
ఆర్టిస్టులు కాదు.. నేటితరం దేశ భక్తులు..!
సాక్షి, స్కూల్ ఎడిషన్: ‘భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను’ అంటూ చిన్నతనంలో ప్రతిఒక్కరూ ప్రతిజ్ఞ చేసే ఉంటారు. దేశమంటే ఏంటి..? మనం నివసించే ఊరు, మన చుట్టూ ఉండే ప్రజలు, మన పరిసరాలు.. ఇవి కావా దేశమంటే..? వీటిని పరిరక్షించడమంటే మన దేశాన్ని ప్రేమించినట్టేగా..? దేశాన్ని ప్రేమించడమంటే చిన్ననాటి ప్రతిజ్ఞకు కట్టుబడినట్టేగా?! ఈ లెక్కన చూస్తే బెంగళూరులోనే దేశభక్తులు మెండుగా ఉన్నట్టు! ఆర్టిస్ట్ బాదల్ నంజుందస్వామి, ‘నమ్మా బెంగళూరు’ సీఈవో శ్రీధర్ పబ్బిషెట్టి, ఆ సంస్థ ఆర్టిస్ట్ పుష్పరాజ్ లాంటి వారే నేటితరం దేశభక్తులు.
2015, ఆగస్టు 9.. బెంగళూరులోని యశ్వంత్‌పూర్ మార్కెట్ ప్రాంతం. ఆదివారం కావడంతో బెంగళూరు వాసులు కాస్త ఆలస్యంగా నిద్రలేచారు. అలవాటుగా మార్కెట్‌వైపు అడుగులేశారు. రోడ్డు నిండా ఉన్న బురద గుంటలను దాటుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అలా ఒక బురదగుంట దగ్గరకు వెళ్లేసరికి ఓ భయంకర దృశ్యం వారి కంట పడింది. నడిరోడ్డు మీదే ఉన్న ఓ మురుగునీటి గుంటలోంచి భారీ అనకొండ నోరు తెరచుకుని నేలపైకి జొచ్చుకొచ్చింది. దాని నోట్లో సగం తినేసిన మానవ హస్తం ఉంది. అదే వారి గుండె గాబరాకు కారణం. రక్తసిక్తంగా ఉన్న ఆ ప్రాంతాన్ని చూడలేక కొందరు పరుగులెట్టారు. మరికొందరు దగ్గరకు వెళ్లే సాహసం చేశారు. అప్పుడే తెలిసింది వారికి.. అది నిజమైన అనకొండ కాదు, బొమ్మ అని!
ఒక్కక్షణం ‘హమ్మయ్య’ అని అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇంతలో అక్కడికి ‘నమ్మా బెంగళూరు’ ఫౌండేషన్ సభ్యులు వచ్చారు. ఆ బొమ్మ అనకొండను ఏర్పాటు చేసింది తామేనని, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపేందుకే ఇలా చేశామని వివరణ ఇచ్చుకున్నారు. భయపడ్డ ప్రజలకు సారీ కూడా చెప్పారు. అయితే, అప్పుడే ప్రజల్లో ఓమూల ఆందోళన మొదలైంది. ‘నిజంగానే ఈ గుంటల్లోంచి భయంకర జీవులు నేలమీదికి వస్తే పరిస్థితి ఏంటీ..?’ అనుకున్నారు. ఫేస్‌బుక్, ట్వీటర్ వంటి సామాజిక మాధ్యమాల్లో ‘బృహత్ బెంగళూరు మహానగర పాలికే’ (బీబీఎంపీ) నిర్లక్ష్యాన్ని కడిగిపారేశారు.
బొమ్మలతో చెంపపెట్టు..
