‘ప్రోత్సాహకాల' కమిటీ ఏర్పాటు
ముకేశ్, ఆరిఫ్‌లకు చోటు
సాక్షి, హైదరాబాద్: సానియా మీర్జాకు రూ. 2 కోట్లు...గగన్ నారంగ్‌కు రూ. 90 లక్షలు...మరో ప్లేయర్‌కు రూ. 50 లక్షలు... ఇలా ఇటీవల తెలంగాణ ప్రభుత్వం పలువురు క్రీడాకారులకు ‘మనసు విప్పి’ అందజేసిన నజరానాలు. ఆటగాళ్లకు నగదు ప్రోత్సాహకాలు అందించడంలో నిబంధనలకు విరుద్ధంగా, ఇచ్ఛానుసారం వ్యవహరించిందని ప్రభుత్వంపై క్రీడా వర్గాలనుంచే విమర్శలు వచ్చాయి. అయితే భవిష్యత్తులో ఇలాంటి సమస్య రాకుండా స్పష్టమైన విధానం రూపొందించి, ప్రదర్శనకు తగ్గ ప్రోత్సాహకం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అందులో భాగంగా 10 మంది సభ్యులతో నగదు ప్రోత్సాహకాల కమిటీని ఏర్పాటు చేసింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్స్) ఎండీ లవ్ అగర్వాల్ దీనికి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఈ కమిటీ పదిహేను రోజుల్లోగా తమ నివేదికను అందజేస్తుంది. ఇందులో ఒలింపిక్స్, కామన్వెల్త్, ఆసియా క్రీడలవంటి మెగా ఈవెంట్లు, ప్రపంచ చాంపియన్‌షిప్‌లు, ఇన్విటేషన్ టోర్నీల మధ్య స్పష్టమైన తేడా చూపిస్తూ ప్రాధాన్యతాక్రమాలు తెలియజేసే అవకాశం ఉంది. ట్రిపుల్ ఒలింపియన్ ముకేశ్ కుమార్, ద్రోణాచార్య ఆరిఫ్‌లతో పాటు ఒలింపిక్ సంఘం ప్రతినిధి, వివిధ క్రీడల కోచ్‌లు, అధికారులు ఇందులో సభ్యులుగా ఉన్నారు.
ఐదుగురిపై ఆరోపణలు
‘ఎంసెట్’ మెడికల్ కౌన్సెలింగ్‌లో స్పోర్ట్స్ కోటా ప్రవేశాల విషయంలో అక్రమాలకు పాల్పడినట్లు ఐదుగురు స్పోర్ట్స్ అథారిటీ అధికారులపై ఆరోపణలు వచ్చాయి. వీరిలో ముగ్గురు తెలంగాణ, ఇద్దరు ఆంధ్ర స్పోర్ట్స్ అథారిటీకి చెందినవారు ఉన్నారు. తెలంగాణ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ‘శాట్స్’ ఎండీ భావిస్తున్నారు. అందులో భాగంగా వీరికి చార్జ్ మెమో జారీ చేశారు. పది రోజుల్లో సంతృప్తికర సమాధానం ఇవ్వకపోతే వీరిని సస్పెండ్ చేసే అవకాశం ఉంది. ‘శాప్’ ఎండీ అందుబాటులో లేకపోవడంతో మిగతా ఇద్దరు అధికారులకు ఇంకా నోటీసులు అందలేదు. అయితే వారిపై కూడా తదుపరి చర్యలు తీసుకోనున్నారు.