ్ పేలుడు కేసులో కోర్టుకు హాజరయ్యారు. సుమారు రెండున్నర గంటలపాటు కోర్టు హాలులో నిలుచునే ఉన్నారు. జడ్జి పలుమార్లు కూర్చోవచ్చని చెప్పినా ఆమె నిరాకరించారు. విచారణ ముగిసి, జడ్జి వెళ్లి పోయిన తర్వాత ప్రజ్ఞ కోర్టురూమ్‌లో సౌకర్యాలు సరిగా లేవంటూ అసహనం వ్యక్తం చేశారు. తనకు ఇచ్చిన కుర్చీని చూపిస్తూ.. ‘దీనిపై అంతా దుమ్మే. ఇందులో కూర్చుంటే నేను పడక్కే పరిమితమవుతా..’ అని అన్నారు. ‘ముందు కనీసం కూర్చునే చోటు చూపించండి. కావాలనుకుంటే తర్వాత ఉరి తీయండి’ అని వ్యాఖ్యానించారు. -
పోలీసులు తీవ్రంగా హింసించారు
భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తున్న, మాలెగావ్ బాంబు పేలుళ్ల కేసులో నిందితురాలిగా ఉన్న ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ గురువారం బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. మానస్ భవన్లో ఆమె మాట్లాడుతూ విచారణ సమయంలో పోలీసులు తనను ఏవిధంగా హింసించిందీ రోదిస్తూ వివరించారు. ‘పోలీసులు నన్ను అక్రమంగా 13 రోజులు బంధించారు. ఆ సమయంలో వెడల్పైన బెల్టుతో నన్ను కొట్టేవారు. ఒక్క దెబ్బకే శరీరం బాగా వాచేది. రెండో దెబ్బ పడితే చర్చం ఊడివచ్చేది. ఆ దెబ్బలకు కాసేపు నా నాడీ వ్యవస్థ పనిచేసేది కాదు. అసభ్యకరంగా పోలీసులు తిట్టేవారు. తలకిందులుగా వేలాడదీస్తామనీ, వివస్త్రను చేస్తామని బెదిరించేవారు. ఇలాంటి కష్టాలను ఇంకో సోదరి ఎవరూ అనుభవించకూడదని చెబుతున్నాను’ అని కంటతడి పెట్టుకున్నారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత దిగ్విజయసింగ్పై ప్రస్తుతం ప్రజ్ఞ పోటీ చేస్తున్నారు. దిగ్విజయ హిందూ, కాషాయ ఉగ్రవాదం వంటి పదాలను వాడి ఓట్లు పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. మాలెగావ్ పేలుళ్లలో తన హస్తం ఉందని ఒప్పుకోవాల్సిందిగా పోలీసులు బలవంతపెట్టారన్నారు. ప్రజ్ఞ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి చతుర్వేది స్పందిస్తూ ఎన్నికల కోసమే ఆమె ఇప్పుడు పోలీసులు తనను హింసించడం గురించి చెబుతున్నారన్నారు. -
సాధ్వి ప్రజ్ఞ, పురోహిత్‌కు స్వల్ప ఊరట
ముంబై: మాలెగావ్ బాంబుపేలుడు కేసులో నిందితులు సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్‌లకు బుధవారం ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) ప్రత్యేక కోర్టులో స్వల్ప ఊరట లభించింది. సాధ్వి, పురోహిత్ సహా 8 మందిపై ‘మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నియంత్రణ చట్టం’ కింద నమోదైన అభియోగాలను కోర్టు కొట్టేసింది. ఉగ్రవాద కార్యకలాపాల వ్యతిరేక చట్టం కింద మాత్రం విచారణ కొనసాగుతుందన్టి స్పష్టం చేసింది. మరో ముగ్గురి పేర్లను నిందితుల జాబితా నుంచి తొలగించిన కోర్టు వారికి కేసు నుంచి విముక్తి కల్పించింది. మిగిలిన నిందితులందరిపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ)లోని సెక్షన్ల కింద విచారణ కొనసాగుతుందని కోర్టు పేర్కొంది. -
ప్రజ్ఞాసింగ్‌పై ఆధారాలున్నాయి
మాలెగావ్ పేలుళ్ల కేసులో ఎన్ఐఏ కోర్టు స్పష్టీకరణ బెయిల్ పిటిషన్ తిరస్కరణ ముంబై: మాలెగావ్ బాంబు పేలుడు కేసులో నిందితురాలైన సాధ్వీ ప్రజ్ఞాసింగ్ఠాకూర్ బెయిల్ దరఖాస్తును ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు మంగళవారం తిరస్కరించింది. 2008 నాటి ఈ కేసులో ఆమెపై అభియోగాలు ప్రాథమికంగా వాస్తవమని విశ్వసించేందుకు తగిన ప్రాతిపదికలు ఉన్నాయని ప్రత్యేక కోర్టు ఎస్.డి.టెకాలే చెప్పారు. ఈ పేలుడులో ప్రజ్ఞ పాత్రపై సాక్ష్యాలు లేవంటూ ఆమెతో పాటు మరో నలుగురు పేర్లను నిందితుల జాబితా నుంచి తొలగిస్తూ ఎన్ఐఏ మే 13న కోర్టులో చార్జ్‌షీట్ వేయడం తెలిసిందే. అలాగే వారిపై ఎంకోకా సెక్షన్లను కూడా ఎత్తివేసింది. ఆమె బెయిల్ దరఖాస్తునూ ఎన్ఐఏ వ్యతిరేకించలేదు. ఈ నేపథ్యంలో ఆమె బెయిల్ దరఖాస్తును వ్యతిరేకిస్తూ నాటి బాంబు పేలుడు బాధితుల కుటుంబాలు వినిపించిన వాదనలను ఆంతరంగిక విచారణలో ఆలకించిన కోర్టు ఆమె దరఖాస్తును తిరస్కరించింది. దీంతో ప్రజ్ఞకు ఎన్ఐఏ క్లీన్ చిట్ ఇవ్వటాన్ని కోర్టు ప్రశ్నించినట్లయింది.ఎన్ఐఏ అభ్యంతరం లేదని చెప్పినంత మాత్రాన ప్రజ్ఞ బెయిల్ వినతిని ఆమోదించజాలమని కోర్టు పేర్కొంది. ఈ పేలుళ్ల కుట్ర రచనలో భాగంగా భోపాల్‌లో జరిగిన భేటీకి ప్రజ్ఞ హాజరైనట్లు చెప్పిన ఇతర నిందితుల నేరాంగీకార వాంగ్మూలాన్ని ఉటంకిస్తూ.. ఇది ప్రాథమికంగా స్పష్టమైందని కోర్టు పేర్కొంది. పేలుళ్లకు వాడిన మోటార్‌సైకిల్ ప్రజ్ఞాసింగ్ పేరు మీదే రిజిస్టరై ఉన్న విషయాన్నీ విస్మరించజాలమని పేర్కొన్నారు. మహారాష్ట్రలో ముస్లిం ప్రజలు అధికంగా నివసించే మాలేగావ్ పట్టణంలో 2008 సెప్టెంబర్ 29న జరిగిన పేలుడులో ఏడుగురు మృతిచెందారు.