నిజానికి బెంగళూరు మాత్రమే కాదు, దేశంలోని మహానగర రోడ్లన్నీ దాదాపు ఇలా నిర్లక్ష్యపు కోరల్లోనే చిక్కుకున్నాయి. మితిమీరిన ట్రాఫిక్ ఉండే బెంగళూరులో ఈ నిర్లక్ష్యం పాళ్లు కాస్తంత ఎక్కువ. అయితే, దీన్ని ఉపేక్షించకూడదనుకున్నారు బెంగళూరు వాసులు. ముఖ్యంగా బాదల్ నంజుంద స్వామి లాంటి వారికైతే ‘బీబీఎంపీ’ అధికారులకు చెంపపెట్టులా ఏదైనా చేయాలనిపించింది. స్వతహాగా ఆర్టిస్ట్ అయిన ఆయన తొలి ప్రయత్నంగా తన జేబులోని ఆరువేల రూపాయలు తీసి ఓ ఫైబర్ మొసలి బొమ్మను రూపొందించాడు. అచ్చమైన మొసలిని పోలినట్టు ఉండే ఈ నిర్మాణాన్ని బెంగళూరు రహదారుల్లోని నీటిగుంటపై అమర్చాడు. దీన్ని చూసిన వాహనదారులు కొద్దిసేపటివరకూ హడలిపోయారు. అంతే.. ఈ విషయం బీబీఎంపీ దృష్టికి వెళ్లింది. వెంటనే రోడ్డుకు మరమ్మత్తులు చేపట్టారు.
బాదల్ సేవ..
రోడ్డుపై ప్రమాదకరంగా ఉండే గుంటలు, మ్యాన్‌హోల్స్ నుంచి ప్రజలను అప్రమత్తం చేయడమే లక్ష్యంగా 36 ఏళ్ల బాదల్ నంజుంద స్వామి బొమ్మలు గీస్తూ ఉంటారు. ఇవి విశేష ఆదరణ పొందుతున్నాయి. కేవలం అప్రమత్తం చేయడానికే గాక, మున్సిపాలిటీ అధికారుల కళ్లు తెరపించేందుకూ ఉపయోగపడుతున్నాయి.
నమ్మా బెంగళూరు..
బాదల్ రూపొందించిన ఫైబర్ మొసలి స్ఫూర్తితో నమ్మా బెంగళూరు (మన బెంగళూరు) స్వచ్ఛంద సంస్థ సైతం ఇటువంటి నిర్మాణాలు చేయడం ప్రారంభించింది. మీడియాలో విశేష ప్రచారం పొందిన అనకొండ కోసమైతే ఆ సంస్థ ఆర్టిస్టు పుష్పరాజ్ రెండు రోజులు కష్టపడ్డారు. దీని గురించి ప్రశ్నించినపుడు సంస్థ సీఈవో శ్రీధర్ పబ్బిషెట్టి ఒకింత అసహనంగా స్పందించారు. అనకొండ తయారీ కోసం తాము పెద్దగా కష్టపడలేదని, దాన్ని యశ్వంత్‌పూర్‌లో అమర్చేందుకు మాత్రం చాలా కష్టపడాల్సివచ్చిందని అన్నారు. కొందరు వీధి గూండాలు తమను బెదిరించారని, తమ కార్యకర్తలను కొట్టారని అన్నారు. చివరకు జర్నలిస్టులు రంగప్రవేశం చెయ్యడంతో గూండాలు పారిపోయారని, మంచిపని చేయడానికి కూడా మన దేశంలో అవాంతరాలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆయన వాపోయారు.
సామాజిక స్పృహ..
ఆర్టిస్టు బాదల్ తరహాలోనే ప్రస్తుతం ఆర్ట్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ చేస్తోన్న పుష్పరాజ్ కూడా ఫైబర్ నిర్మాణాలతో ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నాడు. ఇతడు తయారుచేసిన అనకొండతో పాటు, మ్యాన్‌హోల్‌లో ఇరుక్కుని సహాయం కోసం అర్థిస్తున్న ఓ మానవుడి ఆకారం కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక, బాదల్ గురించైతే బెంగళూరు మొత్తానికీ తెలుసు. ఇప్పుడు అతనో సెలబ్రిటీ. తన కళాఖండాలతో బీబీఎంపీ అధికారుల్లో కదలిక తెచ్చి, మరమ్మత్తులు చేయిస్తున్న ఘనుడు. యువత వీరిని ఆదర్శంగా తీసుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. నిజానికి నేటితరం దేశ భక్తులు వీరే అనడంలో అతిశయోక్తి అసలే లేదు.