Hooghly river
-
1100 కి.మీ. ప్రయాణించిన మొసలి
కోల్‌కతా: లాక్డౌన్ వల్ల వలస కార్మికులు వందలాది కిలోమీటర్లు నడుస్తూ సొంతగూటికి చేరుకుంటున్నారు. అయితే ఓ మొసలి కూడా ఏకంగా రాష్ట్రాలనే దాటుతూ పయనించింది, కానీ స్వదేశం నుంచి వలస వస్తూ మన దేశంలో అడుగుపెట్టింది. దీని విశేషమేంటో ఓసారి చూసేద్దాం.. ఈ మొసలి ఘరియల్ జాతికి చెందినది. ఈ జాతి మొసళ్లు ఇప్పటికే అంతరించిపోతున్న జీవాల జాబితాలో ఉన్నాయి. ఇవి కేవలం చేపలను మాత్రమే ఆహారంగా భుజిస్తాయి. అందుకనుగుణంగా వీటి నోటి భాగం కూడా పొడవుగా ఉంటుంది. ఈ ఘరియల్ మొసలిని నేపాల్ దేశం అడవిలో విడిచిపెట్టింది. (వామ్మో.. మొసలి) అది అక్కడనుంచి నదుల్లో పాక్కుంటూ 1100 కి.మీ. ప్రయాణించి పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ నదికి చేరుకుంది. ఇక్కడికి చేరుకోడానికి ఘరియల్‌కు 61 రోజుల సమయం పట్టింది. దాని శరీరం మీద ఉన్న గుర్తుల ఆధారంగా దీన్ని నేపాల్‌కు చెందినదిగా భారత శాస్త్రజ్ఞులు గుర్తించారు. దీని గురించి తెలియజేస్తూ 'వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఇండియా' ఘరియల్ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంది. దీని యాత్ర కథ తెలుసుకున్న నెటిజన్లు ఆశ్చర్యచకితులవుతున్నారు. "ఈ ప్రయాణానికి పుల్‌స్టాప్ పడిందా? లేదా యాత్ర కొనసాగుతుందా?" అంటూ ప్రశ్నిస్తున్నారు. కాగా గతంలోనూ ఓ ఘరియల్ 234 రోజుల్లో వెయ్యి కి.మీ చుట్టేసి ఔరా అనిపించింది. (లాక్డౌన్ తొలగిస్తే ఇలాగే పరిగెడతారేమో!) You may be under #lockdown but this #gharial travelled 1100km from #Nepal to Hooghly! Read more here: https://t.co/JDHETRRhhv #CriticallyEndangered #savingspecies@vivek4wild @LAZoo pic.twitter.com/rdbHntRShM — Wildlife Trust India (@wti_org_india) May 25, 2020 -
నీళ్ల అడుగున కూ.. చుక్.. చుక్
- సాంకేతిక అద్భుతం.. ఈ సొరంగం - హుగ్లీ నదికి 30 మీటర్ల దిగువన కోల్‌కతా మెట్రో రైలు కోసం.. - దేశంలో తొలిసారిగా నదీగర్భంలో టన్నెల్ నిర్మాణం ఉధృతంగా ప్రవహిస్తున్న ఓ నది దిగువ భాగం.. అక్కడ సొరంగంలో పొడవాటి రైల్వే ట్రాక్.. దానిపై నుంచి దూసుకెళ్లే రైళ్లు.. ప్రయాణికులతో కిటకిటలాడే రైల్వే స్టేషన్లు.. ఈ మాటలు చెపుతుంటే విదేశాలు, హాలీవుడ్ సినిమాలు గుర్తుకురావడం సహజమే. కానీ ఇప్పుడు మనదేశంలో కూడా ఇలాంటి అండర్‌గ్రౌండ్ రైల్వే ట్రాక్ సిద్ధమవుతోంది. అది కూడా సిటీ ఆఫ్ ప్యాలెసెస్గా పేరుగాంచిన కోల్‌కతాలో.. మనదేశంలో తొలిసారిగా ఓ నదీ గర్భంలో నిర్మిస్తున్న రైల్వే ట్రాక్ ఇదే కావడం గమనార్హం. విశేషం ఏమిటంటే మన దేశంలో ఇప్పటికీ నదీ గర్భంలో నుంచి వెళ్లే ఒక రహదారి కూడా లేదు. కానీ.. ఇప్పుడు ఏకంగా అండర్ గ్రౌండ్ మెట్రోనే రెడీ చేసేస్తున్నారు. సాంకేతిక