నీళ్ల అడుగున కూ.. చుక్‌.. చుక్‌ | This tunnel technology is awesome | Sakshi
Sakshi News home page

నీళ్ల అడుగున కూ.. చుక్‌.. చుక్‌

Published Tue, Jun 13 2017 12:19 AM | Last Updated on Tue, Sep 5 2017 1:26 PM

నీళ్ల అడుగున కూ.. చుక్‌.. చుక్‌

నీళ్ల అడుగున కూ.. చుక్‌.. చుక్‌

- సాంకేతిక అద్భుతం.. ఈ సొరంగం 
హుగ్లీ నదికి 30 మీటర్ల దిగువన కోల్‌కతా మెట్రో రైలు కోసం.. 
దేశంలో తొలిసారిగా నదీగర్భంలో టన్నెల్‌ నిర్మాణం

ఉధృతంగా ప్రవహిస్తున్న ఓ నది దిగువ భాగం.. అక్కడ సొరంగంలో పొడవాటి రైల్వే ట్రాక్‌.. దానిపై నుంచి దూసుకెళ్లే రైళ్లు.. ప్రయాణికులతో కిటకిటలాడే రైల్వే స్టేషన్లు.. ఈ మాటలు చెపుతుంటే విదేశాలు, హాలీవుడ్‌ సినిమాలు గుర్తుకురావడం సహజమే. కానీ ఇప్పుడు మనదేశంలో కూడా ఇలాంటి అండర్‌గ్రౌండ్‌ రైల్వే ట్రాక్‌ సిద్ధమవుతోంది. అది కూడా సిటీ ఆఫ్‌ ప్యాలెసెస్‌గా పేరుగాంచిన కోల్‌కతాలో.. మనదేశంలో తొలిసారిగా ఓ నదీ గర్భంలో నిర్మిస్తున్న రైల్వే ట్రాక్‌ ఇదే కావడం గమనార్హం. విశేషం ఏమిటంటే మన దేశంలో ఇప్పటికీ నదీ గర్భంలో నుంచి వెళ్లే ఒక రహదారి కూడా లేదు. కానీ.. ఇప్పుడు ఏకంగా అండర్‌ గ్రౌండ్‌ మెట్రోనే రెడీ చేసేస్తున్నారు. 
 
సాంకేతిక అద్భుతం..
ఇది అత్యంత రద్దీగా ఉండే హౌరా–సెల్దా రైలు టెర్మినళ్లను కలుపుతుంది. ఈ రెండు స్టేషన్లలో రోజుకు సుమారు 25 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇకపై వీరంతా ఈ మెట్రోను వినియోగించుకోవచ్చు. సొరంగం గుండా ప్రయాణించే ఈ రైలు మార్గాన్ని సాంకేతిక అద్భుతంగా నిఫుణులు పేర్కొంటున్నారు. ప్రతి రెండున్నర నిమిషాలకు ఒక రైలు ఇక్కడి ప్లాట్‌ఫామ్‌పై ఆగుతుంది.
 
హుగ్లీకి 30 మీటర్ల దిగువన..
హుగ్లీ నదికి దిగువ భాగంలో సుమారు 30 మీటర్ల లోతులో వేల టన్నుల మట్టిని తవ్వేస్తున్నారు. సొరంగాల తవ్వకం కోసం తొలిసారిగా ఎర్త్‌ ప్రెషర్‌ బ్యాలెన్సింగ్‌ టన్నెల్‌ బోరింగ్‌ మెషిన్లను వినియోగిస్తున్నారు. ఈశాన్య భారతంలో వీటిని వినియోగించడం ఇదే తొలిసారి. ఈ సొరంగం కోసం ఇప్పటి వరకూ పది లక్షల టన్నుల మట్టిని తవ్వి పోశారు. ప్రఖ్యాత హౌరా బ్రిడ్జికి అతి సమీపంలోనే ఈ టన్నెల్‌ రూపుదిద్దుకుంటోంది. రెండు సొరంగాలుగా నిర్మిస్తున్న ఈ ట్రాక్‌లో ఇప్పటికే ఒక టన్నెల్‌ నిర్మాణం పూర్తయ్యింది. ఇక రెండో సొరంగం పూర్తి కావడానికి సిద్ధంగా ఉంది. సొరంగం తవ్వడానికి వాటర్‌ టైట్‌నెస్, వాటర్‌ప్రూఫింగ్, గ్యాస్‌కట్‌ల డిజైన్‌ ప్రధాన సవాళ్లని, ఈ సొరంగాన్ని 120 ఏళ్ల వినియోగం కోసం నిర్మిస్తున్నామని, భూకంపాలను సైతం తట్టుకుంటుందని కోల్‌కతా మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఎండీ సతీశ్‌కుమార్‌ చెప్పారు.
– సాక్షి, తెలంగాణ డెస్క్‌
 
ప్రత్యేకతలు ఇవీ..
నదికి ఎంత దిగువన సొరంగం నిర్మిస్తున్నారు..  30మీటర్లు
ఇక్కడ నది లోతు.. (మీటర్లు) 5.13
మెట్రో ట్రాక్‌ పొడవు 16.6 కి.మీ
అండర్‌గ్రౌండ్‌ ట్రాక్‌ పొడవు 10.8 కి.మీ
ప్రతి రైలులో కోచ్‌లు 6 (అన్నీ ఏసీ)
మొత్తం సొరంగాలు 2
ప్రయాణికుల సామర్థ్యం 1,000

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement