JKLF founder
-
సిబ్బందిని పొట్టనబెట్టుకుంది అతడే
జమ్మూ: శ్రీనగర్‌లో 1990 జనవరి 25వ తేదీన భారత వైమానిక దళం(ఐఏఎఫ్) సిబ్బందిపై కాల్పులు జరిపింది జేకేఎల్ఎఫ్ చీఫ్ యాసిన్ మాలిక్ అని ప్రత్యక్ష సాక్షి ధ్రువీకరించారు. ఆ రోజు ఘటన జరిగిన తీరును గురువారం ఐఏఎఫ్ మాజీ కార్పొరల్ రాజ్వర్ ఉమేశ్వర్ సింగ్ ప్రత్యేక సీబీఐ కోర్టుకు చెప్పారు. శ్రీనగర్ వైమానిక కేంద్రానికి వెళ్లేందుకు ఐఏఎఫ్ సిబ్బంది 1990 జనవరి 25వ తేదీ ఉదయం రావల్పొరాలో వాహనం కోసం ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో యాసిన్ మాలిక్‌తోపాటు కొందరు ఉగ్రవాదులు అక్కడికి చేరుకున్నారు. యాసిన్ మాలిక్ తన దుస్తుల్లో నుంచి తుపాకీని బయటకు తీసి, యథేచ్ఛగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో స్క్వాడ్రన్ లీడర్ రవి ఖన్నా సహా నలుగురు నేలకొరగ్గా మరో 40 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఉమేశ్వర్ సింగ్ ఒకరు. తీహార్ జైలులో ఉన్న యాసిన్ మాలిక్ గురువారం జరిగిన కోర్టు విచారణకు వర్చువల్‌గా పాల్గొన్నాడు. ప్రత్యక్ష సాక్షిని క్రాస్ ఎగ్జామిన్ చేయొచ్చని కోర్టు ఇచ్చిన అవకాశాన్ని యాసిన్ మాలిక్ తిరస్కరించాడు. తనను కోర్టులో ప్రత్యక్షంగా హాజరుపరచాలని కోరాడు. ఈ కేసులో మాలిక్, మరో అయిదుగురిపై 1990 ఆగస్ట్ 31వ తేదీన జమ్మూలోని టాడా కోర్టులో చార్జిషీటు దాఖలైంది. 1989లో అప్పటి కేంద్ర మంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ కుమార్తె రుబియా కిడ్నాప్, నేవీ అధికారులపై కాల్పుల కేసులు యాసిన్ మాలిక్‌పై ఉన్నాయి. -
‘అన్నీ అవాస్తవాలు..అతడు బాగానే ఉన్నాడు’
న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్) చీఫ్ యాసిన్ మాలిక్ అనారోగ్యంతో బాధ పడుతున్నాడంటూ వస్తున్న వార్తలను తీహార్ జైలు డీజీ ఖండించారు. అవన్నీ కేవలం వదంతులేనని కొట్టిపారేశారు. మాలిక్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఆర్టికల్ 35ఏ, ఆర్టికల్ 370 రద్దు దిశగా కేంద్రం అడుగులు వేస్తుందన్న వార్తల నేపథ్యంలో ప్రస్తుతం జమ్ము కశ్మీర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఆయన భార్య ముషాల్ హుసేన్ మాలిక్ ఓ వీడియోను విడుదల చేశారు. తన భర్తకు వెంటనే మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలంటూ విఙ్ఞప్తి చేశారు. కాగా ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నాడనే ఆరోపణలతో యాసిన్ మాలిక్ అరెస్టైన విషయం తెలిసిందే. కశ్మీరీ పండిట్ల ఊచకోతలో మాలిక్ ప్రధాన సూత్రధారిగా వ్యవహరించాడని, జమ్ము కశ్మీర్లో నలుగురు ఐఏఎఫ్ అధికారుల హత్యలోనూ జేకేఎల్ఎఫ్ హస్తం ఉందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో జాతీయ దర్యాప్తు సంస్థ ఆయనను జమ్మూ కోట్ బల్వాల్ జైలు నుంచి ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించింది. -
తీహార్ జైలుకు జేకేఎల్ఎఫ్ చీఫ్
