ఇది చారిత్రాత్మక విజయం: మోదీ
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన 202 స్థానాలకు పైగా సీట్లు కైవసం చేసుకున్న అనంతరం ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. తమ పార్టీకి అఖండ విజయాన్ని అందించిన యూపీ ప్రజలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు తమ ప్రభుత్వంపై ఎంతో నమ్మకం ఉంచారని, అందుకే విశేషమైన మద్దతు లభించిందన్నారు. యూపీ ఎన్నికల్లో యువత ఓట్లే కీలకమయ్యామని ఇతర రాష్ట్రాల్లోనూ యువత బీజేపీ వైపు మొగ్గు చూపిందని చెప్పారు. ఉత్తమ పాలన, అభివృద్ధికే ప్రజలు పట్టం కట్టారని మోదీ పేర్కొన్నారు.
తమ ప్రభుత్వంపై దేశ వ్యాప్తంగా సానుకూల దృక్పథంతో ఉన్నారని ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నిరూపించాయన్నారు. నమ్మకం, నిజాయితీలకే దేశం మొత్తం ఓటేసిందని, అందువల్లే బీజేపీ విజయం సాధ్యమైందని మోదీ పేర్కొన్నారు. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లలో బీజేపీ జయకేతనం ఎగరవేసింది. ఈ రెండు రాష్ట్రాల్లో మరికొన్ని స్థానాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. సమాజ్ వాదీ, కాంగ్రెస్ హోరాహోరీగా ప్రచారం చేసినా ఆ కూటమి కేవలం 50 సీట్లకే పరిమితమయ్యేలా కనిపిస్తుండగా, మరోవైపు బీఎస్పీ అధినేత్రి మాయావతి ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ పట్టుమని 20 సీట్లు వచ్చేలా కనిపించడం లేదు.