వేధింపులు అడ్డుకుని బలైయ్యాడు
కోల్ కతా: మహిళలపై వేధింపులు అడ్డుకున్నందుకు ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కోల్ కతాలోని హౌరాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఐదు రోజుల క్రితం స్థానిక ఉత్సవాల్లో భాగంగా హుగ్లీ నదిలో గణేష్ నిమజ్జనం జరుగుతున్నప్పుడు కొంతమంది ఆకతాయిలు తాగిన మైకంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. వీరిని అరూప్ భండారి(24) అనే యువకుడు అడ్డుకున్నాడు.
అతడిపై కక్ష పెంచుకున్న దుండగులు రాత్రి సమయంలో ఇంటికి తిరుగెళుతున్న భండారిపై ఇనుపరాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కోమాలోకి వెళ్లిపోయిన భండారి సోమవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో తుదిశ్వాస వదిలాడు. నిందితులపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు తొలుత నిరాకరించారు. స్థానికులు పోలీసు స్టేషన్ ను ముట్టడించడంతో తర్వాత కేసు నమోదు చేశారు.