సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్‌లో యాసిన్ మాలిక్ నేతృత్వంలోని వేర్పాటువాద సంస్థ జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్‌ఎఫ్)ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. కశ్మీర్‌లో వేర్పాటువాదాన్ని ప్రేరేపించడంలో జేకెఎల్‌ఎఫ్ ప్రమేయంతో ఆ సంస్థను కేంద్రం నిషేధించినట్టు కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా వెల్లడించారు.
యాసిన్ మాలిక్ నేతృత్వంలోని జేకేఎల్‌ఎఫ్ 1988 నుంచి కశ్మీర్‌లో వేర్పాటువాద సిద్ధాంతాన్ని వ్యాపింపచేస్తోందని చెప్పారు. ఉగ్రవాద నిరోధక చట్టం కింద జేకేఎల్‌ఎఫ్‌పై కేంద్రం వేటువేసింది. కాగా జేకేఎల్‌ఎఫ్, జమ్మూ కశ్మీర్‌లో ఇటీవల నిషేధానికి గురైన రెండవ సంస్థ కావడం గమనార్హం. మరోవైపు ఇదే నెలలో కేంద్రం జమాతే ఇస్లామి జమ్ము కశ్మీర్ సంస్థనూ నిషేధించింది.
కాగా యాసిన్ మాలిక్ నేతృత్వంలోని జేకేఎల్‌ఎఫ్‌పై కేంద్రం నిషేధాన్నిపీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ తప్పుపట్టారు. యాసిన్ మాలిక్ హింసను విడనాడి సమస్య పరిష్కార ప్రక్రియలో భాగస్వామిగా ఉన్నాడని, వాజ్‌పేయి ప్రారంభించిన సంప్రదింపుల ప్రక్రియలోనూ పాల్గొన్నాడని చెప్పారు. ఈ సంస్థపై నిషేధం విధించడం ద్వారా ఏం సాధించదలుచుకున్నారని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలు కశ్మీర్‌ను బహిరంగ కారాగారంగా మారుస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment