గ్రహణాన్ని వీక్షించేందుకు పైకి చూస్తున్న ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: కొత్త సంవత్సరానికి స్వాగత సన్నాహాలు చేస్తున్న వేళ ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. భారత్‌లో గురువారంనాడు ఏర్పడిన పాక్షిక సూర్య గ్రహణం దక్షిణాది రాష్ట్రాల్లో కనువిందు చేసింది. కర్ణాటక, తమిళనాడులో వేలాదిగా బయటకు వచ్చిన ప్రజలు అంతరిక్ష అద్భుతం చూసి ఎంజాయ్ చేశారు. చెన్నై, తిరుచిరాపల్లి, మదురైలో సూర్యగ్రహణం కనువిందు చేసింది. ఢిల్లీ సహా చాలా ప్రాంతాల్లో సూర్యుడు మబ్బుల చాటుకి చేరడంతో సూర్యగ్రహణాన్ని వీక్షించాలన్న ప్రజల ఉత్సాహం ఆవిరైపోయింది. కేరళలో చెర్వతూర్‌లో మొదట సూర్యగ్రహణం కనిపించింది. తర్వాత కోజికోడ్, కన్నూర్‌లో కనువిందు చేసింది.
వాయనాడ్‌లో చాలా మంది ప్రజలు ఆరుబయటకి వచ్చి గ్రహణ దృశ్యాల్ని వీక్షించాలని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ వారికి నిరాశే మిగిలింది. మబ్బులు కమ్మేయడంతో గ్రహణం కనిపించలేదు. ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాల్లో గ్రహణం పూర్తి స్థాయికి చేరుకున్న సమయంలో మబ్బులు పట్టేశాయి. ఉదయం దాదాపుగా 8 గంటలకు మొదలైన గ్రహణం 11 గంటల 15 నిమిషాలకు ముగిసింది. శబరిమలై ఆలయం, పద్మనాభస్వామి ఆలయం, గురువాయూర్ ఆలయాలను గ్రహణం సందర్భంగా మూసివేశారు. గ్రహణానంతరం ఆలయాన్ని శుద్ధి చేశాక భక్తుల్ని అనుమతించారు. ప్రపంచవ్యాప్తంగా వస్తే ఒమన్‌లో అరేబియా సముద్ర తీర ప్రాంతంలో తొలుత సూర్యగ్రహణం కనిపించింది. అరబ్ దేశాలు, సింగపూర్, శ్రీలంక, మలేసియా, ఇండోనేసియా దేశాల్లో సూర్యగ్రహణం కనువిందు చేసింది.
రింగ్ ఆఫ్ ఫైర్ ఎందుకు అంతటా కనిపించలేదంటే...
ఖగోళ అద్భుతాన్ని వీక్షించి 2019 సంవత్సరానికి గుడ్ బై కొట్టాలన్న చాలా మంది ఆశలు ఆవిరయ్యాయి. రింగ్ ఆఫ్ ఫైర్ కనిపిస్తుందని అంచనా వేశారు కానీ చాలాచోట్ల కనిపించలేదు. దీనికి గల కారణాలను తమిళనాడు సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ జాయింట్ డైరెక్టర్ ఎస్. సౌందరరాజపెరుమాళ్ వివరించారు. ‘ఈసారి గ్రహణం సమయంలో చంద్రుడు భూమికి 3.85 లక్షల కి.మీ. దూరంలో ప్రయాణిస్తున్నాడు. శీతాకాలం కావడంతో సూర్యుడికి అత్యంత సమీపంలోకి భూమి వచ్చింది. దీంతో సూర్యుడి పరిమాణం ప్రజలకి చాలా పెద్దదిగా కనిపించింది. భూమికి, సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పటికీ పూర్తిగా సూర్యుడి ఉపరితలానికి అడ్డుగా రాలేకపోవడంతో రింగ్ ఆఫ్ ఫైర్ కనిపించలేదు’అని వెల్లడించారు.
ప్రధానికీ నిరాశే!
సంపూర్ణ సూర్యగ్రహణం వీక్షించాలనే ప్రధాని మోదీ కోరిక తీరలేదు. ‘భారతీయుల్లాగే నేను కూడా ఏడాది చివర్లో వచ్చిన సూర్యగ్రహణాన్ని వీక్షించాలని ఉత్సాహం చూపించాను. దురదృష్టవశాత్తూ మబ్బులు అడ్డం రావడంతో చూడలేకపోయాను. అయితే కోజికోడ్, ఇతర ప్రాంతాల్లో సూర్యగ్రహణ దృశ్యాలను లైవ్‌లో చూశాను. ఈ సందర్భంగా కొంతమంది నిపుణులతో మాట్లాడి గ్రహణంపై అవగాహన పెంచుకున్నాను’’అని మోదీ ట్వీట్ చేశారు. దాంతో పాటు ఎన్నో ఫోటోలను షేర్ చేశారు. మోదీ కళ్లకి నల్లకళ్లద్దాలు పెట్టుకొని సూర్యుడ్ని వీక్షిస్తున్న ఫొటోను ఒక ట్విట్టర్ వినియోగదారుడు షేర్ చేశాడు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయం తెల్సి ప్రధాని చాలా కూల్‌గా ‘ఎంజాయ్’ అంటూ బదులిచ్చారు.
అహ్మదాబాద్‌లో ఫిల్టర్ అద్దాలతో గ్రహణాన్ని చూస్తున్న యువతి
Comments
Please login to add a commentAdd a comment