సాక్షి, కర్ణాటక : తల్లి ఆసుపత్రిలో కరోనా రోగులకు సేవలందిస్తూ ఇంటికి దూరమైంది. దీంతో మూడేళ్ల చిన్నారి తల్లి కోసం తల్లడిల్లింది. అమ్మ కావాలి, అమ్మను చూడాలి అంటూ మారాం చేస్తుండటంతో ఆ చిట్టితల్లికి ఏం చెప్పి ఏడుపు ఆపించాలో ఆ తండ్రికి అర్థం కాలేదు. దీంతో తల్లి పనిచేస్తున్న హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు వాళ్ల నాన్న. కాసేపటి తర్వాత ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన తల్లి తన కూతుర్ని చూసి కన్నీటి సంద్రమైంది. అన్ని రోజులూ హృదయంలో గూడుకట్టుకున్న ప్రేమను దాచుకోలేక అలాగని కూతురి దగ్గరకు వెళ్లలేక దూరం నుంచే ఓదార్చింది. ఈ సంఘటన అక్కడున్న వారందర్నీ కదిలించింది. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చివరకు ముఖ్యమంత్రి యడియూరప్ప దృష్టికి వెళ్లింది. విషయం తెలిసిన వెంటనే బుధవారం ఆ తల్లికి కాల్ చేసి ఆమె నిస్వార్థమైన సేవను మెచ్చుకున్నారు. ఆమెలా కరోనా కోసం జీవితాల్ని పణంగా పెడుతున్న నర్సులందరికీ సాయం చేస్తానని హామీ ఇచ్చారు.
బెల్గాంలోని బెల్గాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్‌లో నాలుగేళ్లుగా స్టాఫ్ నర్సుగా చేస్తున్నారు సునంద. ఆస్పత్రి వైద్య సిబ్బంది, నర్సులు ఉండేందుకు తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. ఇంటికి వెళ్తే తన వల్ల కుటుంబసభ్యులు ఎవరికైనా కరోనా సోకుతుందేమోనన్న భయంతో ఆమె ఇంటికి వెళ్లలేదు. దేశవ్యాప్తంగా డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది, హెల్త్ వర్కర్లు, శానిటేషన్ వర్కర్లు, పోలీసులు, పారిశుధ్య కార్మికులు ఇలా అందరూ కరోనా సోకుతుందని తెలిసినా తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment