న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్‌ఎఫ్) చీఫ్ యాసిన్ మాలిక్ అనారోగ్యంతో బాధ పడుతున్నాడంటూ వస్తున్న వార్తలను తీహార్ జైలు డీజీ ఖండించారు. అవన్నీ కేవలం వదంతులేనని కొట్టిపారేశారు. మాలిక్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఆర్టికల్ 35ఏ, ఆర్టికల్ 370 రద్దు దిశగా కేంద్రం అడుగులు వేస్తుందన్న వార్తల నేపథ్యంలో ప్రస్తుతం జమ్ము కశ్మీర్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఆయన భార్య ముషాల్ హుసేన్ మాలిక్ ఓ వీడియోను విడుదల చేశారు. తన భర్తకు వెంటనే మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలంటూ విఙ్ఞప్తి చేశారు.
కాగా ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నాడనే ఆరోపణలతో యాసిన్ మాలిక్ అరెస్టైన విషయం తెలిసిందే. కశ్మీరీ పండిట్ల ఊచకోతలో మాలిక్ ప్రధాన సూత్రధారిగా వ్యవహరించాడని, జమ్ము కశ్మీర్‌లో నలుగురు ఐఏఎఫ్ అధికారుల హత్యలోనూ జేకేఎల్‌ఎఫ్ హస్తం ఉందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో జాతీయ దర్యాప్తు సంస్థ ఆయనను జమ్మూ కోట్ బల్వాల్ జైలు నుంచి ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించింది.
Comments
Please login to add a commentAdd a comment