అద్భుతం.. ఇది అత్యంత రద్దీగా ఉండే హౌరా–సెల్దా రైలు టెర్మినళ్లను కలుపుతుంది. ఈ రెండు స్టేషన్లలో రోజుకు సుమారు 25 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇకపై వీరంతా ఈ మెట్రోను వినియోగించుకోవచ్చు. సొరంగం గుండా ప్రయాణించే ఈ రైలు మార్గాన్ని సాంకేతిక అద్భుతంగా నిఫుణులు పేర్కొంటున్నారు. ప్రతి రెండున్నర నిమిషాలకు ఒక రైలు ఇక్కడి ప్లాట్‌ఫామ్‌పై ఆగుతుంది. హుగ్లీకి 30 మీటర్ల దిగువన.. హుగ్లీ నదికి దిగువ భాగంలో సుమారు 30 మీటర్ల లోతులో వేల టన్నుల మట్టిని తవ్వేస్తున్నారు. సొరంగాల తవ్వకం కోసం తొలిసారిగా ఎర్త్ ప్రెషర్ బ్యాలెన్సింగ్ టన్నెల్ బోరింగ్ మెషిన్లను వినియోగిస్తున్నారు. ఈశాన్య భారతంలో వీటిని వినియోగించడం ఇదే తొలిసారి. ఈ సొరంగం కోసం ఇప్పటి వరకూ పది లక్షల టన్నుల మట్టిని తవ్వి పోశారు. ప్రఖ్యాత హౌరా బ్రిడ్జికి అతి సమీపంలోనే ఈ టన్నెల్ రూపుదిద్దుకుంటోంది. రెండు సొరంగాలుగా నిర్మిస్తున్న ఈ ట్రాక్‌లో ఇప్పటికే ఒక టన్నెల్ నిర్మాణం పూర్తయ్యింది. ఇక రెండో సొరంగం పూర్తి కావడానికి సిద్ధంగా ఉంది. సొరంగం తవ్వడానికి వాటర్ టైట్నెస్, వాటర్ప్రూఫింగ్, గ్యాస్కట్ల డిజైన్ ప్రధాన సవాళ్లని, ఈ సొరంగాన్ని 120 ఏళ్ల వినియోగం కోసం నిర్మిస్తున్నామని, భూకంపాలను సైతం తట్టుకుంటుందని కోల్‌కతా మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ సతీశ్‌కుమార్ చెప్పారు. – సాక్షి, తెలంగాణ డెస్క్ ప్రత్యేకతలు ఇవీ.. నదికి ఎంత దిగువన సొరంగం నిర్మిస్తున్నారు.. 30మీటర్లు ఇక్కడ నది లోతు.. (మీటర్లు) 5.13 మెట్రో ట్రాక్ పొడవు 16.6 కి.మీ అండర్‌గ్రౌండ్ ట్రాక్ పొడవు 10.8 కి.మీ ప్రతి రైలులో కోచ్‌లు 6 (అన్నీ ఏసీ) మొత్తం సొరంగాలు 2 ప్రయాణికుల సామర్థ్యం 1,000 -
వేధింపులు అడ్డుకుని బలైయ్యాడు
కోల్ కతా: మహిళలపై వేధింపులు అడ్డుకున్నందుకు ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కోల్ కతాలోని హౌరాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఐదు రోజుల క్రితం స్థానిక ఉత్సవాల్లో భాగంగా హుగ్లీ నదిలో గణేష్ నిమజ్జనం జరుగుతున్నప్పుడు కొంతమంది ఆకతాయిలు తాగిన మైకంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. వీరిని అరూప్ భండారి(24) అనే యువకుడు అడ్డుకున్నాడు. అతడిపై కక్ష పెంచుకున్న దుండగులు రాత్రి సమయంలో ఇంటికి తిరుగెళుతున్న భండారిపై ఇనుపరాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కోమాలోకి వెళ్లిపోయిన భండారి సోమవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో తుదిశ్వాస వదిలాడు. నిందితులపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు తొలుత నిరాకరించారు. స్థానికులు పోలీసు స్టేషన్ ను ముట్టడించడంతో తర్వాత కేసు నమోదు చేశారు.