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్) చీఫ్ యాసిన్ మాలిక్‌ను జమ్మూ కోట్ బల్వాల్ జైలు నుంచి ఢిల్లీలోని తీహార్ జైలుకు ఎన్ఐఏ తరలించింది. మాలిక్‌ను గురువారం ఎన్ఐఏ కోర్టు ఎదుట హాజరుపరచనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాద నిరోధక చట్టం కింద జేకేఎల్ఎఫ్ను నిషేధించిన నేపథ్యంలో యాసిన్ మాలిక్‌ను అరెస్ట్ చేశారు. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలన్న కేంద్ర ప్రభుత్వ విధానంలో భాగంగా వేర్పాటువాద సంస్ధ జేకేఎల్ఎఫ్ను నిషేధించారని హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా వెల్లడించారు. కశ్మీరీ పండిట్ల ఊచకోతకు మాలిక్ ప్రధాన సూత్రధారిగా వ్యవహరించాడని, జమ్ము కశ్మీర్లో నలుగురు ఐఏఎఫ్ అధికారుల హత్యలోనూ జేకేఎల్ఎఫ్ హస్తం ఉందని ఆయన స్పష్టం చేశారు. కశ్మీర్లో ఉగ్రవాదులకు మాలిక్ నేతృత్వంలోని జేకేఎల్ఎఫ్ నిధులు సమకూరుస్తోందని ఆరోపించారు. -
జేకేఎల్ఎఫ్ను నిషేధించిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్లో యాసిన్ మాలిక్ నేతృత్వంలోని వేర్పాటువాద సంస్థ జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్)ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. కశ్మీర్లో వేర్పాటువాదాన్ని ప్రేరేపించడంలో జేకెఎల్‌ఎఫ్ ప్రమేయంతో ఆ సంస్థను కేంద్రం నిషేధించినట్టు కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా వెల్లడించారు. యాసిన్ మాలిక్ నేతృత్వంలోని జేకేఎల్ఎఫ్ 1988 నుంచి కశ్మీర్లో వేర్పాటువాద సిద్ధాంతాన్ని వ్యాపింపచేస్తోందని చెప్పారు. ఉగ్రవాద నిరోధక చట్టం కింద జేకేఎల్ఎఫ్పై కేంద్రం వేటువేసింది. కాగా జేకేఎల్ఎఫ్, జమ్మూ కశ్మీర్లో ఇటీవల నిషేధానికి గురైన రెండవ సంస్థ కావడం గమనార్హం. మరోవైపు ఇదే నెలలో కేంద్రం జమాతే ఇస్లామి జమ్ము కశ్మీర్ సంస్థనూ నిషేధించింది. కాగా యాసిన్ మాలిక్ నేతృత్వంలోని జేకేఎల్ఎఫ్పై కేంద్రం నిషేధాన్నిపీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ తప్పుపట్టారు. యాసిన్ మాలిక్ హింసను విడనాడి సమస్య పరిష్కార ప్రక్రియలో భాగస్వామిగా ఉన్నాడని, వాజ్‌పేయి ప్రారంభించిన సంప్రదింపుల ప్రక్రియలోనూ పాల్గొన్నాడని చెప్పారు. ఈ సంస్థపై నిషేధం విధించడం ద్వారా ఏం సాధించదలుచుకున్నారని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలు కశ్మీర్‌ను బహిరంగ కారాగారంగా మారుస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. -
అమానుల్లా ఖాన్ కన్నుమూత
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ వ్యవస్థాపకుడు అమానుల్లాఖాన్ (82) మంగళవారం తుది శ్వాస విడిచారు. తీవ్ర ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ పాకిస్తాన్ లోని రావల్పిండిలో మరణించారని ఆయన అల్లుడు సజ్జద్ లోన్ తెలిపారు. గత మూడు వారాలుగా అమానుల్లా ఖాన్ ఆరోగ్యం మరింత విషమించిదని తెలిపారు. ఆయన అంతియ ఘడియల్లో అమానుల్లా ఖాన్ కుమార్తె, తన భార్య ఆస్మాఖాన్, పిల్లలు ఆయనతోనే వున్నామన్నారు. కాగా 1934 ఆగస్టులో జన్మించిన అమానుల్లా కశ్మీర్ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేశారు. ఈ క్రమంలో కొంతమంది న్యాయవాదులతో కలిసి 1977 జెకెఎల్ఎఫ్ ను స్థాపించారు. ఇండియా, పాకిస్తాన్ నుంచి కశ్మీర్ కు స్వేచ్ఛ లభించాలని ఆయన కోరుకున్నారు.