- హిందూ మున్నని నేత హత్య కేసులో నిందితులు
- పోలీసుల అదుపులో మరో అనుమానితుడు
చెన్నై, సాక్షి ప్రతినిధి: అల్-ఉమ్మాకు చెందిన ముగ్గురు మాజీ తీవ్రవాదులను శుక్రవారం చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. కాశీమేడు ఫిషింగ్ హార్బర్ వద్ద మరో అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. తిరువళ్లూరు హిందూ మున్నని నేత సురేష్‌కుమార్ జూన్ 18వ తేదీ హత్యకు గురయ్యాడు. రాత్రి 10.30 గంటల సమయంలో అంబత్తూరులోని తన పార్టీ కార్యాలయానికి తాళం వేసి ఇంటికి వెళ్లేం దుకు రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. సంయుక్త పోలీస్ కమిషనర్ షణ్ముగవేల్ ఆదేశాల మేరకు సహాయ కమిషనర్ మయిల్‌వాహనన్ నాయకత్వంలో విచారణ బృందం ఏర్పడింది. విద్యార్థులను స్కూల్‌కు చేరవేసే వాహనం నిర్వహించే సురేష్‌కుమార్‌కు ఎవ్వరితోనూ విబేధాలు లేవని, అయితే హిందూ మున్నని నేతగా ఒక సభలో ఇతర మతస్తుల గురించి విమర్శలు చేసినట్లు పోలీసులు కనుగొన్నారు. అయితే ఇది అల్-ఉమ్మా తీవ్రవాదుల పనేనని నిర్దారణకు వచ్చారు.
ఇదే రకం నేరాలపై జైలు శిక్షను అనుభవిస్తున్న పోలీస్ ఫ్రకుద్దీన్, పన్నా ఇస్మాయిల్ తదితరులను విచారించారు. వారికోసం జైలుకు ఎవరెవరు వస్తున్నారని నిఘాపెట్టారు. అజ్ఞాతంలో ఉన్న అల్- ఉమ్మా తీవ్రవాదుల చిట్టాను పరిశీలించారు. ఈ దశలో అంబత్తూరు పాడికి చెందిన నజీర్ (28), కడలూరుకు చెందిన ఖాజా మెహిద్దీ న్ (32), కుతుబుద్దీన్ (30)లను చెన్నైలో శుక్రవారం పట్టుకున్నారు. విచారణలో సురేష్‌కుమార్‌ను హత్య చేసింది తామేనని వారు అంగీకరించారని పోలీసులు తెలిపారు.
హత్యకు దారితీసిన విధానాన్ని వారు వివరిస్తూ, గత ఏడాది డిసెంబ ర్ 12వ తేదీన అంబత్తూరులో జరిగిన హిందూ మున్నని సభలో సురేష్‌కుమార్ ఇతర మతాల పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఈ ముగ్గురూ అగ్రహోద్రులయ్యారు. వారు బస్సులో అంబత్తూరు ఎస్టేట్‌కు చేరుకుని కాపుకాశారు. ఒంటరిగా రోడ్డు దాటుతుండగా నరికి చంపారు. గతంలో అల్-ఉమ్మా తీవ్రవాద సంస్థలో పనిచేసిన వీరు ఆ తరువాత నీది పాశరై అనే సొంత సంస్థను పెట్టుకున్నారు. మారణాయుధాలతోనే అన్యాయాలను ఎదిరించగలమనే భావనను ఒంటబట్టించుకున్నారు.
అదుపులో అనుమానితుడు: చెన్నై శివార్లు కాశీమేడు ఫిషింగ్ హార్బర్ వద్ద ఒక అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం ఉదయం 9.25 గంటల ప్రాంతంలో సుమారు 25 ఏళ్ల యువకుడు చేతి సంచితో అక్కడి ఫైబర్‌బోటులోకి ఎక్కి దానిని స్టార్ట్ చేసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఇంతలో బోటు యజమాని అతన్ని పట్టుకుని కాశీమేడు హార్బర్ పోలీసులకు అప్పగించాడు. అతని చేతిలోని సంచిని తెరిచి చూడగా రూ.10, రూ.50ల నోట్లతో కూడా కరె న్సీ కట్టలు బైటపడ్డాయి. పోలీసుల ప్రశ్నలకు మూగవానివలె సైగలు చేయడం ప్రారంభించాడు. ఆ యువకుడు నిజంగా మూగవాడేనా, సంచిలో ఉన్న డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఆతను ఎవరు అని విచారిస్తున్నారు. సముద్రమార్గంలో పారిపోయే ప్రయత్నాలు చేయడాన్ని బట్టి తీవ్రవాదిగా అనుమానిస్తున్నారు.
ముగ్గురు తీవ్రవాదుల అరెస్ట్
Published Sat, Jul 19 2014 12:14 AM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM
Advertisement
Advertisement