వారిని శిక్షించకుండా వదలం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ లో యూరీ సెక్టార్ లోని ఆర్మీ బెటాలియన్ ప్రధాన కార్యాలయంపై జరిగిన ఉగ్రవాద దాడిని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ఉగ్రదాడిని పిరికిపందల చర్యగా ఆయన పేర్కొన్నారు. ఈ దాడి వెనుకున్న కుట్రదారులను చట్టముందు నిలబెడతామని జాతికి ఆయన హామీయిచ్చారు. దాడికి పాల్పడిన వారిని శిక్షించకుండా వదలబోమన్నారు.
దాడి గురించి తెలిసిన వెంటనే హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ తో మాట్లాడి పరిస్థితిని సమీక్షించినట్టు తెలిపారు. కశ్మీర్ వెళ్లమని పరీకర్ ను ఆదేశించినట్టు వెల్లడించారు. ఉగ్రవాదుల దాడిలో అమరులైన వీర జవాన్లకు ప్రధాని నివాళి అర్పించారు. వారి త్యాగాన్ని సదా స్మరించుకుంటామని అన్నారు. అమరవీరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఉత్తర కశ్మీర్ లోని యూరీ పట్టణంలో ఆర్మీ బెటాలియన్ ప్రధాన కార్యాలయంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 17 మంది సైనికులు వీరమరణం పొందారు. 19 మంది గాయపడ్డారు. దాడికి పాల్పడిన నలుగురు ముష్కరులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.