మేం ఉగ్రవాదులం.. | they said we are joined in | Sakshi
Sakshi News home page

మేం ఉగ్రవాదులం..

Published Mon, Jul 14 2014 11:20 PM | Last Updated on Sat, Sep 2 2017 10:17 AM

they said we are joined in

ఐఎస్‌ఐఎస్‌లో చేరినట్టు ప్రకటన

ఇరాక్‌లో ధర్మపోరాటం చేస్తున్న ఐఎన్‌ఐఎస్ అనే ఉగ్రవాద సంస్థ తరఫున తామూ పోరాడుతున్నామని కల్యాణ్ యువకులు తమ కుటుంబాలకు లేఖ రాశారు. దీంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన యువకుల తల్లిదండ్రులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
 
సాక్షి, ముంబై: ఇరాక్‌లో జరుగుతున్న ధర్మయుద్ధంలో తామూ పాల్గొంటున్నామని నలుగురు ముంబై యువకులు ప్రకటించడం సంచలనం సృష్టించింది. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్‌ఐఎస్) అనే ఉగ్రవాసంస్థ తరఫున పోరాడుతున్నామని కల్యాణ్‌కు చెందిన వీళ్లు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఈ సంగతి తెలుసుకొని దిగ్భ్రాంతికి గురైన గురైన యువకుల తల్లిదండ్రులు కల్యాణ్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

యువకులు రాసిన లేఖ ఆధారంగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని పోలీసులు వెల్లడించారు. లేఖ జిరాక్స్ కాపీని కూడా బాధితులు పోలీసులకు అందజేశారు. వివరాలిలా ఉన్నాయి. కల్యాణ్‌లో నివాసముంటున్న ఇజాజ్ బదురుద్దీన్ మాజిద్ కొడుకు ఆరిఫ్ ఫయ్యద్ మజీద్ మోటర్ సైకిల్ కొనివ్వలేదనే కోపంతో కొన్ని రోజుల క్రితం ఇంటి నుంచి పారిపోయాడు.
 
 కోపం చల్లారిన తరువాత ఇంటికి వస్తాడులే అని ఎజాజ్ భావించారు. అయితే ఆరిఫ్ ఉగ్రవాద సంస్థ వైపు దృష్టి సారించాడని తెలిసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. తనతోపాటు ఫహాద్ తన్వీర్ షేక్, అమన్ నయీం టండెల్, షాహిన్ ఫారుఖీ టంకీ అనే ముగ్గురు మిత్రులున్నట్లు ఇతడు తల్లిదండ్రులకు లేఖ రాశాడు.

వీళ్లంతా 20 ఏళ్లలోపు యువకులు కావడంతో ఉగ్రవాద సంస్థలు ఆకర్షించగలిగాయని పోలీసులు అంటున్నారు. ప్రస్తుతం ఇరాక్‌లో సున్నీ ఉగ్రవాదుల దాడులు జరుగుతున్నాయి. అందులో అనేక మంది తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఉద్యోగవేటలో అక్కడికి వెళ్లిన లక్షల మంది భారతీయుల అక్కడే చిక్కుకున్నారు. ఎవరు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి ఉంది. ఆరిఫ్, ఇతని ముగ్గురు స్నేహితులు ఎక్కడున్నారనేది చెప్పడం కష్టమని ఇరాక్‌లోని భారత రాయబార కార్యాలయం పేర్కొంది.  
 
ఒకసారి ఉగ్రవాద సంస్థలో చేరిన తరువాత ప్రాణాలతో బయటపడడం కష్టమని పోలీసులు అంటున్నారు. తాను తిరిగి రాబోనని, అందరం స్వర్గంలో కులుద్దామని తల్లిదండ్రులకు రాసిన లేఖలో ఆరిఫ్ పేర్కొన్నాడు. ఇతనితోపాటు వెళ్లిన షేక్ కూడా ఇంజనీరింగ్ పూర్తిచేశాడు. ఇతని తండ్రి డాక్టర్ మక్బూల్ అహ్మద్‌కు కల్యాణ్‌లో ఆస్పత్రి ఉంది. టండెల్ కూడా ఇంజినీరింగ్ చేస్తున్నాడు. ఇతని తండ్రి ఓ ప్రైవేటు కంపెనీ ఉద్యోగి. టంకీ ఓ కాల్‌సెంటర్‌లో పనిచేస్తుండేవాడు.

ఇదిలా ఉండగా తమ పిల్లలను చెడు మార్గంలోని తీసుకెళుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ లేదా హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయి తమ గోడు వినిపించుకోవాలని ఉందని మాజిద్ అన్నారు. అయితే వీరు స్వయంగా ఇరాక్ వెళ్లారా లేక ఎవరైనా తీసుకెళ్లారా తదితర వివరాలు తెలియాల్సి ఉంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement