Arif
-
ఉద్యోగమని నమ్మించి చేపలు పట్టిస్తున్నారు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఉద్యోగాలు ఇస్తామని మభ్యపెట్టి యువకుల్ని తీసుకువెళ్లి.. వారితో కృష్ణా నదిలో చేపలు పట్టిస్తూ బందీలుగా మార్చుకుంటున్న వైనం వెలుగు చూసింది. ఈ ముఠా ఉచ్చులో చిక్కుకుని గుంటూరు జిల్లాకు చెందిన యువకుడు ప్రాణాలు అరచేత పట్టుకుని బయటపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. గుంటూరుకు చెందిన ఆరిఫ్ అనే యువకుడు పాలిటెక్నిక్ పూర్తి చేశాడు. ఉద్యోగ వేటలో ఉన్న ఆరిఫ్‌కు గుంటూరు నాజ్ సెంటర్‌కు చెందిన మొహిద్దీన్ పరిచయమయ్యాడు. వినుకొండలో చేపల అక్వేరియంలో ఉద్యోగం ఉందని.. వారానికి రూ.15 వేలు ఇస్తారని ఆరిఫ్‌ను మొహిద్దీన్ నమ్మించాడు. ఆ ఉద్యోగం కావాలంటే తనకు రూ.10 వేలు ఇవ్వాలన్నాడు. దీంతో ఆరిఫ్ తన బైక్ తాకట్టు పెట్టి రూ.10 వేలు ఇచ్చాడు. గత నెల 23న మొహిద్దీన్ కలిసి వ్యాన్‌లో బయలుదేరగా, గుంటూరులో మరో ఇద్దరిని, నరసరావుపేటలో మరో ముగ్గురిని ఎక్కించిన తర్వాత వ్యాన్‌లో ఖాళీలేదని, తాను వెనుక వస్తానని మొహిద్దీన్ మధ్యలో దిగిపోయాడు. రాత్రి నంద్యాల జిల్లా కొత్తపల్లి అడవుల్లోకి తీసుకెళ్లారు. అక్కడ కృష్ణా నదిలో పడవ ఎక్కించి సంగమేశ్వర వద్ద దింపారు. ఇక్కడకెందుకు తీసుకొచ్చారని అడగ్గా.. ఇక్కడ చేపలు పట్టాలని చెప్పి ఆరిఫ్ వద్ద ముఠా సభ్యులు ఫోన్ లాగేసుకున్నారు. ఎవరైనా వెళ్లిపోవడానికి ప్రయ త్నిస్తే ముఠా సభ్యులు చితకబాదుతుండటంతో ఆరిఫ్ బిక్కుబిక్కుమంటూ గడిపాడు. తన సెల్‌ఫోన్‌ను ఎలాగో దక్కించుకున్న ఆరిఫ్ ఇంకో వ్యక్తితో కలిసి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. రోజంతా కొండల్లో నుంచి నడిచి బయటకు వచ్చి కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు. ఛార్జింగ్ అయిపోవడంతో ఫోన్ కట్ అయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై నల్లపాడు పోలీసుల సహాయంతో లొకేషన్ కనుక్కుని అక్కడికి వెళ్లారు. స్థానికులను విచారించగా.. ఇక్కడకు పనుల కోసం వచ్చిన వారిలో చాలామంది గల్లంతయ్యారని చెప్పడంతో ఆందోళన చెందారు. కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడానికి ప్రయత్నిస్తే గుంటూరులో ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ కాపీ తీసుకురావాలన్నారు. దీంతో ఆరిఫ్ కుటుంబ సభ్యులు తిరుగు ప్రయాణంలో మార్కాపురం రాగా.. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఆరిఫ్ ఇంటికి ఫోన్ చేసి కర్నూలు బస్టాండ్‌లో ఉన్నానని చెప్పడంతో వారు మార్కాపురం బస్ ఎక్కి రావాలని సూచించారు. అతను వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు మంగళవారం గుంటూరు చేరుకున్నారు. ముఠా వలలో చిక్కి పదుల సంఖ్యలో యువకులు అక్కడ ఉన్నారని, పోలీసులు వారిని కాపాడాలని ఆరిఫ్ ‘సాక్షి’కి తెలిపాడు. -
కాంగ్రెస్ సీనియర్ నేత ఆరీఫ్ అకీల్ కన్నుమూత
