సెక్స్‌వర్కర్లకు చట్టబద్ధత కల్పించడం తప్పా? | These NIFT Students Are Campaigning to Legalise Prostitution in India in a Unique Way | Sakshi
Sakshi News home page

ఆ వృత్తికి చట్టబద్ధత కల్పించడం తప్పా?

Published Thu, Aug 4 2016 7:46 PM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM

సెక్స్‌వర్కర్లకు చట్టబద్ధత కల్పించడం తప్పా? - Sakshi

సెక్స్‌వర్కర్లకు చట్టబద్ధత కల్పించడం తప్పా?

న్యూఢిల్లీ: భారత దేశంలో వేశ్యవృత్తికి చట్టబద్ధత కల్పించాలంటూ ఇప్పటి వరకు ఎన్నోసార్లు తెరమీదకు వచ్చిన డిమాండ్ ఇది. పలు మహిళా, సామాజిక సంఘాలు ఇప్పటికీ ఎన్నోసార్లు ఈ డిమాండ్‌ను తీసుకొచ్చినా అధికారంలోవున్న భారత ప్రభుత్వం ఎన్నడూ సానుకూలంగా స్పందించలేదు. ఇప్పుడు ఇదే డిమాండ్‌తోని హిమాచల్‌లోని ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్)’ కాలేజీకి చెందిన ఆరుగురు విద్యార్ధులు ఓ వినూత్న ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టిన నిఫ్ట్ ఫైనల్ ఇయర్ విద్యార్థి 23 ఏళ్ల అమిత్ చౌహాన్ దీనికి ‘నాత్ ఉట్రాయ్’ అని పేరు పెట్టారు.

అమిత్, తనతోపాటు చదువుకుంటున్న మరో ఐదుగురు విద్యార్థులతో కలసి ఈ ప్రాజెక్టును చేపట్టి ఇంతవరకు దేశంలోని ఎంతోమంది వేశ్యలను ఇంటర్వ్యూ చేశారు. ఛిద్రమైన వారి జీవితాలకు సంబంధించిన కథలను ప్రపంచం దృష్టికి తీసుకరావడం వారి ప్రాజెక్ట్ ముఖ్య లక్ష్యం. ఇందులో భాగంగా వారు ఆరుగురు వేశ్యకథలను డాక్యుమెంటరీగా తీస్తున్నారు. వాటినే వచ్చే జనవరి నెలలో పుస్తకంగా విడుదల చేస్తామని అమిత్ మీడియాకు తెలిపారు. తాము ఎంపిక చేసిన ఆరుగురు వేశ్యలలో ముగ్గురు రాజస్థాన్‌కు, మరో ముగ్గురు ఢిల్లీ రెడ్‌లైట్ ఏరియాకు చెందిన వారని ఆయన చెప్పారు. తాము కలుసుకున్న వేశ్యల్లో ఎక్కువ మంది పిల్లా పాపలతో కాపురాలు చేస్తున్నారని, వారికి బడికి కూడా పంపించి చదివిస్తున్నారని, ఇదంతా కూడా వారు తమ శరీరాలను తాకట్టు పెట్టే సంపాదిస్తున్నారని తెలిపారు.

భారత్‌లో వేశ్యవృత్తికి చట్టబద్ధత లేకపోవడం వల్ల వారిని దళారులు మోసం చేస్తున్నారని, విటులు హింసిస్తున్నారని, ఎయిడ్స్ లాంటి మహమ్మారి సోకకుండా ముందు జాగ్రత్త చర్యలు విటులు తీసుకోవడం లేదని, దేశంలో ఆడపిల్లల అక్రమ రవాణా కూడా పెరిగిపోతోందని అమిత్ ఆవేదన వ్యక్తం చేశారు. వేశ్యవృత్తికి చట్టబద్ధతను కల్పించినట్లయితే ఈ సామాజిక సమస్యల నుంచి విముక్తి కల్పించవచ్చని, వేశ్యల డేటాను నమోదు చేయడం, దళారుల ప్రమేయాన్ని అరికట్టడం, ఆడవాళ్ల అక్రమ రవాణాను అరికట్టడం సాధ్యమని, ఆరోగ్య సూత్రాలను పాటించడం, వ్యాపార నియమాలను నిర్దేశించడం సాధ్యమవుతుందని ఆయన వాదిస్తున్నారు. చట్టబద్ధత కల్పించడమంటే వృత్తిని ప్రోత్సహించడం కాదని, నియంత్రించడం అనీ, అమాయకులను దౌర్జన్యంగా ఆ వృత్తిలోకి దింపకుండా నిరోధించడమని ఆయన చెప్పారు.

2014లో జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ లలితా కుమార మంగళం కూడా ఇలాంటి అభిప్రాయలనే వ్యక్తం చేశారు. వేశ్యవృత్తికి చట్టబద్ధత కల్పిస్తే వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చవచ్చని, వృత్తిని నియత్రించవచ్చని ఆమె చెప్పారు. దేశంలో 16 రాష్ట్రాల నుంచి రెండున్నర లక్షల మంది సభ్యులు గల అఖిల భారత సెక్స్ వర్కర్ల సంఘం అధ్యక్షురాలు భారతీ దేవీ కూడా ఎప్పటి నుంచో ఇదే డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement