ఎదురుదెబ్బ.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
న్యూఢిల్లీ: ఉగ్రవాదులకు మరోగట్టి ఎదురుదెబ్బ తగిలింది. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులను ఏరిపారేయడమే లక్ష్యంగా పెట్టుకున్న భారత భద్రతా బలగాలు మరో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. వీరంతా కూడా జకీర్ ముసా, అన్సార్ ఘజ్వాతుల్ వర్గానికి చెందిన వారిగా బలగాలు గుర్తించాయి. ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.
పుల్వామా జిల్లాలో బుధవారం మధ్యాహ్నం తర్వాత ఈ ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. సైనిక వర్గాల సమాచారం ప్రకారం పుల్వామా జిల్లాలోని ట్రాల్ ఏరియా గులాబ్ బాగ్ ప్రాంతంలో 182 సీఆర్‌పీఎఫ్, రాష్ట్రీయ రైఫిల్స్, ప్రత్యేక పోలీసు వర్గాలు మధ్యాహ్నం 1.30గంటల గాలింపు చర్యలు చేపడుతుండగా ఒకేసారి ఉగ్రవాదుల సమూహం కాల్పులు జరపడం ప్రారభించడంతో బలగాలు తీవ్రంగా ప్రతిఘటించాయి. బలగాల చేతుల్లో ఇషాక్ అహ్మద్, జహీద్ అహ్మద్, మహ్మద్ అష్రఫ్ దార్ అనే ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.