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నేత ఆరీఫ్ అకీల్ కన్నుమూశారు. భోపాల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం(నేడు) ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆరీఫ్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, చికిత్స పొందుతున్నారు.ఆరీఫ్ 1990లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన భోపాల్ నార్త్ అసెంబ్లీ స్థానం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. అదేవిధంగా మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ప్రభుత్వం హయాంలో రెండుసార్లు మంత్రి పదవిని కూడా చేపట్టారు. మైనారిటీ సంక్షేమం, జైళ్లు, ఆహార శాఖలను పర్యవేక్షించారు.ఆరీఫ్ అకిల్ కుమారుడు అతీఫ్ అకీల్ తండ్రి వారసత్వాన్ని నిలబెడుతూ, 2023లో భోపాల్ నార్త్ అసెంబ్లీ స్థానం నుండి పోటీచేసి, గెలుపొందారు. 72 ఏళ్ల ఆరీఫ్ కొంతకాలంగా హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. తాజాగా చికిత్స నిమిత్తం భోపాల్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. వెంటిలేటర్ సపోర్టుపై చికిత్స పొందుతూ కన్నుమూశారు. -
కేరళ గవర్నర్‌కు జెడ్ ప్లస్ కేటగిరి భద్రత పెంపు.. ఎందుకంటే?
తిరువనంతపురం: సీపీఐ(ఎం) అనుబంధ సంస్థ స్టూడెంట్ ఫెడెరేషన్ ఆఫ్ ఇండియా విద్యార్థులు చేపట్టిన నిరసనల నేపథ్యంలో కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్‌కు సీఆర్పీఎఫ్ బలగాలతో Z+ కేటగిరి భద్రతను మరింత విస్తరిస్తున్నామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కేరళ రాజ్‌భవన్‌కు తెలియజేసింది. ఈ విషయాన్ని కేరళ రాజ్‌భవన్ ‘ఎక్స్’ ట్విటర్లో పేర్కొంది. సీపీఐ(ఎం) అనుబంధ సంస్థ అయిన స్టూడెంట్ ఫెడెరేషన్ ఆఫ్ ఇండియా(SFI) శనివారం కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్‌కు వ్యతిరేకంగా నల్ల జెండాలతో నిరసనకు దిగారు. గవర్నర్ ఆరిఫ్ కొట్టారక్కర జిల్లాలో ఓ కార్యక్రమానికి హాజరుకావటానికి వెళుతున్న సమయంలో పెద్ద ఎత్తున ఎస్ఎఫ్ఐ విద్యార్థులు గవర్నర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. నల్ల జెండాలతో నిరసన తెలిపారు. విద్యార్థుల నిరసనతో విసిగిపోయిన గవర్నర్ ఆరిఫ్.. అనూహ్యంగా రోడ్డు పక్కన్న ఉన్న ఓ షాప్ ముందు బైఠాయించారు. తనపై నిరసన తెలుపుతున్న ఎస్ఎఫ్ఐ విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకొని.. అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో అక్కడ గందరగోళ వాతావరణం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన కొల్లాం జిల్లాలో జరిగింది. గవర్నర్ అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను పోలీసులకు తెలియజేశారు. నిరసన ఘటనపై గవర్నర్ ఆరిఫ్ .. ముఖ్యమంత్రి పినరయ్ విజయన్‌పై విమర్శలు చేశారు. పినరయ్ విజయన్ ప్రభుత్వం.. రాష్ట్రంలో అధర్మం, అశాంతిని ప్రేరేపిస్తోందని మండిపడ్డారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడితో సహా పలువురి నాయకులపై కోర్టుల్లో క్రిమినల్ కేసులు ఉన్నా సీఎం పినరయ్ విజయన్ వారిని కాపాడటానికి పోలీసులకు దిశానిర్ధేశం చేస్తున్నారని విమర్శించారు. ఇక కొంత కాలంగా కేరళ సీఎం, గవర్నర్ మధ్యలు విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అదేవిధంగా గతంలో ఎస్ఎఫ్ఐ విద్యార్థులు సైతం గవర్నర్ ఆరిఫ్పై పలుమార్లు నిరసన వ్యక్తం చేశారు. చదవండి: తలొగ్గిన సర్కార్.. మరాఠా రిజర్వేషన్ల ఆందోళనకు ఫుల్స్టాప్ -
కేరళ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
తిరువనంతపురం: కేరళ గవర్నర్ ఆరిఫ్ మహహ్మద్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన శనివారం కాలికట్ యూనివర్సిటీ సందర్శించిన క్రమంలో ఎస్ఎఫ్ఐ విద్యార్థులు గవర్నర్‌కు తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు. ఆయన వాహనాన్ని ఎస్ఎఫ్ఐ విద్యార్థులు, నాయకులు అడ్డుకున్నారు. అయితే ఈ ఘటనపై గవర్నర్ ఆరీఫ్ సీరియస్ అయ్యారు. తనపై విద్యార్థులు దాడి చేయడానికి ప్రయత్నించారని వారంతా నేరస్థులు అని మండిపడ్డారు. ఈ ఘటనకు పాల్పడిన వారి వెనకాల ముఖ్యమంత్రి పినరయి విజయన్ హస్తం ఉందని ఆరోపించారు. తనపై దాడి చేయించడానికి సీఎం విజయన్.. నిరసనకారులను ఉసిగొలిపాడని మండిపడ్డారు. తనను అడ్డుకుని దాడి చేయడానికి ప్రయత్నించిన విద్యార్థులంతా నేరస్థులని, సీఎం వ్యక్తిగతంగా విద్యార్థులను తనపైకి నిరసకు దిగాలని సూచించినట్లు ఆరోపించారు. అయితే గవర్నర్ ఆరీఫ్.. పలు యూనివర్సిటీల్లో బీజేపీ, ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వ్యక్తులను వివిధ పదవులకు నామినెట్ చేస్తున్నరని ఆరోపణలు ఉన్నాయి. వాటి నేపథ్యంలో ఆయన కలికట్ యూనివర్సిటీ సందర్శనకు రావటంతో ఎస్ఎఫ్ఐ విద్యార్థులు నిరసనకు దిగినట్లు తెలుస్తోంది. ఈ ఆరోపణలపై స్పందించిన గవర్నర్.. తాను కేవలం రాష్ట్రపతికి మాత్రమే జవాబుదారినని వెల్లడించారు. అదీకాక తాను విద్యార్థుల ముసుగులో ఉన్న నేరస్థులకు జవాబుదారి కాదని స్పష్టం చేశారు. చదవండి: మతగురువు దారుణ హత్య.. పోలీసులపై గ్రామస్థుల ఆగ్రహం -
'యూ ఆర్ వెరీ స్పెషల్'.. నిహారిక పోస్ట్ వైరల్
గత కొంతకాలంగా మెగాడాటర్ నిహారిక కొణిదెల తరచుగా వార్తల్లో నిలుస్తోంది. భర్త చైతన్య జొన్నలగడ్డతో మనస్పర్థల కారణంగా వీరి విడాకులు తీసుకోనున్నారంటూ రూమర్స్ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇంతవరకు మెగా ఫ్యామిలీలో ఎవరూ స్పందించలేదు. ఇప్పటికే చైతన్య.. నిహారికను అన్‌ఫాలో చేయడమే కాకుండా పెళ్లి ఫోటోలన్నింటినీ డిలీట్ చేశాడు. అయితే తాజాగా నిహారిక తన ఇన్‌స్టాలో స్టోరీస్‌లో చేసిన పోస్ట్ తెగ వైరలవుతోంది. తాజాగా నిహారిక బర్త్ డే విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. యూ ఆర్ వెరీ స్పెషల్ అంటూ విషెస్ చెప్పింది నిహారిక. ప్రముఖ ఫోటోగ్రాఫర్ అరిఫ్ పుట్టినరోజు సందర్భంగా అతనితో దిగిన పిక్స్ షేర్ చేసింది. కాగా.. ఇప్పటికే నటనకు గుడ్‌బై చెప్పి నిర్మాతగా మారిన నిహారిక సొంతంగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌ను నెలకొల్పిన సంగతి తెలిసిందే. తాజాగా నిహారిక మరో ముందడుగు వేసింది. తన ప్రొడక్షన్ బ్యానర్‌కు ఒక ఆఫీస్‌ను ఏర్పాటు చేసుకుంది. ఎప్పటి నుంచో సొంతంగా ఆఫీస్ నెలకొల్పాలని కలలు కన్న నిహారిక ఇటీవలే ఆ పని పూర్తిచేసింది. (ఇది చదవండి: అనుకున్న పని చేసేసిన నిహారిక.. కంగ్రాట్స్ అంటూ కామెంట్స్) -
కశ్మీర్లో సెంట్ బాటిల్ ఐఈడీ బాంబ్
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో పలు పేలుళ్లతో సంబంధమున్న లష్కరే తోయిబా ఉగ్రవాది ఆరిఫ్‌ను పోలీసులు రేసీ జిల్లాలో అరెస్ట్‌చేశారు. అతని వద్ద సుగంధ ద్రవ్య సీసాలో అమర్చిన అధునాతన పేలుడు పదార్థం(ఐఈడీ)ను స్వాధీనం చేసుకున్నారు. జమ్మూకశ్మీర్‌లో ఇలా పర్ఫ్యూమ్ బాటిల్లో ఐఈడీ బాంబ్‌ను స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారి అని జమ్మూకశ్మీర్ డైరెక్టర్ జనరల్ దిల్బాగ్ సింగ్ చెప్పారు. స్ప్రే బటన్‌ను నొక్కడంతో యాక్టివేట్ అయిన ఆ బాంబ్‌ను నిర్వీర్యం చేసే పనిలో భద్రతా బలగాలు నిమగ్నమయ్యాయి. ‘ వాస్తవానికి ఆరిఫ్ ఉపాధ్యాయుడిగా 12 ఏళ్ల క్రితం ప్రభుత్వ ఉద్యోగంలో చేరాడు. మూడేళ్ల క్రితం కరాచీకి పారిపోయిన మేనమామ ద్వారా కశ్మీర్‌లోని లష్కరే ఉగ్రవాది ఖాసిమ్‌తో సంబంధం పెట్టుకుని ఉగ్రవాదిగా మారాడు’ అని డీజీపీ చెప్పారు. -
ఒకే ఒక్కడు త్రివర్ణంతో...
బీజింగ్: కరోనా పుట్టిన దేశం రెండేళ్ల తర్వాత కరోనా ఆంక్షల మధ్య ఒలింపిక్ క్రీడలకు వేదికైంది. దేశంలో పలు చోట్ల ఇంకా లాక్డౌన్లు కొనసాగుతుండగానే మరోవైపు చైనా రాజధాని నగరంలో వింటర్ ఒలింపిక్స్–2022 శుక్రవారం ప్రారంభమయ్యాయి. 2008 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చిన నేషనల్ స్టేడియంలోనే ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. దీంతో ఒలింపిక్స్, వింటర్ ఒలింపిక్స్ రెండింటినీ నిర్వహించిన తొలి నగరంగా బీజింగ్ ఘనత వహించింది. ఆరంభ కార్యక్రమంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో పాటు ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ పాల్గొన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా దీనికి హాజరు కాగా... భారత్ సహా పలు దేశాలు ‘దౌత్యపర బహిష్కరణ’ను ప్రకటించి కార్యక్రమానికి దూరంగా ఉన్నాయి. 2020లో గాల్వాన్ సరిహద్దుల్లో భారత్‌తో పోరులో గాయపడిన సైనికుడు ఖి ఫాబియోను రిలేలో టార్చ్ బేరర్‌గా పెట్టడంపై తమ అసంతృప్తిని ప్రదర్శిస్తూ భారత్ ‘డిప్లొమాటిక్ బాయ్‌కాట్’ను ప్రకటించింది. మానవ హక్కుల విషయంలో చైనా వ్యవహార శైలిని విమర్శిస్తూ పలు ఇతర దేశాలు కూడా ప్రారంభోత్సవానికి దూరమయ్యాయి. వింటర్ ఒలింపిక్స్‌లో భారత్ నుంచి ఒకే ఒక్క ఆటగాడు ఆరిఫ్ ఖాన్ అర్హత సాధించాడు. స్కీయింగ్‌లో స్లాలొమ్, జెయింట్ స్లాలొమ్ ఈవెంట్లలో అతను పోటీ పడుతున్నాడు. జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లాకు చెందిన 31 ఏళ్ల ఆరిఫ్ ప్రారంభోత్సవ కార్య క్రమంలో భారత జాతీయ జెండాతో ముందుండగా ... భారత సహాయక సిబ్బందిలోని మరో ముగ్గురు కూడా ఆరిఫ్ వెంట నడిచారు. ఆరిఫ్ ఈవెంట్లు ఈనెల 13, 16వ తేదీల్లో ఉన్నాయి. -
నీటి కుంటలో మునిగి బాలుడు మృతి
వైఎస్సార్ జిల్లా బద్వేలులోని శివాలయం సమీపంలో నీటి కుంటలో మునిగి ఓ బాలుడు మృతి చెందాడు. మహబూబ్‌నగర్ కాలనీకి చెందిన ఆరిఫ్ (13) ఏడవ తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో స్నేహితులతో కలసి శివాలయం సమీపంలోని నీటి కుంట దగ్గరకు వెళ్లాడు. ఈత కొట్టేందుకు లోపలికి దిగగా, లోతైన ప్రదేశంలో బురదలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. -
‘ప్రోత్సాహకాల' కమిటీ ఏర్పాటు
ముకేశ్, ఆరిఫ్‌లకు చోటు సాక్షి, హైదరాబాద్: సానియా మీర్జాకు రూ. 2 కోట్లు...గగన్ నారంగ్‌కు రూ. 90 లక్షలు...మరో ప్లేయర్‌కు రూ. 50 లక్షలు... ఇలా ఇటీవల తెలంగాణ ప్రభుత్వం పలువురు క్రీడాకారులకు ‘మనసు విప్పి’ అందజేసిన నజరానాలు. ఆటగాళ్లకు నగదు ప్రోత్సాహకాలు అందించడంలో నిబంధనలకు విరుద్ధంగా, ఇచ్ఛానుసారం వ్యవహరించిందని ప్రభుత్వంపై క్రీడా వర్గాలనుంచే విమర్శలు వచ్చాయి. అయితే భవిష్యత్తులో ఇలాంటి సమస్య రాకుండా స్పష్టమైన విధానం రూపొందించి, ప్రదర్శనకు తగ్గ ప్రోత్సాహకం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా 10 మంది సభ్యులతో నగదు ప్రోత్సాహకాల కమిటీని ఏర్పాటు చేసింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్స్) ఎండీ లవ్ అగర్వాల్ దీనికి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఈ కమిటీ పదిహేను రోజుల్లోగా తమ నివేదికను అందజేస్తుంది. ఇందులో ఒలింపిక్స్, కామన్వెల్త్, ఆసియా క్రీడలవంటి మెగా ఈవెంట్లు, ప్రపంచ చాంపియన్‌షిప్‌లు, ఇన్విటేషన్ టోర్నీల మధ్య స్పష్టమైన తేడా చూపిస్తూ ప్రాధాన్యతాక్రమాలు తెలియజేసే అవకాశం ఉంది. ట్రిపుల్ ఒలింపియన్ ముకేశ్ కుమార్, ద్రోణాచార్య ఆరిఫ్‌లతో పాటు ఒలింపిక్ సంఘం ప్రతినిధి, వివిధ క్రీడల కోచ్‌లు, అధికారులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఐదుగురిపై ఆరోపణలు ‘ఎంసెట్’ మెడికల్ కౌన్సెలింగ్‌లో స్పోర్ట్స్ కోటా ప్రవేశాల విషయంలో అక్రమాలకు పాల్పడినట్లు ఐదుగురు స్పోర్ట్స్ అథారిటీ అధికారులపై ఆరోపణలు వచ్చాయి. వీరిలో ముగ్గురు తెలంగాణ, ఇద్దరు ఆంధ్ర స్పోర్ట్స్ అథారిటీకి చెందినవారు ఉన్నారు. తెలంగాణ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ‘శాట్స్’ ఎండీ భావిస్తున్నారు. అందులో భాగంగా వీరికి చార్జ్ మెమో జారీ చేశారు. పది రోజుల్లో సంతృప్తికర సమాధానం ఇవ్వకపోతే వీరిని సస్పెండ్ చేసే అవకాశం ఉంది. ‘శాప్’ ఎండీ అందుబాటులో లేకపోవడంతో మిగతా ఇద్దరు అధికారులకు ఇంకా నోటీసులు అందలేదు. అయితే వారిపై కూడా తదుపరి చర్యలు తీసుకోనున్నారు. -
మేం ఉగ్రవాదులం..
ఐఎస్ఐఎస్లో చేరినట్టు ప్రకటన ఇరాక్‌లో ధర్మపోరాటం చేస్తున్న ఐఎన్‌ఐఎస్ అనే ఉగ్రవాద సంస్థ తరఫున తామూ పోరాడుతున్నామని కల్యాణ్ యువకులు తమ కుటుంబాలకు లేఖ రాశారు. దీంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన యువకుల తల్లిదండ్రులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సాక్షి, ముంబై: ఇరాక్‌లో జరుగుతున్న ధర్మయుద్ధంలో తామూ పాల్గొంటున్నామని నలుగురు ముంబై యువకులు ప్రకటించడం సంచలనం సృష్టించింది. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) అనే ఉగ్రవాసంస్థ తరఫున పోరాడుతున్నామని కల్యాణ్‌కు చెందిన వీళ్లు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఈ సంగతి తెలుసుకొని దిగ్భ్రాంతికి గురైన గురైన యువకుల తల్లిదండ్రులు కల్యాణ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. యువకులు రాసిన లేఖ ఆధారంగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని పోలీసులు వెల్లడించారు. లేఖ జిరాక్స్ కాపీని కూడా బాధితులు పోలీసులకు అందజేశారు. వివరాలిలా ఉన్నాయి. కల్యాణ్‌లో నివాసముంటున్న ఇజాజ్ బదురుద్దీన్ మాజిద్ కొడుకు ఆరిఫ్ ఫయ్యద్ మజీద్ మోటర్ సైకిల్ కొనివ్వలేదనే కోపంతో కొన్ని రోజుల క్రితం ఇంటి నుంచి పారిపోయాడు. కోపం చల్లారిన తరువాత ఇంటికి వస్తాడులే అని ఎజాజ్ భావించారు. అయితే ఆరిఫ్ ఉగ్రవాద సంస్థ వైపు దృష్టి సారించాడని తెలిసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. తనతోపాటు ఫహాద్ తన్వీర్ షేక్, అమన్ నయీం టండెల్, షాహిన్ ఫారుఖీ టంకీ అనే ముగ్గురు మిత్రులున్నట్లు ఇతడు తల్లిదండ్రులకు లేఖ రాశాడు. వీళ్లంతా 20 ఏళ్లలోపు యువకులు కావడంతో ఉగ్రవాద సంస్థలు ఆకర్షించగలిగాయని పోలీసులు అంటున్నారు. ప్రస్తుతం ఇరాక్‌లో సున్నీ ఉగ్రవాదుల దాడులు జరుగుతున్నాయి. అందులో అనేక మంది తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఉద్యోగవేటలో అక్కడికి వెళ్లిన లక్షల మంది భారతీయుల అక్కడే చిక్కుకున్నారు. ఎవరు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి ఉంది. ఆరిఫ్, ఇతని ముగ్గురు స్నేహితులు ఎక్కడున్నారనేది చెప్పడం కష్టమని ఇరాక్‌లోని భారత రాయబార కార్యాలయం పేర్కొంది. ఒకసారి ఉగ్రవాద సంస్థలో చేరిన తరువాత ప్రాణాలతో బయటపడడం కష్టమని పోలీసులు అంటున్నారు. తాను తిరిగి రాబోనని, అందరం స్వర్గంలో కులుద్దామని తల్లిదండ్రులకు రాసిన లేఖలో ఆరిఫ్ పేర్కొన్నాడు. ఇతనితోపాటు వెళ్లిన షేక్ కూడా ఇంజనీరింగ్ పూర్తిచేశాడు. ఇతని తండ్రి డాక్టర్ మక్బూల్ అహ్మద్‌కు కల్యాణ్‌లో ఆస్పత్రి ఉంది. టండెల్ కూడా ఇంజినీరింగ్ చేస్తున్నాడు. ఇతని తండ్రి ఓ ప్రైవేటు కంపెనీ ఉద్యోగి. టంకీ ఓ కాల్సెంటర్లో పనిచేస్తుండేవాడు. ఇదిలా ఉండగా తమ పిల్లలను చెడు మార్గంలోని తీసుకెళుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ లేదా హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయి తమ గోడు వినిపించుకోవాలని ఉందని మాజిద్ అన్నారు. అయితే వీరు స్వయంగా ఇరాక్ వెళ్లారా లేక ఎవరైనా తీసుకెళ్లారా తదితర వివరాలు తెలియాల్సి ఉంది.